ఎంత వినయం.. ఎంత వినయం..
posted on Feb 4, 2014 @ 3:12PM
దొరబిడ్డ కేసీఆర్ నోరు తెరిస్తే సీమాంధ్రులని తిట్టడం మినహా మరోపదం రాదు. సారుగారు సీమాంధ్రులని మాత్రమే తిడతారు. ఇంకెవర్నీ తిట్టరు. పైగా మిగతావాళ్ళ దగ్గర చాలా వినయంగా వుంటారు. ఢిల్లీకి వెళ్ళారంటే ఆ వినయం రెండు మూడింతలు అవుతుంది. ఢిల్లీ వెళ్ళేముందు సమైక్యవాదులని తిట్టిపోసిన కేసీఆర్ ఢిల్లీ వెళ్ళగానే తన నోటికి తాళం వేశారు. తన దొరతనాన్ని ఇంట్లోనే పెట్టి బయటకి వెళ్తున్నారు. జాతీయ పార్టీల నాయకులని కలిసినప్పుడు కేసీఆర్ ఒలికిస్తున్న వినయ విధేయతలని చూడటానికి అక్కడున్నవారికి రెండు కళ్ళూ చాలటం లేదంట. కేసీఆర్ జాతీయ నాయకులను కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కేసీఆర్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కేవలం షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా? వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా? అడ్డగోలు విభజనకు మద్దతు సాధించడం ఎలా? అందుకే షేక్ హ్యాండ్ ఇస్తూనే కేసీఆర్ వాళ్ళ ముందు వినయంగా ఒంగిపోతున్నారు. బాడీని బాగా వంచేసి, తల పూర్తిగా దించేసి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా వినయంగా, ఒద్దికగా, చూసేవాళ్ళకి శాంతిదూతలా కనిపిస్తున్నాడట. రాముడు మంచి బాలుడిలా, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడిలా వున్న ఇంత వినయసంపన్నుడిని సీమాంధ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అని సదరు జాతీయ నాయకులు అనుకుంటున్నారో ఏం పాడో!