నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ లిస్ట్ ఇదేనా..!

      ఈ నెల 26న భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ ఇదేనని మీడియాలో ఓ లిస్టు హల్ చల్ చేస్తుంది. ఫైనల్ గా పదవులు పొందబోయే మంత్రుల జాబితా ఇదేనా, కాదా అన్నది ఈ నెల 26న తేలనుంది. అయితే ప్రస్తుత లిస్ట్ లో మోడీ క్యాబినెట్ అభ్యర్థులు, వారికి కేటాయించిన పోర్టుఫోలియోలు వివరాలు ఇలా వున్నాయి.   నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్: హోమ్ శాఖ : రాజ్నాథ్ సింగ్ ఆర్థిక శాఖ : సుబ్రహ్మణ్య స్వామి విదేశీ వ్యవహారాలు : అరుణ్ జైట్లీ రక్షణ శాఖ : సుష్మా స్వరాజ్ రైల్వే శాఖ : వెంకయ్య నాయుడు ప్ట్టణాభివృద్ధి శాఖ : నితిన్ గడ్కరీ వ్యవసాయశాఖ : గోపీనాథ్ ముండే గ్రామీణాభివృద్ధి శాఖ : అనంత్ గీటే ఆరోగ్యం : హర్షవర్ధన్ న్యాయశాఖ : రవిశంకర్ ప్రసాద్ వాణిజ్యం : ఎస్.ఎస్.అహ్లువాలియా టెలికామ్ : అనంత్ కుమార్ బొగ్గుశాఖ : హన్స్రాజ్ అహిర్ పెట్రోలియం : రామ్ విలాస్ పాశ్వాన్ భారీపరిశ్రమలు : ఆనంద్ రావ్ అద్సుల్ విమానయాన శాఖ : షానవాజ్ హుస్సేన్ మైనారిటీ శాఖ : ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పార్లమెంటరీ వ్యవహారాలు : సుమిత్రా మహాజన్  స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి : అనుప్రియా పటేల్ మానవ వనరులు : బియస్ యడ్యూరప్ప జలవనరులు : పురుషోత్తం రూపాల క్రీడలు : కీర్తీ ఆజాద్ టూరిజం : శ్రీపాద్ నాయక్ సాంస్కృతిక శాఖ : మీనాక్షి లేఖి ఐటి శాఖ : జగదాంబికా పాల్ కార్పొరేట్ వ్యవహారాలు : అనురాగ్ ఠాకూర్ కన్వేన్షనల్ ఎనర్జీ : బిసి ఖండూరి ఎన్ ఆర్ ఐ శాఖ : రాజీవ్ ప్రతాప్ రుధి సోషియల్ జస్టిస్ : బండారు దత్తాత్రేయ సహాయ హోమ్ : సత్యపాల్ సింగ్ సహాయ రక్షణ : వీకే సింగ్ సహాయ వ్యవసాయ శాఖ : రాజు షెట్టి సహాయ సోషియల్ జస్టిస్ : రాందాస్ ఆత్వాలే సహాయ న్యాయశాఖ : కిరీట్ సోమయ్య సహాయ క్రీడాశాఖ : రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

