కాంగ్రెస్ అసమదీయులు, తసమదీయులెవరంటే

  ఈరోజు ఆర్ధికమంత్రి చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మొత్తం సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, మంత్రులు అందరూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగుతారని అందరూ భావించారు. కానీ, కేంద్ర మంత్రులు జేడీ.శీలం, పనబాక లక్ష్మి, యంపీ బొత్స ఝాన్సీ తమ తమ సీట్లకే పరిమితమయి కాంగ్రెస్ అసమదీయుల లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకొనగా, మరో ఇద్దరు మంత్రులు పల్లంరాజు, కిల్లి క్రుపారాణిలు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా అటు అధిష్టానానికి, ఇటు సమైక్యవాదులకు ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకొనేందుకు సభలో కనబడకుండా మాయమయిపోయారు. ఇంతవరకు అధిష్టానానికి విధేయులుగా ముద్రపడ్డ కేంద్రమంత్రులు కావూరి సాంభశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, యంపీ కనుమూరి బాపిరాజు మరియు పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన హర్షకుమార్ సోనియా గాంధీ వారిస్తున్నా వినకుండా స్పీకర్ పోడియం వద్ద నిలబడి ససమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తూ తసమదీయులుగా మారిపోవడం విశేషం.   మరో విశేషమేమిటంటే ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో చేసిన నిరసన దీక్షలో ఆయన పక్కన కూర్చొని దీక్ష చేసిన జేడీ.శీలం, బొత్స ఝాన్సీ లు సభలో మిన్నకుండిపోగా, మన రాష్ట్రంతో, విభజనతో ఎటువంటి సంబంధమూ లేని త్రిణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ యంపీలు సభలో ఆందోళన చేస్తున్ననలుగురు కేంద్రమంత్రులతో కలిసి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వారికి తమ మద్దతు తెలిపారు.   మొన్న లోక్ సభలో గొడవ జరిగినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తమ ఇతర రాష్ట్రాల యంపీలనే మార్షల్స్ గా చేసుకొని సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలపై దాడికి ప్రయోగించిందనే ఆరోపణలను గట్టిగా ఖండించింది. కానీ ఈరోజు చిదంబరం బడ్జెట్ ప్రసంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తమిళనాడు కు చెందిన కాంగ్రెస్ యంపీలను ఆయన చుట్టూ రక్షణ కవచంగా ఏర్పాటు చేయడం గమనిస్తే ఆ ఆరోపణలు నిజమేనని అర్ధమవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం బహుశః ఇందుకు సిగ్గుపడకపోవచ్చును. కానీ యావత్ దేశ ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ దుస్థితికి జాలిపడుతున్నారు.

గందరగోళ౦గా తెలంగాణ ఆమోదం సరికాదు: జైరాం

      తెలంగాణ బిల్లును గందరగోళ పరిస్థితుల మధ్య ఆమోదించడం సరికాదని, ముఖ్యమైన బిల్లులపై సభలో తప్పనిసరిగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లుపై ఏకపక్షంగా వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీతో కలిసి విస్తృత ఏకాభిప్రాయాన్ని కూడగట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు బిల్లును అమోదించుకోవడానికి నాలుగు రోజులే సమయం మిగిలివుందని, అయినా బిల్లు ఆమోదానికి కావలిసిన మద్దతును కూడగడతామన్న విశ్వాసం తనకు ఉందని జైరాం రమేశ్ తెలిపారు. ఇప్పటికే హోం మంత్రి షిండేతో మాట్లాడానని, బిల్లు ప్రవేశపెట్టామని ఆయన స్పష్టం చేశారని, కమల్‌నాథ్ కూడా ఇదే విషయం చెప్పారని జైరాం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన జైరాం రమేశ్ మండిపడ్డారు. నాకు తెలిసినంత వరకు పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లక్ష్మణ రేఖను ఆయన దాటేశాడని వ్యాఖ్యానించారు.

