రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్న అతిధులు

      నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ సన్నద్దమైంది. అతిధులంతా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. బంగాదేశ్ ప్రధాని హసీనా తప్ప మిగిలిన సార్క్ దేశాధినేతల౦తా మోడీ ప్రమాణానికి హాజరయ్యారు. మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి బాలకృష్ణ, చంద్రబాబు, కేసిఆర్, నారా లోకేష్, టిడిపి ఎంపీలు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబానీ కుంటుంబం కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.   బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ కూడా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. అద్వానీతో పాటు కూతురు ప్రతిభ కూడా వచ్చారు. అద్వానీ అబ్దుల్ కలాం తదితరులతో కరచనాలం చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా వచ్చారు. సోనియా గాంధీ, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ సోనియాను పలకరించారు. తన సతీమణితో కలిసి మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకన్నారు.మోడీ సన్నిహితులు అమిత్ షా, రామ్ మాధవ్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన మన్మోహన్ సింగ్ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలను కలిశారు.  

మోడీ కేబినెట్ 45 మంది మంత్రులు వీరే..!

      ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ సహా 45 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులుగానూ, 10 మంది స్వతంత్ర సహాయ మంత్రులుగానూ, 11 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మోదీ మంత్రి వర్గంలో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది.   24 మంది కేబినెట్‌ మంత్రులు: రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కరీ, సందానంద గౌడ, ఉమాభారతి, నజ్మాహెప్తుల్లా, గోపీనాథ్‌ముండే, రాం విలాస్‌ పాశ్వాన్‌, కల్‌రాజ్‌మిశ్రా, మేనకాగాంధీ, అనంతకుమార్‌, రవిశంకర్‌ప్రసాద్‌, అశోక్‌గజపతిరాజు, అనంత్‌గీతే, హర్సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌, జువల్‌ ఓరమ్‌, రాధామోహన్‌సింగ్‌, థామర్చంద్‌ గెహ్లాట్‌, స్మృతి ఇరానీ, డా. హర్షవర్దన్‌ 10 మంది స్వతంత్ర సహాయ మంత్రులు: వీకేసింగ్‌, రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌, సంతోష్‌కుమార్‌ జాంగ్వార్‌, శ్రీపాద నాయక్‌, ధర్మేంద్రప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌గోయల్‌, డా. జితేంద్రసింగ్, నిర్మలాసీతారామన్‌ 11 మంది సహాయ మంత్రులు: జీఎం సిద్ధేశ్వర, మనోజ్‌సిన్హా, ఉపేంద్రకుష్వాహా, పోన్‌ రాధాకృష్ణన్‌, కిరేన్‌ రిజిజూ, కిషన్‌ సార్‌గుజ్జర్‌, సంజీవ్‌ బల్యావ్‌, మన్షుఖ్‌బాయ్‌ దంజీబాయ్‌వసావా, రావుసాహెబ్‌ దాదారావు పాటిల్‌ దాన్వే, విష్ణుదేవ్‌ సహాయ్‌, సుదర్శన్‌ భగత్‌.

మోడీకి వాజ్‌పేయి ఆశీస్సులు

      ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ బీజేపీ మాజీ ప్రధాని వాజ్‌పేయిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దేశంలోనే ఉన్నతమైన భాధ్యతను చేపట్టబోతున్న మోదీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా తగిన సూచనలు, సలహాలను వాజ్‌పేయి దగ్గర తీసుకున్నారు. ఆ తరువాత రాజ్ ఘాట్ సందర్శించి పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. ఆయన చిన్న మంత్రి వర్గంతోనే సుపరిపాలన అందించాలని భావిస్తున్నందున, కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటిన్నిటి బాధ్యత ఒకే మంత్రికి అప్పగించబోతున్నారు. ఇప్పటికే వారి పేర్లతో కూడిన జాబితా రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరిగింది. వారందరినీ రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉండమని కోరుతూ ఆహ్వానాలు పంపడం జరిగింది.

మోడీ ప్రమాణం: ఢిల్లీకి చేరుకున్న నవాజ్, రాజపక్సే

      నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సార్క్ దేశాధినేతలు ఒక్కక్కరు భారత్‌కు చేరుకుంటున్నారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది సేపటి క్రితం న్యూఢిల్లీ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఆయనకు భారత దౌత్యాధికారులు ఘన స్వాగతం పలికారు. తాను శాంతి సందేశం ఇచ్చేందుకే భారత్‌కు వచ్చానని షరీఫ్ తెలిపారు. నవాజ్ షరీఫ్ రేపు భారత కొత్త ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఢిల్లీకి చేరుకున్నారు. కొద్ది సేపటికి క్రితం రాజపక్సే ఇక్కడి విమానాశ్రయంకు చేరుకుని అక్కడ నుంచి ఆయన తనకు ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి హాజరుకావడానికి ఆయన ఇక్కడకు వచ్చారు. కాగా, రాజపక్సే రాకను తమిళ పార్టీలు నిరసిస్తున్న కారణంగా రాజపక్సేకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  

మోడీ క్యాబినెట్ మంత్రుల జాబితా?