వైకాపాకి మరీ అంత ఆత్రం పనికి రాదు

  ఇటీవల జరిగిన ఎన్నికలలో అవలీలగా గెలిచి ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కంగుతిన్నారు. దుమ్ము దులపండి...ఐదు సంతకాలు పెట్టేస్తాను...అంటూ ఎంత ఊదరగొట్టినా జనం మాత్రం ఆయన మాటలు నమ్మలేదు. చివరికిక చేసేదేమీలేక ప్రజల తరపున పోరాడుతానని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారం చెప్పట్టక మునుపే, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసినట్లు వెంటనే రైతుల రుణమాఫీ చేయాలని మిగిలిన హామీలని కూడా తక్షణమే అమలుచేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి వారి ఆరాటమంతా రైతుల కోసం కాదు. చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే, మళ్ళీ ప్రజలలోకి వెళ్లేందుకు ఒక మంచి బలమయిన కారణం దొరుకుతుందని ఆరాటపడుతున్నారు.   ఇటువంటి కపట ఆలోచనలు చేసినందుకే వైకాపా ఎన్నికలలో ఓడిపోయింది. అయినా ఆ సంగతి మరిచిపోయి, మళ్ళీ తెదేపాను ఏవిధంగా అప్రదిష్టపాలు చేయాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తోంది. గత ఐదేళ్ళుగా జగన్, విజయమ్మ,షర్మిల ముగ్గురూ కూడా జనాల సానుభూతి కోసం ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అందువల్ల మళ్ళీ మరో ఐదేళ్ళ పాటు ఆ సానుభూతి కోసం తిరగడం వృధా ప్రయాసేనని జగన్మోహన్ రెడ్డి కూడా అర్ధమయ్యే ఉండాలి. అందుకని ఇక వచ్చే ఐదేళ్ళు కూడా తెదేపా ప్రభుత్వం తప్పులను వెతికి పట్టుకొని ప్రజలలోకి వెళ్ళవలసి ఉంటుంది. అందుకే వెంటనే రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు తోలి సంతకం చేయాలని వైకాపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ తప్పులు చేస్తే ప్రతిపక్షం వాటిని ఎత్తి చూపవలసిందే. కానీ తెదేపా ఇంకా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టక ముందే, దాని కంటే ముందు వైకాపా నేతలు మరీ ఇంత ఆత్ర పడిపోవడం వల్ల వారే అభాసుపాలవుతారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన రోజు నుండి వైకాపా నేతలు ఇక నిరభ్యంతరంగా ఆ పనిమీదే ఉండవచ్చును.

వైకాపా నేత వడ్డేపల్లి కన్నుమూత

      హైదరాబాద్ కూకట్ పల్లి వైకాపా సీనియర్ వడ్డేపల్లి నర్సింహ రావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో రాష్ట్ర ష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో పనిచేశారు. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డేపల్లి మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కూకట్‌పల్లి టిడిపి ఎమ్మెల్యే కృష్ణా రావు, వైకాపా అధ్యక్షుడు జగన్, తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావు సంతాపం ప్రకటించారు.

కేజ్రీవాల్ ముచ్చట తీరుతోంది

  బీజేపీ నేత నితిన్ గడ్కారీ పై అవినీతి ఆరోపణలు చేసినందుకు జైలుపాలయిన మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి డిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మరో 14రోజులు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించింది. మొన్న కోర్టులో ఆయనను హాజరు పరిచినప్పుడు కోర్టు ఆయనకు రూ.10,000 పూచీకత్తుపై బెయిలు మంజూరు చేస్తానని చెప్పినప్పుడు కేజ్రీవాల్ పూచికత్తుపై బెయిలు పొందేందుకు నిరాకరించడంతో ఆయనకు కోర్టు మూడు రోజులు రిమాండ్ విదించింది. మళ్ళీ ఈరోజు కోర్టులో ఆయనను ప్రవేశపెట్టినప్పుడు స్వయంగా ఆయనే తన కేసుని వాదించుకొన్నారు. అయితే ఈసారి కూడా ఆయన బెయిలు కోరకపోవడంతో కోర్టు ఆయనకు మరో 14రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విదించి, కేసును వచ్చేనెల 6కి వాయిదా వేసింది. పోలీసులు మళ్ళీ ఆయనను తీహార్ జైలుకి తరలించారు. ప్రజలు ఆయనను డిల్లీకి ముఖ్యమంత్రిని చేసి పాలించమని కోరితే, దానిని తృణీకరించిన ఆయన తీహార్ జైలులో ఉండేందుకే ఇష్టపడుతున్నట్లున్నారు. కోర్టు కూడా ఆయన ముచ్చటను కాదనడం దేనికని రిమాండ్ పొడిగించింది. బహుశః మళ్ళీసారి కోర్టుకి హాజరయినప్పుడు బెయిలు కోసం అర్దిస్తారేమో.

