రాజీనామాకి సిద్ధపడిన సోనియా, రాహుల్

  ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని విధంగా ఘోర పరాజయం పాలు కావడానికి కారణాలను అన్వేషించడానికి సోమవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు పలువురు సీడబ్ల్యూసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. వాడిగా వేడిగా జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడగా, సీడబ్ల్యూసీ మెంబర్లు అడ్డుపడిపోయి వారించడంతో వారు శాంతించారని, ఆ తర్వాత సిడబ్ల్యుసీ ఈ రాజీనామా ప్రతిపాదనను తిరస్కరించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఏఐసీసీని పునర్వ్యవస్థీకరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైనా బాగుపడే అవకాశాలున్నట్టు భావించిన సమావేశం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

బీహార్ కొత్త ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజి?

  ఎన్నికలలో ఘోర పరాజయం కారణంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నితీష్ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అనుకున్నప్పటికీ పార్టీలో తనకు వ్యతిరేకత పెరగడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి శాశ్వతంగా తప్పుకోక తప్పలేదు. పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతని కూడా నితీష్ పైనే వుంచింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి చెందిన దళిత నేత జితన్ రామ్ మంజిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. బీహార్‌లోని ప్రముఖ దళిత నేతగా జితన్ రామ్ మంజికి పేరుంది. నితీష్ కుమార్ ప్రతిపాదనను జేడీయూ పార్టీ పెద్దలు అంగీకరిస్తే బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జితన్ కుమార్ మంజి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ముఖ్యమంత్రి కుర్చీలో పవన్!

  ముఖ్యమంత్రి కుర్చీమీద కూర్చోబోయేది మన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాదు.. అయిదు దఫాలుగా  ముఖ్యమంత్రి పవర్‌ని చేతిలో పెట్టుకున్న సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ మరోసారి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోనున్నారు. 1994 నుంచి చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికలలో చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మరోసారి గెలిచింది. దాంతో చామ్లింగ్ ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని కొనసాగించబోతున్నారు. అంటే, అన్నీ బాగుంటే చామ్లింగ్ ముఖ్యమంత్రిగా పాతికేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేయడం ఖాయమన్నమాట. ఇప్పటి వరకు 23 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరు మీద వుంది. ఇప్పుడు చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించే అవకాశం వుంది. బుధవారం నాడు చామ్లింగ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

తల్లి మృతి: తరుణ్ తేజ్‌పాల్‌కి బెయిల్

  అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేన్సర్తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్(87) సోమవారం కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు, కార్మకాండలు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గతంలో కూడా కొన్నిసార్లు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడటానికి తేజ్‌పాల్‌కి కోర్టు బెయిల్ ఇచ్చింది. గత సంవత్సరం నవంబర్ నెలలో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుంది.

కాంగ్రెస్ ఓటమికి పవన్ కారణం కాదంటున్న చిరంజీవి

  చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి గొప్పతనాన్ని ఆపాదించడానికి ఒప్పుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది కదా అంటే, ఆయన షాకైపోయి కాదుకాదంటున్నారు. టీడీపీ - బీజేపీ కూటమికి తన సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్ల తాము ఓడిపోలేదని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంపై ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పవన్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించిందని, అందుకే ఇక్కడ కూడా తాము ఓడిపోయినట్టు చెప్పారు.

ఐదోసారి సీఎం కుర్చీమీద.. ఎవరా ఘనుడు?

ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలని జగన్ లాంటి వ్యక్తులు నానా తంటాలూ పడుతూ వుంటారు. ఒక వ్యక్తి మాత్రం ఆరామ్ సే ఐదోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇంతకీ ఎవరా ఘనుడు? ఎవరో కాదు.. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ ఛామ్లింగ్. 1994 నుంచి చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికలలో చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మరోసారి గెలిచింది. దాంతో చామ్లింగ్ ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని కొనసాగించబోతున్నారు. అంటే, అన్నీ బాగుంటే చామ్లింగ్ ముఖ్యమంత్రిగా పాతికేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేయడం ఖాయమన్నమాట. ఇప్పటి వరకు 23 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరు మీద వుంది. ఇప్పుడు చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించే అవకాశం వుంది. బుధవారం నాడు చామ్లింగ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఎన్డీయే మీటింగ్‌కి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం

  ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్‌కి వెయిట్ వచ్చింది. మోడీ, చంద్రబాబు గెలిచాక ఆ వెయిట్ మరింత పెరిగింది. పవన్‌కి మోడీ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడం, ట్విట్టర్‌లో కూడా పవన్‌కి థాంక్స్ చెబుతూ మోడీ ట్వీట్ చేయడంతో నేషనల్ లెవల్లో పవన్ లెవల్ పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి మరో గౌరవం లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి ఢిల్లీ నుంచి కబురందింది. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు రాజ్‌‌నాథ్ సింగ్ పవన్ కళ్యాణ్‌కి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు సమాచారం. ఎన్డీయే మీటింగ్‌లో పాల్గొనడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ మంగళవారం బయల్దేరి ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

2019 కాదుకదా.. 2090లోనూ నో ఛాన్స్: హరీష్‌రావు

  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2019లో కాదు కదా... 2090లో కూడా అధికారంలోకి రాలేదని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు జోస్యం చెప్పారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కొంతమంది అనుచరులతో కలసి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇక ప్రతిరోజూ తెరాసలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని చెప్పారు. నర్సారెడ్డి చేరికతో గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయి దుకాణం మూసేసిందన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెసు, టిడిపి ఖాళీ అయ్యే రోజులు ముందు ముందు ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు టులెట్ బోర్డ్ పెట్టక తప్పదని కామెంట్ కూడా చేశారు. సెల్ఫ్ డిక్లెర్డ్ మేధావి లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ తమ పైన కేసులు ఉన్నాయని చెప్పడం విడ్డూరమన్నారు. తమ పైన ఉద్యమ కేసులు తప్ప ఎక్కడా దోపిడీ కేసులు లేవని చెప్పారు. తాము జయప్రకాష్ నారాయణలా ఇంట్లో ఏసి కింద కూర్చొని రాజకీయాలు చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ ఆరోగ్యంపై పుకార్లు

  భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఆయన తీవ్ర అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటూ చికిత్స పొందుతున్నారని సోమవారం నాడు రోజులుగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ పుకారు సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ పుకార్లను అబ్దుల్ కలాం కార్యాలయం ఒక ప్రకటనలో ఖండించింది. అబ్దుల్ కలాం ప్రైవేట్ సెక్రటరీ ఆర్.కె.ప్రసాద్ పేరుమీద విడుదలైన ఈ ప్రకటన అబ్దుల్ కలాం అనారోగ్యంతో వున్నారన్న విషయాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ఈ విషయంలో మా కార్యాలయానికి అనేక ఫోన్లు వచ్చాయి. ఇవన్నీ పుకార్లని అందరికీ స్పష్టం చేస్తున్నాం. అబ్దుల్ కలామ్ చాలా ఆరోగ్యంగా వున్నారు. ఈనెల 17న ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చారు. తన దైనందిన కార్యక్రమాలలో ఆయన నిమగ్నమై వున్నారు. ఈ పుకారు మొదట ఎవరు వ్యాపింపజేశారన్న విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు. ఈ మెసేజ్‌ని మొట్టమొదట ముంబైలోని ఒక సెల్ ఫోన్ జనరేట్ చేసిందని పరిశోధనలో తెలింది. అబ్దుల్ కలాం ప్రస్తుతం అనేకమంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సోమవారం మొత్తం ఆయన ఈ ఉపన్యాస కార్యక్రమంలోనే ఉత్సాహంగా పాల్గొంటున్నారు’’ అని అబ్దుల్ కలాం ప్రైవేట్ సెక్రటరీ వివరణ ఇచ్చారు.

