ఖండాంతరాలు దాటుతున్న కాలుష్యం
posted on Jan 28, 2017 @ 11:20AM
మీరు ఓ పచ్చని పల్లెటూర్లో ఉన్నారు. ఆ ఊరి చుట్టుపక్కల ఓ వంద కిలోమీటర్ల వరకూ ఎలాంటి పరిశ్రమలూ లేవు. కాలుష్యాన్ని కలిగించే మరే ఇతర లక్షణమూ కనిపించదు. అయినా మీ ఊపిరితిత్తులలోకి కాలుష్యం చేరిపోయే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
ఏరోసోల్
డియోడరెంట్ మీద ఉన్న మూతని నొక్కితే ఒక్కసారిగా అందులోని రసాయనం చిన్న చిన్న బిందువుల రూపంలోకి బయటకు వస్తుంది కదా! ఈ తరహా కణాలను ఏరోసోల్స్ అంటారు. రకరకాల చిన్న చిన్న కణాలు, వాయువుల సముదాయమే ఈ ఏరోసోల్. ఈ మధ్యకాలం వరకూ కూడా వీటి గురించి శాస్త్రవేత్తలు పెద్దగా అధ్యయనం చేయలేదు. కానీ వాటి నిర్మాణం, పనితీరు, పర్యావరణం మీద వాటి ప్రభావం గురించి మొదలైన అధ్యయనాలు ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నాయి.
PAH
polycyclic aromatic hydrocarbons (PAH) అనేవి గాల్లో కాలుష్యాన్ని కలిగించే కణాలు. ఇంధనాన్ని మండించడం, అడవులు తగలబడటం వంటి కారణాల వల్ల ఇవి ఉత్పన్న అవుతాయి. నిన్న మొన్నటి వరకూ ఈ PAHలు కొంత దూరమే వ్యాపిస్తాయి అని నమ్మేవారు. కానీ ఇవి ఏరోసోల్ కణాల రూపంలో సుదూర తీరాలను చేరుకుంటున్నాయని ఇప్పుడే తేలింది.
ఈ విషయాన్ని నిరూపించేందుకు, పరిశోధకులు దాదాపు 300 ప్రదేశాలకు చెందిన గణాంకాలను సేకరించారు. అక్కడి వాయువులలో కాలుష్యకారకాలు ఏమేరకు ఉన్నాయో పరిశీలించారు. ఉదాహరణకు అమెరికాలోని ఒరేగెన్ రాష్ట్రంలో 9,000 అడుగులకి పైగా ఎత్తున ఉన్న ‘మౌంట్ బ్యాచ్‌లర్’ అనే పర్వతం మీద నాలుగురెట్లు ఎక్కువ PAH కణాలు ఉన్నట్లు బయటపడింది. పైగా పసిఫిక్ మహాసముద్రం ఆవల నుంచి ఈ PAHలు తేలి వస్తున్నట్లు గమనించారు.
బలపడుతున్నాయి
కాలుష్యాన్ని కలిగించే PAH కణాలు ఇతర వాయువులతో కలిసినప్పుడు బలపడుతున్నాయని అర్థమైంది. దాంతో అవి ఎంత దూరమైన వేగంగా, బలంగా ప్రయాణించగలుగుతున్నాయట. ఇలా బలపడిన కణాలు ఖండాలను, సముద్రాలను దాటుకునే వెళ్లిపోతున్నాయట. దీని వల్ల మున్ముందు ప్రపంచంలో ఊపిరితిత్తుల సమస్యలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి లక్షమందిలో ఇద్దరు ఈ PAHల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఊహిస్తున్నారు.
కాలుష్య కణాల ప్రమాదం గురించి తెలిసింది కాబట్టి, ఇహ ఇప్పుడు వాటని నివారించే ఉపాయాల గురించి కూడా పరిశోధించాల్సి ఉంది. సంపన్న దేశాలు మునుపటిలాగా మా కాలుష్యంతో మీకేంటి పని అని ఓట్రించడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్య ప్రపంచంలో ప్రతి ఒక్కరిదీనూ!
- నిర్జర.