చిరు బిజెపిలోకా...రఘువీరా అసంతృప్తి

      కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిరంజీవి బీజేపిలోకి చేరుతున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. చిరు పార్టీ మారటంలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చిరుకు ఎంతో గౌరవం ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందని అన్నారు. అలాంటిది ఆయనకు ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ప్రజలు తీర్పును నేతలను అగీకరించి సీమాంధ్ర అభివృద్దికి పాటు పడాలని అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలోపేతంపై చిరు దృష్టి సారిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉపముఖ్యమంత్రిగా యనమల..!

      తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుకు సమయం దగ్గర పడుతున్నడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్ పైన కసరత్తు ప్రారంభించారు. దీంతో ముఖ్యమైన పదవులను ఎవరికి దక్కనున్నాయో అన్న చర్చ టిడిపి నేతలలో జోరుగా సాగుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదివి కోసం టిడిపిలో ఇద్దరూ ప్రముఖ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో మండలి ప్రతిపక్ష నేత యనమల, సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిలు వున్నారు. అయితే చంద్రబాబు యనమల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన బాబు ముఖ్యమంత్రి పదవిలో వుండగా అదే ప్రాంతానికి చెందిన మరో నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీలో విభేదాలు వస్తాయని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీకి చెందిన యనమలకే ఆ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

బిజెపిలోకి చిరంజీవి..!

      సీమాంధ్రలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అవడానికి మెగాస్టార్ చిరంజీవి రంగం సిద్దం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చే అవకాశాలు కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి పార్టీ మారితే మంచిదని చిరు భావిస్తున్నారట. దీనిపై సన్నిహితులతో ఆయన చర్చించగా తమ్ముడు పవన్ కి సన్నిహితంగా వున్న బీజేపీలోకి వెళ్ళాలని వారు సూచించారట. దీంతో బిజెపి అగ్రనేతతో చిరు రహస్య మంతనాలు కూడా జరపగా ఆయన కూడా సుముఖం వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం.   మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సోదరుడిని బిజెపిలోకి తీసుకురావడానికి రాయబారం వహించినట్లు తెలుస్తోంది. ఎలాగో పవన్ కళ్యాణ్ మద్దతు బిజెపికి వుంది కాబట్టి ఆయన సోదరుడు చిరు కూడా వస్తే సీమాంధ్రలో బిజెపి మరింత బలపడుతుందని ఆ పార్టీ అగ్రనేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నింటికి మించి ఇప్పుడు చిరుకి బిజెపి అవసరం ఎక్కువగా వుందని లేకపోతే అతని రాజకీయ భవిష్యత్ కు త్వరలోనే ముగింపు చెప్పాల్సి వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో చిరు ఎలాంటి ప్రకటన చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.  

కేసీఆర్‌కు అసదుద్దీన్ సూచనలు

      టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ ఎల్పీ నేత కేసీఆర్‌ను అసదుద్దీన్, మజ్లిస్ ఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్‌జాఫ్రిలు కలిసి గంటపాటు చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఏర్పడనున్న తొలి ప్రభుత్వానికి తాము బయటనుంచే సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసిఆర్ కు పలు సూచనలు చేసినట్లు ఒవైసీ తెలిపారు. ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను చేర్చాలని.. ఉర్దూను అధికార భాషగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరెంట్, నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా... కృష్ణా మూడో దశను పూర్తిచేసి, గోదావరి జలాలను నగరానికి తరలించాలన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం ప్రత్యేకంగా పవర్ ప్లాంట్‌ను నెలకొల్పాలని సూచించినట్లు తెలిపారు.