త్వరలోనే ధరలు దిగివస్తాయి : చిదంబరం

  నేడు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు సభలో నిరసనకు దిగారు. సమైక్యాంద్ర నినాదాలు చేస్తూ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర ఎంపీల నిరసనల మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చిదంబరం బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది. త్వరలోనే ధరలు దిగివస్తాయని, ఆహార ఉత్పత్తులు పెరిగాయి. కష్టపడి పనిచేయడం వల్లే వృద్ధిరేటు పెరిగింది. బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వ రంగంలో 10లక్షల ఉద్యోగాలు. దేశంలో 50వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నాయని ఆయన అన్నారు.

పార్లమెంట్లో చిదంబరం బడ్జెట్...గందరగోళం

      స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. చిదంబరం స్పీకర్ కు సీరియల్ నెం. 1 ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బిల్లు ప్రవేశపెడుతున్నట్టు స్పీకర్ కు తెలిపారు. అలాగే గులాం నబీ ఆజాద్ కూడా సీరియల్ నెం. 2 గా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం బిల్లును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. చిదంబరం ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పార్లమెంటు ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సమైక్య నినాదాలతో సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు కావూరి, పురందేశ్వరి వెల్ లోకి దూసుకెళ్లారు. సమైక్యాంధ్ర ప్లే కార్డ్ లు పట్టుకుని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా చిదంబరం తన ఒట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడుతున్నారు. స్పీకర్ సభ్యులను పలుమార్లు సహకరించాలని కోరినా వుయ్ వాంట్ జస్టీస్ అంటూ సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు నినాదాలతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారు.

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠ

  ఢిల్లీలోని రాంలీల మైదానంలో రెండు రోజులపాటు జరిగే "సేవ్ ఆంధ్రప్రదేశ్" సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా విభజన బిల్లు పెట్టిందో జాతీయ పార్టీలకు తెలపడానికే ఈ సభ నిర్వహించబోతున్నాం అని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు సుమారు 15 నుంచి 20 వేల మంది హాజరవుతారని, ఇది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే తమ నిరసన తెలుపుతామని ప్రభుత్వానికి హామీ ఇస్తున్నామన్నారు. అయితే ఇప్పటికే ఈ సభ మొత్తం కూడా సమైక్యాంద్ర శ్రేణులతో నిండిపోయింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి చాలా వేడిగా ఉండి. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరు ఎలా స్పందిస్తారో అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆ విషయంపై మీరా గరం గరం

      లోక్ సభలో తెలంగాణా కాంగ్రెస్ యంపీలను అడ్డుకొనేందుకు యంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పీకర్ మీరాకుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆమె సభాహక్కుల కమిటీకి నివేదించారు. సభా వ్యవహారాలు, ప్రవర్తనా నియమావళిలోని 227 నిబంధన కింద ఆమె ఈమేరకు నివేదించారని లోక్ సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి పరిణామాలు మరోసారి జరగకుండా భద్రత కమీటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. ప్రతిఒక్కదానినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు.

సోనియా 'ఇటాలియన్ గాడ్సే'

      తెలుగుజాతి మధ్య విభజన చిచ్చు పెట్టి, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న సోనియాని గాంధీ అనాలా? గాడ్సే అనాలా? అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన 'ప్రజాగర్జన' సభలో పాల్గొన్న బాబు సోనియా గాంధీ, కాంగ్రెస్ పై నిప్పులు కురిపించారు. తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టి, కుట్రలు పన్ని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి...ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మన్మోహన్ అసమర్థ ప్రధాని అని, సోనియా చేతిలో రోబోలాంటివాడని,ఆమె ఏమి చెబితే అది చేస్తాడని దుయ్యబట్టారు. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి మాట్లాడుతూ... చిన్న రాష్ట్రాలు కావాలంటున్నారు, కానీ, బలవంతం చేయడానికి వీలులేదన్నారు. మరి ఇప్పుడు సోనియా ఏమి చేశారు? రాష్ట్రపతి ఎందుకు ఏమీ చేయలేకపోయారు? అని ప్రశ్నించారు. కొత్తగా వచ్చాడో సైకో, తెలంగాణలో పార్టీని మూసేసి ఇప్పుడు సోనియావాదాన్ని పట్టుకు తిరుగుతున్నారు అని జగన్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒక కుట్రలో భాగంగా చేరాయని ఆరోపించారు. వచ్చె ఎన్నికల్లో వైకాపా, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు.  ప్రజాగర్జనకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. పదునైన విమర్శలు చేస్తున్నప్పుడు హర్షధ్వానాలు చేశారు.

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన

      ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని పేర్కొంది. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేదని గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి తెలియజేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన గవర్నర్ పట్టించుకోలేదు. అసెంబ్లీని రద్దు కాకుండా..రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిపారసు చేశారు. గవర్నర్ నజీబ్ జంగ్ సిపారసు కేజ్రీవాల్ తప్పుబట్టారు. మెజారిటీ ఉన్న ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడంలేదని, అందుకే రాష్ట్రపతి పాలనకు కేంద్రమంత్రివర్గం  ఆమోదం తెలిపిందని ఆరోపించారు. 

లోక్ సభ ఎన్నికలకు 'ఆమ్ ఆద్మీ' సిద్ధం

      లోక్ పాల్ బిల్లు కోసం ఢిల్లీలో అధికారాన్ని వదులుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠ౦ చెప్పాలని భావిస్తోంది. కేజ్రీవాల్ నేతృత్వంలో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నామని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. 'ఝాడూ చలావ్‌యాత్ర' పేరుతో ఈ నెల 23 నుంచి దేశంలోని లోక్ సభ నియోజకవర్గాల ప్రచార హోరుకు ఆప్‌వర్గాలు సిద్దమవుతున్నాయి. అవినీతిపై కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగట్టేందుకు ఆప్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్, బీజేపీల వల్లే తమ ప్రభుత్వం కుప్పకూలిందని ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. జన్‌లోక్‌పాల్‌ను అమలు చేయడమే తమ ప్రాధాన్యాంశమని, ఆ బిల్లునే అడ్డుకున్న తర్వాత అధికారంలో ఉండి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

వీరు త్యాగమూర్తులేనా?

  శాసనసభ తిరస్కరించిన తెలంగాణా బిల్లుని యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెడితే రాజకీయ సన్యాసం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ‘లాస్ట్ బాల్స్’ మిగిలే ఉన్నాయని చెప్పడంతో ఆయన మరికొంత కాలం పదవిలో కొనసాగుతారని స్పష్టమయింది. కానీ మహాయితే మరో రెండు మూడు రోజులు మాత్రమే కొనసాగుతారని ఆయన సన్నిహితుడు మరియు క్యాబినేట్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మీడియాకు తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెడతారా లేక రాజకీయ సన్యాసం తీసుకొంటారా లేకపోతే మంత్రి కొండ్రు మురళి చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? అనే విషయంపై రేపు సీమాంధ్ర నేతలతో జరుగబోయే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చును.   ఆయన మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా గట్టిగా ప్రయత్నించి విఫలమయినట్లు ప్రజలందరికీ నమ్మకం కలిగించాగాలిగారు. కానీ, విభజన జరుగుతోందని చాలా ముందే వీరందరికీ తెలిసి ఉన్నపటికీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయకుండా, అందరూ సమైక్యంగా విభజన బిల్లుని జాగ్రత్తగా పార్లమెంటుకు చేర్చి ఇప్పుడు సమైక్యహీరోలుగా, తమ పదవీ కాలం పూర్తయ్యేవరకు కూడా పదవులలో కొనసాగి, ఇప్పుడు ఎన్నికల ముందు పదవులను, పార్టీని కూడా వదులుకొన్న త్యాగమూర్తులుగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగబోతున్నారు. మరి వీరందరూ త్యాగ మూర్తులే అయితే మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం ఎందుకు? ప్రజలని ఓట్లు కోసం అర్ధించడం ఎందుకు? అని ఆలోచిస్తే వీరి త్యాగాలు దేనికో అర్ధమవుతాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ఓపికగా వేచిచూచిన తరువాత, కొత్తపార్టీలు పెట్టుకోనో లేకపోతే వేరే పార్టీ కండువా కప్పుకోనో ప్రజల ముందుకు వచ్చి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని తిడుతూ ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను, రాష్ట్రం విడిపోయిందనే వారి ఆవేదనను తమకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికే ఈ తిప్పలన్నీ. పోనీ వీరిని నమ్మి ఓటేస్తే మళ్ళీ వీళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో చేరరని నమ్మకమేమిటి? ప్రజలే ఆలోచించుకొని ఓటేయాలి.       