మంత్రివర్గ మంతనాల్లో నరేంద్రమోడీ

  త్వరలో ప్రధాన మంత్రి పీఠాన్ని అలంకరించబోతున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో సహచరులుగా ఎవరుండాలనే అంశం మీద ప్రస్తుతం దృష్టిని కేంద్రకరించారు. దీనికోసం భారీ స్థాయిలో కసరత్తు చేస్తు్న్నారు. దీనిలో భాగంగా తన సన్నిహితుడు, భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ, పలువురు బీజేపీ, ఆర్ఎఎస్ నాయకులతో ఢిల్లీలోని సంఘ్ పరివార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు పార్లమెంట్‌కి ఎన్నికకావడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది. దీనితోపాటు బీజేపీకి పూర్తి మెజారిటీ వున్నప్పటికీ ఎన్నికల ముందే పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు కూడా ప్రభుత్వంలో అవకాశం కల్పించాలన్న ఆలోచనలో మోడీ వున్నట్టు తెలుస్తోంది. అలా ఎన్డీయే భాగస్వా్మ్య పార్టీలలో వున్న మంత్రి పదవి ఆశావహుల సంఖ్య కూడా బాగానే వుంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలూ సంతృప్తిపడేలా మంత్రివర్గాన్ని కూర్చడం కోసం మోడీ శ్రమిస్తున్నట్టు సమాచారం.

జగన్.. నీ మద్దతుకో నమస్కారం: బీజేపీ స్పష్టీకరణ

  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తానని పిలవని పేరంటానికి వెళ్ళినట్టు ఢిల్లీకి వెళ్ళి మరీ చెప్పిన వైఎస్సార్సీపీ నాయకుడు జగన్‌కి బీజేపీ ఒక పెద్ద నమస్కారం పెట్టేసింది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తమ కూటమిలో ఉన్నంత వరకు తమకు ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ అవసరం లేదని బిజెపి సోమవారం స్పష్టం చేసింది. బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి జగన్ మద్దతు అవసరం లేదని మొహమ్మీద కొట్టినట్టు మరీ చెప్పారు. తమ కూటమిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పారు. ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తమకు మరో పార్టీ అవసరం లేదని తేల్చి చెప్పడంతో జగన్ డల్లయిపోయినట్టు సమాచారం.

టీఆర్ఎస్, ఎంఐఎం భాయీ భాయీ...

  టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ కట్టాయి. తెలంగాణలో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి నిర్ణయించుకున్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నందున భవిష్యత్తులో పెట్టుకోబోయే పొత్తులపై త్వరలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య చర్చలు జరగనున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఎంఐఎం తమకు మిత్రపక్షంగానే ఉంటుందని, తమకు పూర్తి సహకారం అందించేందుకు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తమ రెండు పార్టీలు కలిసి నెరవేరుస్తామని అన్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. టీఆర్ఎస్ లౌకికవాద పార్టీ అని, త్వరలో తాము కేసీఆర్ను కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసేందుకు రెండు పార్టీలు యోచిస్తున్నాయి. ఈ కలయిక తెలంగాణను ఎటు తీసుకువెళ్తుందో కాలమే నిర్ణయించాలి.

ఇరగదీసిన క్రికెటర్లు.. గేల్, డివిలయర్స్, కోహ్లీ...

వీరబాదుడు బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్, డివిలియర్స్, కోహ్లీ తమ సహజ శైలిలో వీరబాదుడు బాదడంతో ఐపీఎల్-7లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాంటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు సాధించింది. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్‌లకు తలో వికెట్టు లభించింది. ఆ తర్వాత 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఒక బంతి మిగిలి వుండగానే విజయం సాధించింది. బెంగళూరు ఓపెనర్లు ఓపెనర్ పార్ధీవ్ పటేల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ, క్రిస్ గేల్ (46) పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లి(27) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో ఏబీ డివిలియర్స్(28) పరుగులను దూకుడుగా చేయడంతో బెంగళూర్ గెలుపొందింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ ,డేవిడ్ హస్సీలకు తలో రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిలియర్స్ తప్ప మరొకరు ఎందుకవుతారు?