  ఈరోజు సాయంత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితం రాజ్ ఘాట్ సందర్శించి పూజ్య బాపూజీకి నివాళులు అర్పించారు. ఆ తరువాత డిల్లీలో గల గుజరాత్ భవన్ లో తన పార్టీ నేతలతో సమావేశమవుతారని సమాచారం. ఆయన చిన్న మంత్రి వర్గంతోనే సుపరిపాలన అందించాలని భావిస్తున్నందున, కొన్ని మంత్రిత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకువచ్చి వాటిన్నిటి బాధ్యత ఒకే మంత్రికి అప్పగించబోతున్నారు. ఉదాహరణకు రైల్వేస్, రోడ్డు రవాణా, షిప్పింగ్ మరియు విమానయాన శాఖలను ఒకే మంత్రి వర్గంగా మార్చబోతున్నారు. అదేవిధంగా మరికొన్ని ఇతర శాఖలను కూడా వాటి ప్రధాన శాఖలలో విలీనం చేయబోతున్నారు. మోడీ క్యాబినెట్ లో దాదాపు 16 క్యాబినెట్ హోదా గల మంత్రులు, మరో 14మంది సహాయ మంత్రులు ఉండవచ్చని తాజా సమాచారం. ఇప్పటికే వారి పేర్లతో కూడిన జాబితా రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరిగింది. వారందరినీ రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రమాణస్వీకారానికి సిద్దంగా ఉండమని కోరుతూ ఆహ్వానాలు పంపడం జరిగింది.   తాజా సమాచారం ప్రకారం మోడీ క్యాబినెట్ లో స్థానాలు దక్కించుకోబోతున్న వారు ఎవరంటే: రాజ్ నాథ్ సింగ్-హోం శాఖ, అరుణ్ జైట్లీ-ఆర్ధిక శాఖ, నితిన్ గడ్కరీ-రైల్వే మరియు రోడ్లు రవాణ శాఖ, సుష్మ స్వరాజ్- విదేశాంగ శాఖ, రవి శంకర్ ప్రసాద్-ఐ.టీ., సమాచార, ప్రసార శాఖ హర్ష వర్ధన్-ఆరోగ్య శాఖ వీరితిబాటు మన రాష్ట్రం నుండి వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు మోడీ క్యాబినెట్ లో కేంద్రమంత్రులుగా చేరనున్నారు. వీరుగాక మేనక గాంధీ, వీకే సింగ్.పీయూష్ గోయల్ తదితరులు కూడా మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రులుగా చేరే అవకాశం ఉంది.

జూన్ 8న బాబు ప్రమాణం

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారరైంది. జూన్ 8న బాబు సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు జన్మ నక్షత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపాయింటెడ్ తేదీని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సిద్ధాంతి ఈ ముహూర్తాన్ని పెట్టారు. గత సంప్రదాయానికి భిన్నంగా చంద్రబాబు ఈసారి ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికిముందు జూన్ మొదటి వారంలో తిరుపతిలో జరిగే టీడీఎల్పీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా బాబును ఎన్నుకుంటారు. బాబు ప్రమాణ స్వీకార సభకు బీజేపీ అగ్రనేతలతోపాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరవుతారని తెలుస్తోంది.

మోడీ క్యాబినెట్ లో నలబై మంది మంత్రులు?

  రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయనతో బాటు కేవలం ఇరవై మంది మంత్రులు మాత్రమే పదవీ ప్రమాణం చేస్తారని మొదట వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం ఆ సంఖ్య రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. వారిలో 24మంది క్యాబినెట్ హోదా మంత్రులు, మిగిలిన 16మంది సహాయ మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత యం. వెంకయ్యనాయుడు, తెదేపా నుండి అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రులుగా పదవీ ప్రమాణం చేసే అవకాశం ఉంది.   ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ విదేశాల ప్రభుత్వ ప్రతినిధులతో బాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, రజనీకాంత్ తదితరులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు, తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తదితరులు కూడా హాజరవుతున్నారు.

