టీ-బిల్లుకి నో ప్రాధాన్యం!
posted on Feb 4, 2014 @ 3:18PM
తెలంగాణ బిల్లు విషయంలో నానా హడావిడి చేస్తూ తొందరపడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి తన బుర్రతిరుగుడు వ్యవహారశైలిని బయటపెట్టుకుంది. ఈ సమావేశాల్లో ఎలాగైనా తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటామని పైకి చెబుతున్నప్పటికీ, లోపల్లోపల మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. కాంగ్రెస్ వ్యవహార శైలి చూసి విభజనవాదుల గుండెల్లో రాయి పడింది. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుతో సహా మొత్తం 39 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వీటిలో ఆరు బిల్లులు చాలా ప్రాధాన్యత వున్న బిల్లులని, ఈ బిల్లుల మీద ఎట్టి పరిస్థితులలోనూ చర్చ జరిపి, బిల్లులను తప్పనిసరిగా ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 39 బిల్లులలో ప్రాధాన్యం వున్న బిల్లులు ఆరు. ఈ ఆరు బిల్లులలో తెలంగాణ బిల్లు లేకపోవడం విభజనవాదుల్లో దడ పుట్టిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని చూసి బిత్తరపోతున్నారు. తెలంగాణ బిల్లుమీద నానా హడావిడి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ బిల్లుని ప్రాధాన్యం లేని బిల్లుల జాబితాలో చేర్చడాన్ని విభజనవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాధాన్యం వున్న బిల్లుల లిస్టు ఆరుతో సరిపెట్టకుండా ఏడు వరకు పొడిగించి తెలంగాణ బిల్లును కూడా ప్రభుత్వం ఆ లిస్టులో చేర్చొచ్చు కదా అని గొణుక్కుంటున్నారు. పైకి మాత్రం తెలంగాణ ఇస్తామని బిల్డప్పు ఇస్తోందే తప్ప కేంద్ర ప్రభుత్వానికి నిజంగా తెలంగాణ ఇచ్చే ఉద్దేశం వుందా, లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.