డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం
posted on Feb 5, 2014 @ 5:45PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరు ఈరోజు జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన తరువాత వారందరూ రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర విభజనను ఆపమని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము రాష్ట్రపతికి విన్నవించుకొన్న విషయాలను తెలిపారు. “ఇరుప్రాంతల వారికి ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడే రాష్ట్ర విభజన చేయాలి తప్ప ప్రభుత్వం తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను ఆశించిచేయడం తగదు. కేంద్రం చేస్తున్న ఈ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతారు. తెలంగాణా ప్రజలు నీళ్ళు, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే, ఆంధ్ర,రాయలసీమ ప్రజలు ఉన్నత విద్య, వైద్య ఉద్యోగ సమస్యలను ఎదుర్కోక తప్పదు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభ విభజన బిల్లును మూజువాణి ఓటుతో తిరస్కరించింది. అటు ప్రజలు, ఇటు రాష్ట్ర శాసనసభ విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు కూడా కేంద్రం మొండిగా రాష్ట్ర విభజన చేసేందుకు పూనుకోవడం అప్రజాస్వామ్యం. రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన లోపభూయిష్టమయిన విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్దం. ఇంతవరకు ఒక శాసనసభ తిరస్కరించిన బిల్లుని పార్లమెంటు ఎన్నడూ ఆమోదించలేదు. రాజ్యాంగ వ్యతిరేఖంగా సాగుతున్న ఈ విభజన ప్రక్రియను అడ్డుకొని, రాష్ట్ర విభజనను వెంటనే నిలిపివేయమని కేంద్రాన్నిఆదేశించవలసిందిగా రాజ్యాంగ రక్షకుడయిన గౌరవ రాష్ట్రపతి గారిని మేము అందరం కోరాము. ఆయన మా విన్నపాన్ని అంగీకరిస్తారని మేము భావిస్తున్నాము,” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.