అన్నయ్య తప్పు చేశాడు..తమ్ముడు సరిదిద్దాడు

      సాధారణంగా తమ్ముడు తప్పు చేస్తే అన్నయ్య సరిదిద్దుతూ వుంటాడు. కొణిదెల ఫ్యామిలీ విషయంలో మాత్రం అన్నయ్య చిరంజీవి తప్పుచేస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ సరిదిద్దాడు. ఇంతకీ చిరంజీవి చేసిన తప్పేంటి.. పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా సరిదిద్దాడు? 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.   అప్పట్లో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు పుష్కలంగా వున్నాయి.  మధ్యలో పానకంలో పుడకలా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఓట్లు చీలేలా చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయేలా చేసింది. ఇంతా చేసి ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నికలలో సాధించింది బోడి 18 అసెంబ్లీ సీట్లు అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి తనవంతు పాత్రని పోషించింది. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించకుండా వుంటే ఇలాంటి ఉపద్రవాలు సంభవించి వుండేవే కావు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వుండేది కాదు.. ఎన్నో స్కాములు జరగకుండా వుండేవి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోకుండా వుండేది. ఆ రకంగా ప్రజారాజ్యం పార్టీ తద్వారా చిరంజీవి తప్పు చేశారు. ఆ తప్పును ఇన్నేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సరిదిద్దారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు సహకారాన్ని అందించారు. ఆ రకంగా అన్నయ్య చిరంజీవి ఐదేళ్ళక్రితం చేసిన తప్పుకు తమ్ముడు పవన్ కళ్యాణ్ పరిహారం చేసేశాడు.  

రాజీనామా చేయనుగాక చేయనంతే...

      దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మటాష్ అయిపోగానే బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు కొంతమంది రాజీనామా బాట పట్టారు. బీహార్‌లో నితిష్ కుమార్ రాజీనామా చేసేశాడు. అస్సాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేస్తానని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా, రాహుల్ కూడా రాజీనామా చేసేస్తామని చెబితే కాంగ్రెస్ నాయకులంతా కాళ్ళావేళ్ళాపడి ఆపారు. వీళ్ళ వరస ఇలా వుంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మాత్రం తన పదవికి రాజీనామా చేయనుగాక చేయనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఓటమి తర్వాత పార్టీ నాయకురాలు సోనియాగాంధీని కలసి వచ్చిన వీరభద్రసింగ్ బయటకి వచ్చాక. తనను ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని, ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ఓడిపోయినంత మాత్రాన పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌‌లోని నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.

సీమాంధ్రకు న్యాయం చేయండి: మోడీ

      రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చాలా అన్యాయం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో బలపడాలన్న కాంగ్రెస్ అత్యుత్యాహం వల్ల సీమాంధ్ర ఎంతగానో నష్టపోయింది. విడిపోతామన్నది తెలంగాణ వాదులే అయినప్పటికీ, సీమాంధ్ర అన్యాయానికి గురైంది. చెట్ల కింద కూర్చుని పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితిలో సీమాంధ్ర వుంది. సీమాంధ్రకి విభజనలో అన్యాయం జరిగిందన్న విషయాన్ని ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీకి స్పష్టంగా తెలుసు. ఎన్నికల ముందు కూడా ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ఆయన ఈనెల 26న ప్రధాని పీఠం మీద కూర్చోబోతున్నారు.   ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి రెండు రోజుల క్రితం మోడీని కలిసినట్టు తెలిసింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన వివరాలతో అనిల్ గోస్వామి మోడీని కలిసినట్టు సమాచారం. ఈ సందర్భంగా అనిల్ గోస్వామితో చర్చించిన మోడీ, రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు న్యాయం చేయడానికి ఏయే చర్యలను తీసుకున్నారని ఆయనను ప్రశ్నించారని తెలిసింది. అలాగే విభజన ప్రక్రియలో ఏవైనా లోపాలు వుంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించినట్టు సమాచారం. మోడీతో జరిగిన చర్చ వివరాలను హోంశాఖ కార్యదర్శి కేబినెట్ కార్యదర్శికి తెలియజేయగా, రాష్ట్ర విభజనపై త్వరలో మోడీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి విభజనపై మోడీకి పూర్తి అవగాహన వచ్చేలా చేయాలని కేబినెట్ కార్యదర్శి నిర్ణయించినట్టు తెలుస్తోంది.  ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూశాక మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలంగాణ సెక్రటేరియట్‌లో కల్తీ వుండకూడదు: కేసీఆర్

