సీమాంధ్ర ఎంపీలని నమ్మొచ్చా?
posted on Feb 4, 2014 @ 3:07PM
తెలంగాణ అంశం మీద గత పార్లమెంటు సమావేశాల్లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు నానా హడావిడి చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు అలా చేశారో... తమ సొంత బుద్ధితో చేశారోగానీ మొత్తానికి గడచిన రెండు సెషన్స్ లోనూ తెలంగాణ ఇష్యూ మీద పార్లమెంటులో హోరెత్తించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సభని సజావుగా సాగనిచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. సభ సజావుగా సాగకుంటే ఏ బిల్లూ చర్చకూ వచ్చే అవకాశం లేదని అన్నారు. ఇక తెలంగాణ బిల్లు విషయానికి వస్తే అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సభని సజావుగా సాగించే అవకాశం లేదు కాబట్టి, అధికారపార్టీ సభను సజావుగా నడపుతామని హామీ ఇస్తేనే తెలంగాణ బిల్లు గురించి చర్చిస్తామని సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారు. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల నోళ్ళు మూయించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను గప్ చుప్‌గా కూర్చోపెట్టే పథకరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకున్న సీమాంధ్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీల విషయంలో ఆందోళన పడుతున్నారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడే విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఎంతవరకు నమ్మాలన్న విషయం గురించే ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వేసే ఎత్తులకు సీమాంధ్ర ఎంపీలు చిత్తు కారన్న నమ్మకమేమీ లేదు. గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానం చెప్పినట్టల్లా తలూపారు. ఇప్పుడీ కీలక సందర్భంలో కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే తెలుగుజాతికి తీరని ద్రోహం జరిగే ప్రమాదం వుందని సమైక్య వాదులు భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ని బుజ్జగించి, దారిలోకి తెచ్చే ప్రయత్నంలో వున్న కాంగ్రెస్ నాయకత్వం తన ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకంతో వుంది. ఎంపీలు కూడా తాను గీసిన గీత దాటకుండా వుండేలా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.