Read more!

ఇలా చేసుంటే జయలలిత బతికేదేమో!

శరీరంలో ఏ అవయవం చెడిపోయినా దాని బదులు మరో అవయవాన్ని మార్పిడి చేసే అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఊపిరితిత్తులు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కానీ పూర్తిగా చెడిపోయిన ఊపిరితిత్తులను తీసి పక్కన పెట్టేసిన అరుదైన సంఘటన ఒకటి జరిగింది. మున్ముందు ఇలా కూడా చేయవచ్చన్న ఓ కొత్త మార్గాన్ని సూచిస్తోంది.

 


మూడేళ్లుగా అదే సమస్యతో
కెనడాకు చెందిన 32 ఏళ్ల మెలీసాది అందమైన కలలాంటి జీవితం. చక్కగా చూసుకునే భర్త, వెన్నంటి ఉండే తల్లి, ముద్దుముద్దుమాటల రెండేళ్ల పాప... ఇదీ మెలీసా కుటుంబం. కాకపోతే ఆమెది ఒక్కటే సమస్య. మూడేళ్లుగా ఆమె cystic fibrosis అనే ఊపిరితిత్తులు సమస్యతో బాధపడుతోంది. అందుకోసం మంచి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ను వాడుతో్ంది.

 


అకస్మాత్తుగా ఓ రోజు
అంతా చక్కబడుతోందనుకున్న సమయంలో ఓ రోజు మెలీసాకి వ్యాధి తిరగబెట్టింది. దానికి తోడు ఇన్‌ఫ్లూయెంజా కూడా దాడి చేయడంతో విలవిల్లాడిపోయింది. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం, కఫం పేరుకుపోయింది. లోపల గాలి పీల్చుకునేందుకే చోటు మిగల్లేదు. నీటిలో మునిగిపోతున్న పరిస్థితి ఎలా ఉంటుందో అలా తయారైంది మెలిసా! వెంటనే ఆమెకు Extra-Corporeal Lung Support (ECLS) అనే పద్ధతి ద్వారా కృత్రిమ శ్వాసని అందించడం మొదలుపెట్టారు.
కానీ....

 


మెలీసాకు కృత్రిమంగా శ్వాసని అందిస్తున్నారు సరే! కానీ ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి. అవి ఇక బాగుపడి శ్వాసని తీసుకునే పరిస్థితిలో లేవు. కాబట్టి మెలీసాకు మరొకరి ఊపిరితిత్తులలను మార్పిడి చేయాల్సిందే! కానీ అందుకోసం కనీసం ఓ వారం రోజులు పట్టేట్లుంది. పోనీ ఈలోగా ఎలాగొలా కృత్రిమ శ్వాస ద్వారా ఆమెను బతికిద్దామంటే మరో సమస్య ఎదురైంది. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవడం వల్ల, వాటి నుంచి మిగతా శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడం మొదలైంది. అప్పటికే ఆ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆమె కిడ్నీలు దెబ్బతినిపోయాయి. మరొక్క రాత్రి కనుక ఆమెను అలాగే ఉంచితే, శరీరమంతా విషమయంగా మారిపోయి ఆమె చనిపోవడం ఖాయమని తేలింది.

 

ఒక్కటే మార్గం
కొత్తగా అందించే ఊపిరితిత్తులను స్వీకరించేందుకు మెలీసా శరీరం సహకరించాలన్నా, ఆమెలో పాకుతున్న ఇన్ఫెక్షన్‌కు అడ్డుకట్ట వేయాలన్నా Toronto General Hospital (TGH) వైద్యులకు ఒకటే దారి తోచింది. అదే ఆమె ఊపిరితిత్తులను తీసేయడం. కానీ ఇంతవరకు రోజుల తరబడి ఊపిరితిత్తులను తీసి ఉంచే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఏదైతేనేం! సాహసం చేసి చూద్దామనుకున్నారు TGH వైద్యులు.

 

 

ముందడుగు వేశారు
TGH వైద్యులు తొమ్మిదిగంటల పాటు కష్టపడి జాగ్రత్తగా మెలీసా ఊపిరితిత్తులను తొలగించారు. ఆ సమయానికి ఆమె ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి ఫుట్‌బాల్‌ అంత గట్టిపడిపోయాయట. అలా తొలగించిన వెంటనే ఆమె ఊపిరితిత్తులు స్థానంలో తాత్కాలికంగా కృత్రిమ ఊపిరితిత్తులను అమర్చారు. ఇక శరీరంలోని రక్తంలోంచి ఎప్పటికప్పుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తొలగించి, ఆక్సిజన్‌ను అందించేందుకు extracorporeal membrane oxygenation (ECMO) పరికరాన్ని అందించారు. మరో వారం రోజులు మెలీసాకు ఊపిరితిత్తులను దానం చేసే దాత దొరికారు. దాంతో ఆమెకు శాశ్వతమైన సహజమైన ఊపిరితిత్తులను అందించారు.

 

ఇదంతా జరిగి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పుడు ఎలీసా చాలా ఆరోగ్యంగా ఉంది. తన రెండేళ్ల పాపని గంటల తరబడి అలసట లేకుండా ఆడిస్తోంది. మెలీసా సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే, ఊపిరితిత్తుల సమస్య తీవ్రతరం అయ్యే సందర్భాలలో వాటి నుంచి సోకే ఇన్ఫెక్షన్‌తో ప్రాణాలే పోతుంటాయి. యాంటీబయాటిక్స్‌కు ఊపిరితిత్తులు సహకరిస్తాయనో, కొత్త ఊపిరితిత్తులను అమర్చే దాకా అవి బాగుంటాయనో ప్రార్థిస్తూ.... రోగి ప్రాణాలను వదుల్తున్నా కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. జయలలిత విషయంలో కూడా ఆమె ఊపిరితిత్తులు సహకరించకపోవడం వల్లే ఊహించని మృత్యువు చేరువైందని చెబుతున్నారు. మరి ఆమెకు కూడా ఇలాంటి వైద్యం జరిగి ఉంటే....

 

 

- నిర్జర.