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మళ్ళీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. గురువారం ఉద్యోగసంఘాల భేటీలో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయంలో కల్తీ ఉండటానికి వీలే లేదు. రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాళ్లు అధికారులైనా, నాయకులైనా, ఉద్యోగసంఘాల నాయకులైనా.. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. లక్షల ఉద్యోగాలు పోతున్నా ఊరుకున్నారు. సహనంతో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా మా స్వేచ్ఛ మాకు ఉండనీయమంటే ఎవ్వరూ సహించరు, భరించరు. రాష్ట్రాలు వేరైనా దేశం ఒకటే, మీరూ బాగుండండి, మేమూ బాగుంటాం. ఎవరి సెక్రటేరియట్లో వాళ్లే ఉందాం. అనవసరంగా కొట్లాడుకుంటామంటే ఇద్దరికీ టైం వేస్టు. అందులో రాజీపడేది లేదు అని కేసీఆర్ అంటున్నారు. ‘‘కచ్చితంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, ఆంధ్ర వాళ్లు ఆంధ్రాలోనే ఉండాలి. మేం మా పరిపాలనలో ఉంటాం.. మీరు మీ పరిపాలనలో ఉండాలి’’ అని స్పష్టంగా చెప్పారు.

జాక్‌పాట్ కొట్టిన టీడీపీ గజపతి: మోడీ కేబినెట్‌లో స్థానం

  విజయనగరం టీడీపీ ఎంపీగా గెలిచిన అశోకగజపతిరాజుకు కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించే అవకాశాలు వుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన్ని అదిరిందయ్యా అశోక్ గజపతీ.. మోడీ కేబినెట్‌లో అవకాశం సంపాదించావని అభినందిస్తున్నారు. ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోడీ కేబినెట్‌లో అశోక్ గజపతి రాజు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చేరుతామని టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయో అన్న అంశంపై రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చ సాగింది. టీడీపీకి మొత్తం 13 మంది ఎంపీలు ఉండగా, వీరిలో ఒకరికి కేబినెట్ ర్యాంకు ఇవ్వనున్నారు. మరో రెండు సహాయ మంత్రులను అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మోడీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా దక్కించుకోనున్న వారిలో ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు ముందు వరుసలో ఉన్నారు.

గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ ప్రమాణం

      గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు గుజరాత్ గవర్నర్ కమలా బేనీవాలా ఆనందీబెన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్, మోడీ, గడ్కరీతో పాటు పలువురు హాజరయ్యారు. కేశుభాయ్, మోడీ ప్రభుత్వాల్లో ఆనందీబెన్ కీలక పాత్ర పోషించారు. ప్రభావశీల మహిళల్లో ఒకరుగా ఆనందీబెన్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గుర్తించింది. ఆనందీ బెన్ పటేల్ 1941 నవంబర్ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ హోదాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కోటీశ్వరురాలు కూడా కాదు. రైతు కుటుంబానికి చెందిన మహిళ. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత.. తదితరాలు ఆమెను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదని పరిశీలకులు అంటున్నారు.

జాతీయ పార్టీగా టిడిపి

      తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారడానికి సిద్దమవుతోంది. ఈ మేరకు ఈ నెలలో జరిగే మహానాడు సమావేశాల్లో తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా నమోదైన టీడీపీ ఇప్పటిదాకా అదే ప్రతిపత్తితో ఉంది. రాష్ట్రం రెండుగా విభజితమైన తర్వాత రెండు రాష్ట్రాల్లో పాత గుర్తుతో పోటీచేయడానికి ఆ పార్టీ జాతీయ పార్టీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మూడు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు వస్తే ఆ పార్టీకి జాతీయ హోదా వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ఓట్ల శాతం సాధించడంలో ఆ పార్టీకి ఇబ్బంది లేదు. మరో రాష్ట్రంలో ఆరు శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీనికోసం తెలుగువారి సంఖ్యాబలం అధికంగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి చోట్ల కూడా పార్టీ శాఖలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపాదన ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది.

