ఆరోగ్యనామ సంవత్సరం కోసం
ఒక్క ముద్దని అరాయించుకునే శక్తి లేకపోతే, కోట్ల ఆస్తి ఉండి ఏం లాభం? నాలుగడుగులు వేసే ఓపిక లేకుంటే ఎంత ప్రతిష్ట ఉండీ ఏమిటి ఉపయోగం? అందుకనే ఆరోగ్యానికి మించిన అదృష్టం లేదంటారు పెద్దలు. అనారోగ్యమన్నది ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో చెప్పలేం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కనుక ఆరోగ్యంగా నిండు నూరేళ్లూ జీవించే అవకాశం ఉందని చెబుతుంటారు. అందుకోసం లక్షలు ఖర్చుపెట్టనవసరం లేదు... ఓ ఐదు చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు.
వ్యాయామం
మనిషి దృఢంగా ఉండాలంటే రోజుకి ఇన్ని వేల అడుగులు వేయాలి. వారానికి ఇన్ని గంటలు వ్యాయామం చేయాలి అని చెబుతుంటారు. ఆ లెక్కలన్నీ పక్కనపెడితే ఒంటికి చెమటపట్టేలా, కండరాలన్నీ కదిలేలా ఏదో ఒక శరీర వ్యాయామం లేకపోతే... ఊబకాయం ఖాయం. ఆ ఊబకాయాన్ని అనుసరించి నానారకాల జబ్బులన్నీ ఉచితంగా లభించడమూ తథ్యం. కాబట్టి రోజులో కనీసం ఒక్క అరగంటైనా శరీరానకి కేటాయించాలి. షటిల్లాంటి ఆటలో, నడకలాంటి వ్యాయామమో చేయాలి. ఏదీ లేదంటే కనీసం త్రెడ్మిల్ మీదన్నా నడవాలి.
ఉప్పు తగ్గాలి
American Heart Association ప్రకారం మనిషి సగటున 2,300 మి.గ్రాల సోడియంను మించి తీసుకోరాదు. ఇది ఆరు గ్రాముల ఉప్పుతో సమానం. కానీ ముగ్గురు సభ్యులున్న భారతీయ కుటుంబం కూడా నెలకి ఓ కిలో ఉప్పు ప్యాకెట్ వాడేస్తుంది. అంటే ఒకో భారతీయుడు రోజుకి పది గ్రాముల ఉప్పుని తీసుకుంటున్నాడన్నమాట. ఇది కాకుండా బయట తినే టిఫిన్లు, చిరుతిళ్ల ద్వారా మరో పది గ్రాములు చేరుతుందని అనుకున్నా... తినాల్సిన దానికంటే దాదాపు మూడురెట్లు ఉప్పుని లాగించేస్తుంన్నాం అని అర్థం. మరి ఈ అనర్థాన్ని అదుపు చేసుకోకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాలా! కాబట్టి ఉప్పు వాడకానికి కోతలు వేయాల్సిందే!
నీరు నీరు నీరు
మన కిడ్నీలో రాయిపడేదాకా ఒంట్లో నీరు తగ్గిందని గమనించుకోం. ఊబకాయం తగ్గాలన్నా, చర్మం వెలిగిపోవాలన్నా, కిడ్నీలలో కాల్షియం వంటి వ్యర్థాలు పేరుకోకుండా ఉండాలన్నా, కండరాలు దృఢంగా ఉండాలన్నా... ఆఖరికి గొంతులో కఫం కరగాలన్నా కూడా తరచూ నీరు తాగుతూ ఉండాల్సిందే! నీటి విషయంలో ఎవరి లెక్కలు వారికి కాబట్టి... దాహం వేసినా వేయకున్నా తరచూ నీరు తాగుతూ ఉంటే సరి!
ఒత్తిడా – జీవితమా!
ప్రపంచం పరుగులు తీస్తోంది. కాదనలేం. దాంతో పాటుగా మనం కూడా పరుగులు తీయాల్సిందే. వెనకబడలేం. కానీ- ఆరోగ్యానికీ, కుటుంబానికీ, వృత్తికీ, పెట్టుబడికీ, బంధువులకీ, చదువులకీ, భవిష్యత్తుకీ... దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. మనని మనం కోల్పోకుండా కోరుకున్న విజయాలను సాధించడమే నిజమైన పరిపక్వత. అందుకోసం ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాల్సిందే. ప్రాణాయామమే చేస్తామో, పరిమితులే విధించుకుంటామో, ధ్యానానికి సమయం కేటాయిస్తామో, ప్రకృతితో గడిపేస్తామో మన ఇష్టం. కానీ ఉన్నత శిఖరాలను అందుకుంటున్నామనే భ్రమలో ఏ ఒత్తిడినైతే దరిచేర్చుకుంటామో అదే ఒత్తిడి మనల్ని శారీరికంగా, మానసికంగా అగాధాలలోకి నెట్టివేస్తుందన్న హెచ్చరికను గ్రహించితీరాలి.
వ్యసనాలకు గుడ్‌బై
మందు, సిగిరెట్, కాఫీ, టీ... పేరు ఏదైతేనేం. ఆరోగ్యానికి హాని కలిగించే ప్రతి అలవాటునీ ఓ వ్యసనంగా భావించవచ్చు. ఆఖరికి చాక్లెట్లు, నూడిల్స్, పిజ్జాల సైతం వ్యసనాలే. ఏదో అమయత్వంతో మన అలవాటు అదుపులోనే ఉంది కదా అనుకుంటాం కానీ... విషపూరితమైన పదార్థాలు ఏ స్థాయిలో శరీరంలోకి చేరుకున్నా హాని తప్పదు. కాబట్టి అనారోగ్యాన్ని కలిగించే అలవాటు ఏదున్నా దాన్ని పక్కన పెట్టేయడమే మంచిది. ఎందుకంటే ‘అదుపుగా’ అన్న మాట ఎప్పుడూ అదుపులో ఉండదు కాక ఉండదు.
- నిర్జర.