ప్రేమలో ఏం జరుగుతుంది (వాలెంటైన్స్ డే స్పెషల్)

 

ప్రేమ దోమ కుట్టనివారు ప్రపంచంలో అరుదుగా కనిపిస్తారు. అలా ప్రేమలో పడిన మనిషి వింతగా ప్రవర్తిస్తాడని అందరికీ తెలిసిందే! ఆకలి ఉండదు, దాహం వేయదు, నిద్ర పట్టదు... అసలేదీ పట్టదు. ఇంతకీ ఇవన్నీ మనం సరదాగా అవతలివారిని ఏడిపించేందుకు చెప్పే మాటలా లేకపోతే వీటి వెనక ఏదన్నా శాస్త్రీయమైన కారణం ఉందా... అంటే జవాబుగా బోలెడు పరిశోధనలు ముందుకు వస్తున్నాయి. ప్రేమలో మన ప్రతి ఒక్క చర్యకీ స్పష్టమైన కారణాలను అందిస్తున్నాయి.

 

వయసులోకి అడుగుపెడుతూనే

 

టీనేజిలోకి రాగానే మనసు ప్రేమ కోసం తపించిపోయేందుకు కారణం మనలోని హార్మోనులే. ఈ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మగవారిలో టెస్టోస్టెరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్ వంటి హార్మోనులు ప్రేమలో పడమని తొందరపెడుతూ ఉంటాయి.

 

ప్రేమ ఒక మైకం

 

ప్రేమించిన మనిషి మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటుంది. దానికి కారణం డోపమైన్ అనే రసాయనమే! మన మెదడులో ఉత్తేజాన్ని రగిలించే ఆ డోపమైన్తో సిగిరెట్లు, మందు, కొకైన్ తీసుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో... ప్రేమలో ఉన్నప్పుడు అంతే తృప్తిగా ఉంటుంది.

 

లవ్ లవ్ లబ్ డబ్

 

ప్రేమించిన మనిషిని చూడగానే గుండె ఎందుకలా డబడబా కొట్టుకుంటుందో తెలుసా! మన నరాల మీద పనిచేసే అడ్రినలిన్, నోర్ఫినెఫ్రైన్ అనే రసాయనాల ఉత్పత్తి ఎక్కువ కావడం వల్లే. వీటి వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెప్పలేని ఉద్వేగం, ఏమీ తోచకపోవడం వంటి లక్షణాలన్నీ తలెత్తుతాయి.

 

ఒకటే ధ్యాస

 

ప్రేమలో ఉన్న మనిషికి తను ప్రేమించే వ్యక్తి తప్ప మరో మనిషి గురించి ధ్యాసే ఉండదు. దానికీ సెరిటోనిన్ అనే రసాయనమే కారణం. ఈ సెరటోనిన్ అటు జ్ఞాపకశక్తినీ, ఇటు జీర్ణాశయాన్నీ కూడా ప్రభావితం చేస్తుందట. అలాంటి సెరటోనిన్ స్థాయి తగ్గిపోవడంతో మతిమరపుతో ఉండటం, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

ఎందుకంత నమ్మకం

 

ప్రేమించే మనిషి మనని దూకమంటే దూకుతాం, నరకమంటే నరుకుతాం. అంతటి నమ్మకానికి కూడా కారణం ఉందట. వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ అనే రసాయనాల వల్ల మనం సురక్షితంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి సురక్షితమైన భావన కలగడం వల్లే ప్రేమలో అవతలివారిని నమ్ముతాము. వారితో సుదీర్ఘకాలం బంధాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధపడతాము.

 

ప్రేమ గుడ్డిది

 

చివరగా ప్రేమ గుడ్డిది అన్న మాటలో కూడా నిజం లేకపోలేదంటున్నారు. పైన పేర్కొన్న కారణాలన్నింటినీ చూస్తే, ఆ విషయాన్ని ప్రత్యేకంగా రుజువు చేయనవసరం లేదేమో! ప్రేమలో పడ్డవారు ఎంత చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారో, చుట్టూ చూసేవారికి అర్థమవుతూ ఉంటుంది కానీ... ప్రేమికులు మాత్రం తమ లోకంలో తాము విహరిస్తూ ఉంటారు. మెదడులో సుఖాన్ని ప్రేరేపించే కేంద్రానికి రక్తసరఫరా ఎక్కువగా జరుగుతూ ఉండటంతో, ప్రపంచం తలకిందులైపోయినా సరే... తాము మాత్రం తమ బంధంలో హాయిగా ఉండిపోతారు ప్రేమికులు.

- నిర్జర.