వైకాపా యంపీలు జంప్

  నంద్యాల వైకాపా యంపీ యస్.పీ.వై. రెడ్డి, కర్నూలు వైకాపా యంపీ బుట్టా రేణుక భర్త నీలకంటం ఇరువురూ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఈరోజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. నీలకంటంతో బాటు ఆయన బార్య రేణుక కూడా తెదేపాలో చేరిపోవడం దాదాపు ఖాయమయిపోయింది. వైకాపా యంపీలు, యం.యల్యేలు. తమతో టచ్చులో ఉన్నారని తెదేపా నేతలు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారాన్నిఆ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ గా కొట్టిపడేసిన వైకాపా నిజంగానే ఇద్దరు పార్టీ యంపీలు గోడ దూకేయడం చూసి షాక్కు గురయ్యారు.   ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్ధ పార్టీల యంపీలను, యం.యల్యేలను తెదేపాలోకి ఆహ్వానించడం చాలా అనైతికమని ఖండించారు. అధికారం కోసం అర్రులు చాస్తూ కొందరు స్వార్ధపరులు పార్టీని వీడినంత మాత్రాన్న తమపార్టీకి వచ్చే నష్టం ఏమీలేదని అన్నారు. ఇకపై ఒక్కరు కూడా పార్టీ వీడబోరని భరోసా వ్యక్తం చేసారు. అటువంటి నేతలకు, పార్టీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారని అన్నారు. తెదేపా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైకాపా ఆవేదన అర్ధం చేసుకోవచ్చును. కానీ అదే వైకాపా పార్టీ గతేడాది కాంగ్రెస్, తెదేపాలకు చెందిన 29మంది యం.యల్యే.లను గంపగుత్తగా పార్టీలో చేర్చుకొన్నపుడు తమ ప్రతాపం చూడమని జబ్బలు చరుచుకొన్న సంగతి ఇప్పుడు మరిచిపోయారు. అప్పటి నుండి ఎన్నికల వరకు ఎంతమంది ఇతర పార్టీనేతలను వైకాపాలో చేర్చుకొన్నారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి చెందిన యస్.పీ.వై.రెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందు గోడదూకి తమ పార్టీలోకి చేరినప్పుడు ఆయనకు ఎర్ర తివాచి పరిచి నంద్యాల టికెట్ ఇచ్చిన సంగతి మరిచిపోయి, ఇప్పుడు ఆయన తెదేపాలోకి చేరడం అనైతికమని గగ్గోలు పెడుతుండటం హాస్యాస్పదం. తమ పార్టీకి వర్తించని, పాటించని నీతి, నియమాలు ఇతర పార్టీలు పాటించాలని వైకాపా అనుకోవడం విచిత్రం.

బిజెపి అధ్యక్షునిగా జగత్ ప్రకాశ్ నడ్డా..!

      రాజ్‌నాథ్ సింగ్ మోడీ ప్రభుత్వంలో చేరినట్లయితే ఆ పార్టీ అధ్యక్ష పదవిని పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జగత్ ప్రకాశ్ నడ్డాకి అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌కు జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు నడ్డా ఆయన దగ్గర పనిచేసారని, ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఆయనకు ఉందని తెలుస్తోంది. రాజకీయాలలో పూర్వానుభవం ఉన్న నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో 1998 నుంచి 2003 వరకు క్యాబినెట్ లో ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ గా పనిచేసారు. గుజరాత్ భవన్‌లో అమిత్ షాతో కలిసి ఆయన కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం బిజెపి అధ్యక్షునిగా నడ్డాను ఎన్నుకుంటారనే వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.

మోడీ ప్రమాణానికి రజనీ,అమితాబ్,సల్మాన్

      బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్, దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్, కండలవీరుడు సల్మాన్ ఖాన్, సీనియర్ గాయని లతా మంగేష్కర్.. వీళ్లంతా ఈనెల 26వ తేదీన జరిగే నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. ఈ సంవత్సరం జనవరిలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీని లతామంగేష్కర్ ఆశీర్వదించి.. విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక సల్మాన్ ఖాన్ అహ్మదాబాద్లో గాలిపటాల ఉత్సవం సందర్భంగా మోడీని కలిశారు. సల్మాన్ తండ్రి, బాలీవుడ్ కథారచయిత సలీంఖాన్ ఎప్పటినుంచో మోడీ అభిమాని. ఇక ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ కూడా మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 2500 మంది అతిథులు పాల్గొనే ఈ కార్యక్రమం ఎప్పటిలా అశోకా హాల్లో కాకుండా.. రాష్ట్రపతి భవన్ ముందున్న మైదానంలో జరగబోతోంది. ఉభయ సభలకు చెందిన మొత్తం 777 మంది ఎంపీలను రాష్ట్రపతి భవన్ ఆహ్వానించింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ఏపీజే అబ్దుల్ కలాంలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. మోడీ తల్లి హీరాబెన్, ఆయన ముగ్గురు సోదరులు కూడా వస్తారని అనుకుంటున్నా, ఇంకా నిర్ధారణ కాలేదు. కొత్త ప్రధాని 20 మంది అతిథులను, కొత్త మంత్రులు ఒక్కొక్కరు నలుగురి చొప్పున అతిథులను పిలవచ్చు.