అధికారం కోసం ఆమాద్మీ మళ్ళీ వీధి నాటకాలు

  ఒక ఏడాది క్రితం ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తన అనుచరులతో కలిసి డిల్లీ రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు పోలీసులు ఆయనను, ఆయన అనుచరులను అరెస్ట్ చేస్తుండేవారు. కానీ ఆ తరువాత ఆయన డిల్లీ ముఖ్యమంత్రి పీటం అధిష్టించినప్పుడు అదే డిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించేవారు. మళ్ళీ అదే డిల్లీ పోలీసులు ఇప్పుడు ఆయనను తీహార్ జైలుకి తరలించారు. కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం విడుదలచేసిన అవినీతిపరుల జాబితాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి పేరు కూడా ఉండటంతో ఆయన కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసులో కోర్టుకి హాజరయిన కేజ్రీవాల్ బెయిలు కోసం రూ.10,000 కట్టేందుకు నిరాకరించడంతో ఆయనకు డిల్లీ కోర్టు శుక్రవారం వరకు జ్యుడీసరీ రిమాండ్ విదించడంతో పోలీసులు ఆయనను తీహార్ జైలుకి తరలించారు. ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు ఆయన అరెస్టును నిరసిస్తూ జైలు ముందు వీరంగం వేయడంతో పోలీసులు వారిపై కూడా లాటీలు ప్రయోగించవలసి వచ్చింది. ఓడలు బళ్ళవడమంటే బహుశః ఇదేనేమో.   ఒకప్పుడు పదవులు అధికారంపై తమకు ఎటువంటి ఆశలేదని నీతి కబుర్లు పలికిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ఇతర రాజకీయనేతల లాగే, అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మళ్ళీ డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటూ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలిసారు. కానీ అది సాధ్యపడక పోవడంతో, మళ్ళీ తనను ఆదరించిన డిల్లీ ప్రజల మనసులు గెలుచుకొనేందుకు తాము అధికారం నుండి అర్ధాంతరంగా తప్పుకోవడం తప్పేనని, అందుకు డిల్లీ ప్రజలను క్షమించి మళ్ళీ ఎన్నికలలో తమ పార్టీకే పూర్తి మెజార్టీ కట్టబెడితే పూర్తి ఐదేళ్ళు సమర్ధంగా పాలిస్తానని హామీ ఇచ్చారు.   ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇతర రాజకీయ నేతలలాగే ఈ కేసుల వ్యవహారం ద్వారా ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుండటం గమనార్హం. అందుకే కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు అంగీకరించినప్పటికీ, ఆయన పూచీకత్తు కట్టేందుకు నిరాకరించి జైలుకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. అప్పుడు ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇతర రాజకీయ పార్టీలలాగే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు జైలు బయట ధర్నాలు చేసి పోలీసుల చేతిలో లాటీ దెబ్బలు తిని పోలీసు వ్యానులు ఎక్కారు.   అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఆమాద్మీ పార్టీ నేతలు కూడా ఇప్పుడు సరిగ్గా కాంగ్రెస్ పార్టీలాగే వ్యవహరిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. అధికారం కోసం తాము ఆడుతున్న ఈ నాటకాలు ప్రజలకు అర్ధం కావని, వారిని ఇటువంటి నాటకాలతో మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికలలో గెలవవచ్చని ఆమాద్మీ పార్టీ నేతలు భావిస్తున్నారు. అటువంటి నాటకాలు ఆడినందుకే కాంగ్రెస్ పార్టీకి, తమకు కూడా దేశప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో కళ్ళార చూసిన తరువాత కూడా ఆమాద్మీ నేతలు ఇంకా ఇటువంటి వీధి నాటకాలు ఆడటం చూస్తుంటే వారికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని అర్ధమవుతోంది.

గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని?

  త్వరలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించా బోతున్న చద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇరువురూ కూడా హైదరాబాదులో తమకు కేటాయించిన క్యాంపు కార్యాలయాలకు బదులు వేరే చోట కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. చంద్రబాబు గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక భవనంలో తన క్యాంప్ కార్యాలయంగా ఏర్పాటు చేసుకొంటుంటే, కేసీఆర్ కుందన్ భాగ్ లో రెండు మంత్రుల క్వార్టర్లను కలిపి తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముగ్గురూ కూడా బేగంపేటలోని అత్యాధునిక క్యాంప్ కార్యాలయం ఉపయోగించుకొన్నారు. కానీ కేసీఆర్ వాస్తు దృష్ట్యా కుందన్ భాగ్ లో మంత్రుల క్వార్టర్లను తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటున్నారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చంద్రబాబు గుంటూరులో తన కార్యాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు. ఆయన గుంటూరు నుండే పరిపాలన చేయాలనుకొంటున్నందున, ఉన్నతాధికారులు కూడా ఆయనతో బాటే గుంటూరు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. వారందరికీ గుంటూరుకు సమీపంలో ఉన్న మంగళగిరిలో గల ఏపీఎస్పీ బెటాలియన్‌లో తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక సచివాలయంగా మారనుందన్నమాట. గుంటూరు పరిసర ప్రాంతాలలో ఉన్న సువిశాలమయిన ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పరిపాలనా, భద్రతా విభాగాలలో ముఖ్యమయిన శాఖలను, అధికారులను, ఉద్యోగుల కోసం తాత్కాలిక కార్యాలయాలు, వసతి గృహాలు వగైరాలు ఏర్పాటు చేసుకొని వారిని తరలించిన తరువాత, కొత్త రాజధాని నిర్మాణం గురించి ఆలోచించ వచ్చని చంద్రబాబు యోచిస్తున్నారు. ఆయన గుంటూరులో తాత్కాలిక క్యాంపు కార్యాలయం, సచివాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు గనుక కొత్త రాజధాని కూడా గుంటూరు-విజయవాడ మధ్య నిర్మించెందుకే మొగ్గు చూపవచ్చును.

పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి పదవి వద్దన్నాడా?

      ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. తన అన్న చిరంజీవి కూడా అందుకోనంత గౌరవాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అందుకుంటున్నాడు. ఎన్నికలలో పోటీ చేయకుండా, ఒక్క ఎంపీ స్థానం కూడా తన పార్టీ అకౌంట్‌లో లేకుండా వున్నప్పటికీ ఎన్డీయే పార్టీల సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించారంటే భారతీయ జనతాపార్టీ పవన్ కళ్యాణ్‌ని ఎంత గౌరవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక వార్త షికారు చేస్తోంది. మోడీ కేబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కి మంత్రి పదవి ఆఫర్ చేశారని, అయితే పవన్ కళ్యాణ్ తనకు మంత్రి పదవి వద్దని సున్నితంగా తిరస్కరించారనే వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం వుందీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కేంద్రమంత్రి పదవి వస్తుందంటే ఎంత పని చేయడానికైనా సిద్ధంగా వున్న రాజకీయ నాయకులన్న ఇలాంటి రోజుల్లో పిలిచి మంత్రి పదవి ఇస్తానంటే వద్దనేవారు ఎవరైనా వుంటారా? పవన్ కళ్యాణ్ పదవులకు మరీ అంత దూరంగా వుంటారా.. ఈ ప్రచారాన్ని నమ్మొచ్చా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

జ్యుడీషియల్ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్.. ఛలో తీహార్ జైల్

      ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ని దరిద్రం పట్టుకున్నట్టుంది. బంగారం లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని వదిలేశాడు. మొన్న జరిగిన ఎన్నికలలో ఢిల్లీలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుచుకోలేకపోయాడు. తాజాగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసి చాలా తప్పు చేశానని కేజ్రీవాల్ చెంపలు వేసుకున్నాడు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయకండని, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి కేజ్రీవాల్‌కి మద్దతు ఇచ్చే ఛాన్సే లేదని ప్రకటించేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కేజ్రీవాల్ వున్నాడు.   అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌కి మరో తలనొప్పి వచ్చిపడింది. బీజేపీ నాయకుడు గడ్కరి దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కి మే 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు జ్యుడీషియల్ కస్టడీ రాకుండా చేసుకోవాలని కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. రెండు రోజుల పాటు ఆయన తీహార్ జైల్లో వుండక తప్పదు.