గూడెంలో చంద్రబాబు ప్రజాఘర్జన

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మళ్ళీ ‘ప్రజాగర్జన’ సభలు నిర్వహించనున్నారు. మొదటగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై మరొక రెండు మూడు రోజుల్లో పార్లమెంటు కీలకమయిన నిర్ణయం తీసుకోనున్నఈ తరుణంలో ఆయన ఈ సభ నిర్వహించడం ఆయన రాజకీయ చతురతకి అద్దం పడుతోంది. విభజన బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజల మనోభావాలు ప్రతిబింబిస్తూ ఆయన ప్రసంగం సాగవచ్చును గనుక, వారి నుండి మంచి స్పందనే ఉంటుంది. పైగా అదే జిల్లాకు చెందిన కొత్తపేట కాంగ్రెస్ శాసనసభ్యుడు బండారు సత్యానంద రావు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ను వీడి ఈ సభలోనే చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు కనుక, చంద్రబాబు చేసే ఆరోపణలు కేవలం ఆరోపణలు కాక వాస్తవాలని ద్రువీకరించినట్లవుతుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరెవరితో కలిసి ఏవిధంగా కుట్రలు పన్నుతోందో ఈ సభలో సత్యానందరావు చేతనే చెప్పించిన తరువాత తెలుగుదేశం పార్టీకి కాక మరే ఇతర పార్టీకి ఓటేసినా అది తిరిగి కాంగ్రెస్ ఖాతాలోనే జమా అవుతుందని చంద్రబాబు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును.

19న తెలంగాణ బిల్లు ఆమోదం..!!

      లోక్ సభలో గందరగోళ పరిస్థితుల మధ్య నాటకీయంగా బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, దానిని ఆమోదింపజేసుకోనేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం. మూడు రోజులు సెలవుల అనంతరం సోమవారం ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపట్టనుంది. బడ్జెట్‌ సమావేశానికి సీమాంధ్ర ఎంపీలు అడ్డుతగిలినా..చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేసి తన ప్రసంగాన్ని ఆర్ధిక మంత్రి ముగించేయాలని చూస్తున్నారు. ముఖ్యమైన బిల్లుల ఆమోదం అనంతరం 19న లోక్ సభలో తెలంగాణ బిల్లుపై చర్చించి వెంటనే ఆమోదింపజేసుకోనేందుకు కేంద్రం కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ సమావేశాలు ముగిసేలోపే ఉభయసభల్లో బిల్లును పాస్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా తమ నేతలకు ఈ మేరకు సూచనలు కూడా ఇచ్చారు. ఈ నెల 19 లోగా పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందుతుందని, దానికి అవసరమైన సహకారాన్ని అందరూ అందించాలని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ పై సిన్సియర్ గా వున్నారని, మజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. బిల్లు ఆమోదానికి తీవ్రంగా కృషి చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని చెప్పినట్లు సమాచారం. 

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

      ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించిన కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగలడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ చెప్పింది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు అసెంబ్లీలో బిల్లు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు సభలో గందరగోళం సృష్టించాయి. గవర్నర్ సూచనపై ఓటింగ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేశాయి. బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. దీనికి 42 మంది వ్యతిరేకంగా, 27 మంది అనుకూలంగా ఓటు వేశారు.  దీంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నందున బిల్లును అనుమతించడం లేదని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. తమ ప్రధాన లక్ష్యాన్నే చేరుకోలేనప్పుడు ఇక అధికారంలో ఉండటం అర్థ రహితమని భావించిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు.