ఫుట్‌బాల్‌ని తలతో కొడితే...

ఫుట్‌బాల్‌ ఏమంత ఆషామాషీ ఆట కాదు. చూడటానికి బాగానే ఉంటుంది కానీ, బరిలోకి దిగితే ఒళ్లు హూనమైపోతుంది. ఇక ఆటలో నిమగ్నమైపోయి ఏమాత్రం అశ్రద్ధ చూపినా... తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే ఎప్పటికప్పుడు ఆట ఆడే విషయంలో జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. అందులో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇదిగో...

 

 

తలతో ఢీకొట్టవద్దు – 
కొంతమంది ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు తలతో బంతిని ఢీకొంటూ ఉంటారు. సరదా కోసమో, ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసమో, అలవాటులో భాగంగానో... తరచూ తలతోనే బంతిని అడ్డుకుంటూ ఉంటారు. కానీ ఇదేమంత క్షేమం కాదంటున్నారు పరిశోధకులు. ఇలా ఢీకొనడం వల్ల ఏకంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 


ఫుట్‌బాల్‌కు తలని తాకించడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉందేమో గమనించేందుకు పరిశోధకులు కొన్ని వివరాలను సేకరించారు. ఇందుకోసం తరచూ ఫుట్‌బాల్‌ ఆడే ఓ 222 మంది ఆటగాళ్లను ఎన్నుకొన్నారు. ఈ ఆటగాళ్లకి అనేక ప్రశ్నలు సంధించారు. మీరు ఆట ఆడే సమయంలో ఎన్ని సార్లు బంతితో తలని ఢీకొన్నారు? అలా ఢీకొంటున్న తరువాత ఏమన్నా ఆరోగ్య సమస్యలను గమనించారా? వంటి ప్రశ్నలకు జవాబులను సేకరించారు. ఆరునెలల కాలంలో రెండు దఫాలుగా ఈ వివరాలను సేకరించారు.

 


ఫుట్‌బాల్‌ని తలతో ఎక్కువసార్లు తాకించినవారు అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలింది. కొందరైతే రోజుకి దాదాపు పదిసార్లు ఫుట్‌బాల్‌ని తాకించే అలవాటుతో కనిపించారు. ఇలాంటివారిలో దాదాపు మూడురెట్లు అధికంగా మెదడుకి సంబంధించిన సమస్యలు బయటపడ్డాయి. నొప్పి, కళ్లు తిరగడం, దృష్టిని నిలపలేకపోవడం వంటి ఇబ్బందులే కాదు ఒకోసారి స్పృహ కోల్పోయిన సందర్భాలూ కనిపించాయి. ఇక అనుకోకుండా ఇద్దరి ఆటగాళ్ల తలలు ఢీకొంటే పరిస్థితులు మరింత విషమంగా కనిపించాయి. ఇలాంటివారు దాదాపు ఆరురెట్లు అధికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు తతేలింది. కాబట్టి ఫుట్‌బాల్‌ని కాలితో ఆడండి... ఆరోగ్యం బాగుంటుంది. తలతో ఆడారా మతి చెడుతుంది!

 

 

- నిర్జర.