Read more!

కోటు ఉతుక్కోండి డాక్టరుగారూ!


ఆసుపత్రులలో రకరకాల క్రిములు స్వైరవిహారం చేస్తూ ఉంటాయి. పైగా ఇవి మొండిబారిపోయి ఉంటాయి. వీటిలో కొన్ని సూక్ష్మక్రిములు దాడి చేస్తే... ఎలాంటి మందులూ పనిచేయవు. ఇలాంటి మొండి బ్యాక్టీరియాను ‘సూపర్బగ్’ అని పిలుస్తారు. అందుకనే మన పెద్దలు ఆసుపత్రికి వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చేయమని చెబుతూ ఉంటారు. కానీ అసలు వైద్యుడి ఒంటి మీద ఉన్న తెల్లకోట్లే అనేక రోగాలను వ్యాపింపచేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఐసీయూ వంటి క్లిష్టపరిస్థితులలో ఉన్న రోగుల పాలిట ఇవి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందన్న భయం బలపడుతోంది.

 

నిబంధన లేకపోయినా

 

నిజానికి వైద్యుడనేవాడు తప్పకుండా తెల్లకోటు ధరించాలన్న నిబంధన ఏమీ లేదు. కానీ ఓ వందేళ్ల నుంచీ ఇలా తెల్లకోట్లని ధరించే అలవాటు పెరిగిపోయింది. వైద్య విశ్వవిద్యాలయాలూ, కార్పొరేట్ ఆసుపత్రులూ వచ్చిన తరువాత తెల్లకోటు ధరించడాన్ని ఒక హుందాతనంగా భావించడం మొదలుపెట్టారు. కానీ వీటి శుభ్రత ఏ స్థాయిలో ఉంటోందన్నదే ఇప్పుడు చర్చ. పైగా అరకొర సౌకర్యాలు ఉండే మన దేశంలోని ఆసుపత్రులలో, ఈ కోట్లను ఎక్కడపడితే అక్కడ విడుస్తూ ఉంటారు. కుర్చీలకి తగిలించడమో, బల్లల మీద పడేయడమో, రోగుల మంచాల పక్కన పెట్టడమే చేస్తుంటారు. ఇక కుర్ర డాక్టర్లయితే ఈ తెల్లకోట్లు తీసుకునే షాపింగులకీ, సినిమాలకీ వెళ్లి వస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

శుభ్రత శూన్యం

 

తెల్ల కోట్లు వేసుకోవడం, వేసుకోకపోవడం అన్నది సమస్యే కాదు! వాటిని ఉతక్కపోవడమే అసలు ఇబ్బంది. అమెరికాలో ప్రసిద్ధ విర్జీనియా ఆసుపత్రిలో దీనికి సంబంధించి ఓ సర్వేను నిర్వహించారు. అందులో తేలిందేమిటంటే... కేవలం ఒక్కశాతం వైద్యులు మాత్రమే రోజూ తమ కోటుని ఉతికిస్తారట. ఇక 39 శాతం మంది వారానికి ఓసారి, 40 శాతం మంది నెలకి ఓసారి మాత్రమే తమ కోట్లను శుభ్రం చేయిస్తున్నారు. 17 శాతం మంది సిబ్బంది ఇంతవరకు అసలు తమ కోటుని ఉతకనే లేదని తేలింది!!!

 

వాదోపవాదాలు

 

2015లో బెంగళూరులో జరిగిన ఓ పరిశోధనలో, వైద్యులు తొడుక్కుంటున్న కోట్ల పరిస్థితి ఏమీ బాగోలేదనీ... వాటిని నిషేదించి తీరాలని తీర్మానించారు. ఇలాంటి తీర్మానాలు చాలానే జరిగాయి కానీ, ఆ దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోలేకపోయింది. 2007లో ఇంగ్లాండులోనూ, 2009లో అమెరికాలోనూ ఇలాంటి ప్రస్తావనలు ముందుకు వచ్చినా లాభం లేకపోయింది. మరోవైపు వైద్యులకు తెల్లకోటు ఉండితీరాలన్న వాదన కూడా గట్టిగానే ఉంది. వైద్యుల హుందాతనానికి తెల్లకోటు చిహ్నమని కొందరి నమ్మకం. ఆ తెల్లకోటుని చూసినప్పుడు రోగులలో కాస్త విశ్వాసం కలుగుతోందనీ, తమ సమస్యను కూలంకషంగా చర్చించేందుకు ఆ నమ్మకమే దోహదపడుతోందనీ మరికొన్ని పరిశోధనలు నిరూపించాయి.

 

అదీ విషయం! తెల్లకోటు మీద ఇన్ని చర్చోపచర్చలు జరుగుతున్నాయి కాబట్టి.... మధ్యేమార్గంగా ఓ ఉపాయాన్ని సూచిస్తున్నారు. మోచేతుల వరకు మాత్రమే ఉండే తెల్లకోటుని ధరించడం వల్ల, సమస్య తీవ్రత తగ్గిపోతుందని సూచిస్తున్నారు. బ్రిటన్ వంటి దేశాలలో ఈ నిబంధన ఇప్పటికే అమలులోకి వచ్చేసింది. అన్నింటికీ మించి తమ కోటుని తరచూ శుభ్రం చేసుకోమని వైద్య సంస్థలన్నీ తమ సభ్యులకు సూచిస్తున్నాయి.


- నిర్జర.