బీజేపీని బలోపేతం చేస్తున్న చంద్రబాబు
posted on Feb 6, 2014 @ 10:22AM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒకవైపు రాష్ట్రవిభజనను అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తూనే మరో వైపు ఎన్డీయే కూటమిలో సభ్యపార్టీలన్నిటినీ మళ్ళీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేపనిమీద ఆయన నిన్న మాజీ ప్రధాని దేవగౌడను కూడా డిల్లీలో కలిసి ఆయన నుండి హామీ తీసుకొన్నారు. యా తరువాత చంద్రబాబు స్వయంగా ముంబై వెళ్లి శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ ధాక్రేను కలిసి, విభజన ప్రక్రియను ఆపేందుకు సహకరిస్తామని ఆయన నుండి మాట తీసుకొన్న తరువాత, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, ఎన్డీయే కూటమిలో అందరూ విభేదాలు పక్కనబెట్టి బీజేపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని నచ్చచెప్పారు. ఈరోజు చంద్రబాబు చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేయమని కోరి, ఎన్డీయే కూటమితో కలిసి పనిచేసేందుకు ఆహ్వానించవచ్చును. అయితే మోడీని ద్వేషిస్తూ ఎన్డీయే నుండి బయటకు వెళ్ళిపోయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి కూడా చంద్రబాబు నచ్చజెప్పి మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగితే, ఎన్డీయేకి దానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీకి ఇక వెనక్కి తిరిగి చూసుకోనవసరం ఉండదు.
నరేంద్ర మోడీ తన వాగ్దాటితో, రాజకీయ చాతుర్యంతో ముందుకు దూసుకుపోతుంటే, దేశంలో దాదాపు అందరు ప్రముఖ రాజకీయ నేతలతో, పార్టీలతో సత్సంబందాలుకలిగి మంచి కార్యదక్షకుడిగా పేరొందిన చంద్రబాబు, ఇటువంటి కీలక తరుణంలో బీజేపీకి దగ్గరకావడం ఆ పార్టీకి కొత్త శక్తినిస్తోంది. ఎన్నికలలోగా ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలను, ఎన్డీయేతర పార్టీలను కూడా చంద్రబాబు కూడగట్టగలిగితే, తప్పకుండా అది బీజేపీకి కేంద్రంలో అధికారం కట్టబెట్టగలదు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తులు పెట్టుకోబోతున్న తెదేపాపై కూడా ఆ సానుకూల ప్రభావం బాగా ఉంటుంది గనుక రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో కూడా తేదేపా విజయకేతనం ఎగురవేయవచ్చును.