మోడీ క్యాబినెట్‌లో ప్రధానశాఖలపై బాబు దృష్టి..!

      మోడీ క్యాబినెట్‌లో ప్రాధాన్యమున్న శాఖలను సంపాదించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు బాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్‌ను సద్వినియోగం చేసుకుని మంచి మంత్రిత్వ శాఖలను దక్కించుకోవాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారు. ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇస్తామని టీడీపీ అధినేతకు బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే తెలియజేసింది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఎక్కువగా ఉండడంతో కనీసం రెండు క్యాబినెట్ మూడు సహాయ మంత్రి పదవులు తీసుకోవాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం మోడీతో టీడీపీ అధినేత చర్చలు జరుపనున్నారు. సీమాంధ్రలో టీడీపీ 15 ఎంపీ సీట్లు, తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలుచుకున్నది. అలాగే పార్టీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులున్నారు. మంత్రి పదవుల కోసం సీనియర్లంతా ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రమాణానికి కుదరని ముహూర్తం

      సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ రెండో తేదీన ఆవిర్భవిస్తోంది. ఆ వెంటనే మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో..బాబు కొన్ని రోజులు ఆగాలని భావిస్తున్నట్లు తేలుస్తోంది. జూన్ ఎనిమిది లేదా తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండవచ్చని చెబుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వాయిదా పడటంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆ తేదీ వరకూ పొడిగిస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్నికల్లో కోస్తా ప్రాంతంలో టీడీపీ భారీ విజయాలు సాధించడంతో ఆ ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం ఉండాలని ఆ ప్రాంత నేతలు పట్టుబడుతున్నారు. దీనితో విజయవాడ గుంటూరు నగరాల మధ్య చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపాకు కీలక శాఖలు

  ఎన్డీయే కూటమిల భాగస్వామి అయిన తెదేపా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చేరబోతున్నట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినందున, అదే విషయమై బీజేపీ అగ్రనేతలతో మాట్లాడేందుకు ఆయన ఈరోజు సాయంత్రం డిల్లీ వెళ్లబోతున్నారు. ఏవో అప్రదాన్యమయిన శాఖలు కాక కీలకమయిన ఒకటి రెండు కేంద్రమంత్రి పదవులయినా తమకు ఇమ్మని చంద్రబాబు కోరాలని ఆ పార్టీ నేతలు ఆయనపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. కానీ బీజేపీలో ఉన్న అనేక మంది సీనియర్ నేతలకి ఇప్పటికే కీలక శాఖలన్నీ కేటాయించబడినట్లు తెలుస్తోంది గనుక తెదేపాకు కీలక శాఖలలో క్యాబినెట్ మంత్రి హోదా దక్కకపోయినప్పటికీ సహాయమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.   తెదేపా నుండి కేంద్రమంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో సుజనా చౌదరి, సీయం. రమేష్, రాయపాటి సాంభశివరావు తదితరులు చాలా మంది పోటీలో ఉన్నారు. అందువల్ల ముఖ్యమయిన శాఖలను దక్కించుకోవడం ఒక ఎత్తయితే, వాటి కోసం పోటీలో ఉన్నవారి నుండి ఒత్తిళ్ళు తట్టుకోవడం చంద్రబాబుకి మరో ఎత్తవుతుంది. నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో సమర్ధులు, నిజాయితీపరులు, తన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చురుకుగా పనిచేయగలవారినే తీసుకోవాలని భావిస్తున్నందున, చంద్రబాబు అందుకు తగిన వ్యక్తులనే ఎంపికచేసుకోవలసి ఉంటుంది. ఈరోజు సాయంత్రం చంద్రబాబు బీజేపీ నేతలతో మాట్లాడిన తరువాత ఈవిషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కెసిఆర్ క్యాబినెట్ 15 మంది.. 2న ప్రమాణం

      తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం రోజే జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 12.57 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజున 15 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ లకీ నెంబర్ ఆరు కనుక మొదటి విడత పదిహేను మంది మంత్రులను తీసుకుంటున్నారని సమాచారం. మిగిలిన ఇద్దరిని ఆ తర్వాత తీసుకుంటారని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఈటెల రాజేందర్‌తో పాటు సిరిసిల్ల స్థానం నుంచి విజయం సాధించిన తన కుమారుడు కెటి రామారావుకు కూడా తొలి విడత మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు.