Read more!

పత్రికా స్వేచ్ఛకీ సంతోషానికీ లంకె ఉంది

పత్రికా స్వేచ్ఛ అన్న మాట మనకి వింత కాకపోవచ్చు. కానీ చైనా, ఉత్తర కొరియాలాంటి దేశాలలో పత్రికలకు స్వేచ్ఛ అన్నమాటే ఉండదు. ఇలాంటి దేశాలలో పత్రికలు ప్రభుత్వ కనుసన్నలలో మెలగడమో లేదా ప్రభుత్వమే పత్రికలను నడపడమో జరుగుతుంటుంది. ఒక దేశంలో పత్రికా స్వేచ్ఛ సరిగా లేకపోతే అక్కడి ప్రజాస్వామ్యంలో ఏదో లోపం ఉన్నట్లు లెక్క. అంతేకాదు! పత్రికాస్వేచ్ఛకీ పౌరుల సంతోషానికీ కూడా కారణం ఉందని ఆమధ్య ఓ పరిశోధన కూడా నిరూపించింది.

 


ముసోరీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు పత్రికాస్వేచ్ఛ పౌరుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం వారు Freedom House's press freedom index ప్రకారం ఒకో దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో గమనించారు. ఆ ఇండెక్స్‌తో పర్యావరణం, సంతోషం, మానవ వనరులకి సంబంధించిన గణాంకాలను పోల్చి చూశారు. ఆశ్చర్యంగా పత్రికాస్వేచ్ఛ బాగున్న దేశాలలోని పౌరులు సంతోషంగానూ తృప్తిగానూ ఉన్నట్లు బయటపడింది. ఆయా దేశాలలో పర్యావరణం, మానవ వనరుల అభివృద్ధిలో కూడా ఎలాంటి లోటు లేదని తేల్చారు.

 


పత్రికా స్వేచ్ఛ లేని దేశాలలోని పౌరులకి పాలనలో లోపాలనీ, వ్యవస్థలో అన్యాయాలనీ వెలికి తీసుకువచ్చే అవకాశం ఉండదు. చిన్న చిన్న సమాచారాలకు కూడా పూర్తిగా ప్రభుత్వం మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాలలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. ఏ మూల ఏ అన్యాయం జరిగినా ఏదో ఒక పత్రిక దాని మీద వెలుతురు సారించే అవకాశం ఉంది. సహజంగానే అక్కడి ప్రభుత్వం అప్రదిష్ట పాలు కాకుండా ఉండేందుకు ఆయా సమస్యల మీద ఏదో ఒక చర్య తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే కదా పత్రికలను ‘watch dog’ అనేది!

 


ఇంత చదివాక పత్రికాస్వేచ్ఛలో మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలని ఉందా! 2016 సంవత్సరంలో... 180 దేశాలతో విడుదల చేసిన జాబితాలో మన దేశానిది 133వ స్థానం. అవటానికి ఇదేమీ అట్టడుగు స్థానం కాదు కానీ, అలాగని సగర్వంగా చెప్పుకునే స్థాయి కూడా కాదు. మరి వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి ఈ స్థితిలో మరింత మార్పు వస్తుందని ఆశిద్దాం!

 

- నిర్జర.