చంద్రబాబు వ్యూహం ఫలించేనా?
posted on Feb 5, 2014 @ 10:20AM
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ బిల్లు యధాతధంగా ఆమోదింపబడినట్లయితే రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగదని, అందుకే దానిని తాము వ్యతిరేఖిస్తున్నామని ఆయన వాదిస్తున్నారు. ఆయన వాదన నిజమే అయినప్పటికీ, ఆయన తెలంగాణా ఏర్పాటుని అడ్డుకొంటున్నారనే భావన తెలంగాణా ప్రజలలో వ్యాపిస్తే అందుకు తెలుగుదేశం పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇది తెలిసినప్పటికీ చంద్రబాబు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడం సాహసమేనని చెప్పక తప్పదు. అయితే, బీజేపీ కూడా బిల్లుకి మద్దతు ఇచ్చే ఆలోచనను దాదాపు విరమించుకొన్నట్లే కనబడుతోంది గనుక, ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలనుకొంటున్న చంద్రబాబు, బీజేపీ అధిష్టానం చేత “రానున్నఎన్నికల తరువాత కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే ఉభయ ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తామని” ప్రకటింపజేయగలిగినట్లయితే కొంత ఉపశమనం ఆశించవచ్చును. అయినప్పటికీ తేదేపాకు తెలంగాణాలో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. అయితే, చంద్రబాబు బిల్లుకి వ్యతిరేఖంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలని చేస్తున్న ప్రయత్నాల వలన తెలంగాణా ఏర్పాటు ఆగినా, ఆగకపోయిపోయినా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆదరణ పెరగవచ్చును. కానీ, సీమాంధ్రపై పట్టు కోసం ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు గనుక, వారిరువురు నుండి తెదేపా రానున్న ఎన్నికలలో గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు.