చిరుతిళ్లే కాదు - వాటి కవర్లూ ప్రమాదమే
posted on Feb 2, 2017 @ 10:11AM
ఒకప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుని కడుపునిండా తినేవారం. కాలం మారిపోయింది. రోడ్డు మీద అలా నడుస్తూ నడుస్తూ... మధ్యలో ఒక శాండ్విచ్ కొనుక్కొని దానిని సుతారంగా పేపర్లోనే ఉంచి తినడం అలవాటైపోయింది. ఇలా చిరుతిళ్లకు చుట్టి ఉంచే పేపర్లు, డబ్బాల వల్ల నానారకాల రోగాలూ వస్తాయని ఓ పరిశోధన హెచ్చరిస్తోంది.
అమెరికా నడిబొడ్డున
ఈ పరిశీలిన ఏదో మన దగ్గర జరిగింది కాదు. అమెరికాలో ఏకంగా 400 నమూనాలను పరిశోధించిన తేల్చిన విషయం. అవి కూడా ఆషామాషీగా రోడ్డు పక్కన కనిపించే బేకరీలలోని నమూనాలు కావు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 27 ప్రముఖ దుకాణాల నుంచి సేకరించారు. దేశంలోనే ప్రముఖ నగరాలైన వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో ఈ సేకరణ సాగింది.
PFAS
శాండ్విచ్లను చుట్టి ఉంచే పేపర్లు, పేస్ట్రీల డబ్బాలు, చిప్స్ వేసి ఇచ్చే కవర్లు... ఇలా అన్నిరకాల ఆహారపదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలో polyfluoroalkyl substances (PFASs) అనే విష రసాయనాలు కనిపించాయి. పేపర్లు, కవర్లు మరకలు అంటకుండా తళతళలాడుతూ ఉండేందుకు, ఈ తరహా రసాయనాలను చేరుస్తున్నట్లు కనుగొన్నారు. నాన్స్టిక్ వంటపాత్రలలోనూ, మరకలు అంటని వస్తువుల తయారీలోనూ ఈ రసాయనాలను వాడుతూ ఉంటారు. శాండ్విచ్లను చుట్టి ఉంచే 40 శాతం పేపర్లలో ఈ PFASల ఆనవాళ్లు కనిపించాయి, ఇక బ్రెడ్ను అందించే 60 శాతం కవర్లలో PFASలు దర్శనమిచ్చాయి. మిగతా పదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలోనూ అంతోఇంతో ఆనవాళ్లు కనిపించాయి.
అయితే ఏంటట!
ఈ PFASల ఉనికి వల్ల ప్రమాదం ఏముంటుందిలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిరుతిండితో పాటుగా ఇవి శరీరంలోకి చేరతాయనీ, ఆ తర్వాత అవి ఒంట్లో పేరుకుపోతాయనీ తేలింది. అలా పేరుకుపోయిన PFASలు మన రక్తంలో కలిసిపోయి నానారకాల రోగాలకు దారితీస్తాయని అంటున్నారు. PFASలు కాలేయం, థైరాయిడ్ వంటి అనేక అవయవాలను దెబ్బతీయడంతో పాటుగా క్యాన్స్ర్కు సైతం దారితీస్తాయని ఈపాటిలే అనేక పరిశోధనలు రుజువు చేశాయి.
వదల బొమ్మాలీ వదల
ఈ PFASలు ఒక్కసారి కనుక శరీరంలోకి చేరితే, అవి ఓ పట్టాన వదిలి పోవట! శరీరంలో పేరుకున్న ఓ 50 శాతం PFASలు వదలడానికి కూడా ఏళ్ల తరబడి పడుతుందట. అంతేకాదు! ఇవి పర్యావరణంలో కూడా అంతగా కలవవని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే తాము ఆహారపదార్థాలను అందిస్తున్న పేపర్ల వెనుక ఇంత విషం దాగుందని సదరు దుకాణాలకు కూడా తెలియవట. కాబట్టి ఈ విషయమై ప్రభుత్వాలే చొరవ చూపాలనీ, వినియోగదారులు జాగ్రత్త వహించాలనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
- నిర్జర.