నరేంద్రమోడీకి మద్దతిస్తా... జగన్ అత్యుత్సాహం

కేంద్రంలో ఎవరి మద్దతూ అవసరం లేని స్థాయిలో భారతీయ జనతాపార్టీ వుంది. అయితే ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుల విషయంలో ఆ పార్టీకి గౌరవం వుంది. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం పిలవని పేరంటంలాగా బీజేపీకీ, ఎన్డీయేకి మద్దతు ఇస్తానని కొత్త పాట అందుకున్నారు. బీజేపీకి చేరువైపోవాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తాను ఎప్పుడూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెబుతున్నారు. మోడీని కలవటానికి ఎంపీల బృందంతో ఢిల్లీకి వెళ్ళిన జగన్ మీడియాతో మాట్లాడుతూ, మోడీ విషయంలో తన పవిత్రతను చాటుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ సహాయం అవసరమని, అందుకు ఎన్డీయెకు అంశాలవారీగా మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు దారుణంగా విభజించిందని, అలా జరిగిన విభజన విషయంలో కొన్ని మార్పులు అవసరమని, బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో ఆ మార్పులను నరేంద్ర మోడీ చేస్తారని ఉద్దేశంతో వినతిపత్రం సమర్పించడానికి వచ్చామని ఆయన చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని మోడీని కోరుతామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఈ దేశ ప్రధాని సాయం అవసరమని, అందుకు అంశాలవారీగా ఎన్డీయేకిమద్దతు ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారు.

జర్నలిస్టులని చావగొట్టిన డీఎంకే కార్యకర్తలు

  ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన డీఎంకే పార్టీ కార్యకర్తలు డిప్రెషన్‌లో, ఫస్ట్రేషన్‌లో వున్నట్టున్నారు. వాళ్ళ కళ్ళకి జర్నలిస్టులు తేరగా కనిపించినట్టున్నారు. అందుకే వాళ్ళని చావగొట్టారు. ఆదివారం డీఎంకే నాయకుడు స్టాలిన్ ఇంట్లో జరిగిన ఒక సమావేశానికిహాజరైన జర్నలిస్టులపై డీఎంకే కార్యకర్తలు దాడికి దిగారు. అందినోళ్ళని అందినట్టు చావబాదారు. ఈ ఘటనలో దాడికి దిగిన డీఎంకే కార్యకర్తలను అరెస్టు చేసిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ఓటమిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డీఎంకే ఈ చావబాదుడు కార్యక్రమం జరిపి వుండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

సోనియా అమాయకురాలు: రేణుక సర్టిఫికెట్!

  సోనియాగాంధీ చాలా అమాయకురాలు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వెనకేసుకొస్తున్నారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన రేణుక తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులుఅవాస్తవాలు చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని, సీమాంధ్రలో ఏమీ కాదని సోనియాను నమ్మించారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే కానీ పని చేసే వారు మాత్రం ఉండరని ఎద్దేవా చేశారు. సోనియాకు బాధాకరమైన పరిస్థితులు కల్పించింది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలే అని రేణుక తిట్టిపోశారు.

జగ్గారెడ్డి @ జనసేన?

  మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి ఆ నియోజవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా వుండాలని నినదించిన నిజమైన తెలుగుబిడ్డ. అయితే టైం బాగాలేక ఆయన ఈసారి ఎన్నికలలో ఓడిపోయారు. అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద రోత పుట్టినట్టు కనిపిస్తోంది. అయిదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలల కోసం ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలలో డెడ్‌బాడీ లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆయన వున్నట్టు తెలుస్తోంది. సోమవారం నాడు పవన్ కళ్యాణ్‌ని కలవటం ఈ అనుమానాలకు బలం ఇస్తోంది. జగ్గారెడ్డి పవన్‌ని కలిసినప్పుడు వారు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తాను పని చేస్తానని తెలిపారు. అయితే ఏవిధంగా ఆయనతో కలిసి పని చేసేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పవన్ మాట్లాడుతూ... తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరమని చెప్పారు. తెలంగాణ విషయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని చెప్పారు. తాను జగ్గారెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు.