మళ్ళీ మొదటికొచ్చిన హైదరాబాద్ సమస్య
posted on Feb 6, 2014 @ 5:49PM
ఈ రోజు మారు సమావేశమయిన కేంద్రమంత్రుల బృందం (జీ.ఓ.యం.) హైదరాబాద్ ను పదేళ్ళ పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా చేసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పూనుకొంటే ఈసారి తెలంగాణా నేతలు, పార్టీలు కేంద్రంపై కత్తులు దూయడం తధ్యం. హైదరాబాదును పదేళ్ళపాటు ఉమ్మడిరాజధానిగా ఉంచేందుకే అంగీకరించని తెలంగాణా నేతలు, ఇప్పుడు హైదరాబాద్ ను ఏకంగా పదేళ్ళపాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తానంటే చూస్తూ ఊరుకొంటారని భావించలేము. మరో రెండు మూడు రోజుల్లో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుని ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఈ సమయానికి కూడా కేంద్రానికి దానిపై ఎటువంటి స్పష్టత లేదని ఇది నిరూపిస్తోంది. కోట్లాది తెలుగు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఇటువంటి కీలకమయిన, సున్నితమయిన అంశాన్ని క్రికెట్ ఆటలో టాస్ వేసి నిర్ణయించినట్లు రెండు మూడు గంటల జీ.ఓ.యం. సమావేశంలో అవలీలగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తే కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయానికి ఎంత తేలికగా తీసుకోన్నదీ స్పష్టమవుతోంది. రాష్ట్రవిభజన చేసి, హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయడం వలన అక్కడ స్థిరపడిన ఆంద్ర ప్రజలకు భద్రత కల్పించవచ్చునేమో కానీ దానివలన అటు తెలంగాణాకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గానీ ఎటువంటి లాభము ఉండబోదు. రాష్ట్ర విభజన చేసిన కారణంగా సీమాంధ్రలో ప్రజలు, హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు తెలంగాణా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికలలో తరిమితరిమి కొడతారు.
ఇంతవరకు సీమాంధ్ర ప్రజలకు మాత్రమే రాష్ట్ర విభజన ఆమోదయోగ్యం కాదని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం హైదరాబాద్ ను పదేళ్ళ పాటు కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తమకు ఆమోదయోగ్యం కాదని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టక మునుపే వారు కూడా తేల్చి చెప్పవచ్చును. అటువంటప్పుడు ఇరుప్రాంతాల ప్రజలకి, పార్టీలకి ఆమోదయోగ్యం కాని రాష్ట్ర విభజన బిల్లుని కేంద్రం ఏవిధంగా పార్లమెంటు చేత ఆమోదింపజేయగలుగుతుంది? చేసినా దానివల్ల కాంగ్రెస్ ఏమి బావుకొంటుంది? ఇంతకీ ఇదంతా చేస్తున్నది ప్రజల సంక్షేమ కోసమా? లేక కాంగ్రెస్ సంక్షేమం కోసమా? అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కూడా జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంది.