ఢిల్లీలో ఎన్నికలకు ఆప్ సిద్దం

      ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడం వల్ల మరోసారి ప్రజల ముందుకు వెల్లుతున్నామని ఆమ్ఆద్మీపార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రజల్లో ఆప్‌పై ఆదరణ తగ్గలేదని అన్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నామని అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం కోరాలని భావించామన్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టగానే. ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి గనుక బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని నిన్న కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తనకే మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిడంతో ఏమిచేయాలో పాలుపోక మళ్ళీ ఎన్నికలకు సిద్దమవుతున్నారు.

వైకాపా ఓటమికి జగనే కారణమా?

  ఈరోజు ఇడుపులపాయలో సమావేశమయిన వైకాపా యం.యల్యే.లు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డినే శాసనసభ పక్షం అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఆ తరువాత ఆయన జిల్లాల వారిగా పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించబోతున్నారు. అయితే ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దమేల?అన్నట్లు కంటికెదురుగా కనబడుతున్నకారణాల కోసం లోతుగా అధ్యయనం చేయవలసిన పనేమీ లేదు. ఈ ఎన్నికలలో వైకాపా పరాజయానికి ప్రధాన కారణాలు ఏమిటంటే:   1. ప్రజలు వద్దనుకొంటున్న కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి ఉండటం. ఆయనకు ఓటేస్తే వారు వద్దనుకొంటున్న కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కనుకనే వైకాపా కూడా తిరస్కరణకు గురయింది. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు రహస్య అవగాహన ఉందని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెపుతున్నప్పటికీ ఆయన దానిని ఖండించకపోగా, ఎన్నికల తరువాత సీమాంధ్రకు సహకరించే పార్టీకే మద్దతు ఇస్తానని ప్రగల్భాలు పలకడంతో, ప్రజలలో ఆయనపట్ల ఉన్న అనుమానాలు మరింత పెరిగాయి.   2. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసులు, అవినీతి ఆరోపణలు. అనుభవరాహిత్యం. దుందుడుకు స్వభావం.   3. గత ఐదేళ్ళ కాలంలో గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకొనే అవకాశం ఉన్నపటికీ, దానిని విస్మరించి, తండ్రి మరణం తాలూకు సానుభూతినే నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళడం. గత ఐదేళ్ళుగా ప్రజలలో ఆ సానుభూతిని నిలిపి ఉంచుకోనేందుకు ఓదార్పు యాత్రలు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో ఆ సానుభూతిని ఓట్లుగా మారకపోవడం.   4. అన్ని విషయాలలో ఎప్పుడు చాలా చురుకుగా కదిలే జగన్మోహన్ రెడ్డి, విజయావకాశాలున్న బీజేపీని మతతత్వ పార్టీ అని, నరేంద్ర మోడీతో చేతులు కలిపితే మైనార్టీ ఓట్లు పోగొట్టుకోవలసి వస్తుందని వెనుకంజ వేయడం.   5. రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు, సీమాంద్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు భూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం.   6. నీతి, నిజాయితీ, విశ్వసనీయతలకు పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే జగన్ మోహన్ రెడ్డిలో సరిగ్గా అవే లోపించడం కూడా ప్రజలు ఆయన మాటలను విశ్వసించనీయకుండా చేసాయి.   7. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ప్రభావం, చంద్రబాబు, మోడీల సమర్ధత వంటవనేకం వైకాపా ఓటమికి కారణమయ్యాయి.   అయితే వాటన్నిటికంటే జగన్ స్వయంకృతాపరాధాలే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చును. అందువల్ల పార్టీని సంస్కరించే ముందు, జగన్మోహన్ రెడ్డి ముందు తనలో లోపాలను సవరించుకోగలిగితే పార్టీకి చాలా మేలు చేకూరే అవకాశం ఉంది. గత ఐదేళ్ళలో కేవలం ఓదార్పు యాత్రలు చేసుకొంటూ కాలక్షేపం చేసారు. ఈ ఎన్నికలలోనే ఆయన ఓదార్పు ఓట్లు రాల్చలేక పోయింది, అటువంటప్పుడు వచ్చే ఎన్నికలనాటికి ప్రజలలో ఈపాటి సానుభూతి కూడా మిగిలే అవకాశం ఉండదు కనుక ఇప్పుడయినా మేల్కొని పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయడం మంచిది.

టీఆర్ఎస్ రాములు హత్య: నయీం ముఠా అరెస్ట్

      ఈనెల 11న నల్లగొండ పట్టణంలోని ఎంఏ బేగ్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోనపురి రాములు హత్య కేసులో నిందుతులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేరళ లాడ్జిలో తలదాచుకున్న నయీం ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.5 లక్షల నగదును, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో జనశక్తి మాజీ సభ్యుడు, వరంగల్ జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన సోమయ్య, నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం వాసి సురేష్, కుమారస్వామి, రవి, రమేష్, ఎల్లేష్‌లు ఉన్నారు. వీరిలో సురేష్.. మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్య కేసులో నిందితుడు కాగా, సోమయ్య గతంలో రాములుపై దాడి చేయడానికి వచ్చినవారిలో ఒకడు. వీరి అరెస్టు తర్వాత కేరళ పోలీసులకు మరిన్ని వివరాలు అందజేసేందుకు నిందితులతో పాటు నయీం ఫొటోలను రాష్ట్ర పోలీసులు అక్కడికి పంపారు.

డిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ

  విశేష ప్రజాధారణతో డిల్లీ ముఖ్యమంత్రి పీటం అధిరోహించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేవలం 49 రోజులలోనే కుంటి సాకులతో పదవి నుండి దిగిపోయారు. కానీ సార్వత్రిక ఎన్నికలలో డిల్లీలో కూడా ఘోర పరాజయం పాలవడంతో, ఇప్పుడు తీరికగా పశ్చాతాపపడుతూ, ప్రజలను తన తొందరపాటుకి క్షమించమని కోరారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టగానే. డిల్లీ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి గనుక బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో కేజ్రీవాల్ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని నిన్న కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తనకే మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిడంతో ఏమిచేయాలో పాలుపోక మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్దపడుతూ ముందుగా వారిని క్షమాపణలు కోరారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని వదులుకొని తప్పు చేసానని ఆయనే స్వయంగా చెప్పుకోవడం వలన ప్రజలలో మరింత చులకన అవుతారు. ఇక ఆమాద్మీ పార్టీ పదవులు, అధికారం కోసం ప్రాకులాడే పార్టీ కాదని పదేపదే చెప్పుకొన్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఇతర రాజకీయ నేతలలాగే అధికారం కోసం ప్రాకులాడుతూ, ఉన్న పరువు కూడా పూర్తిగా పోగొట్టుకొంటున్నారు. ఒక అపూర్వమయిన అవకాశాన్ని కాలదన్నుకొని, ఇప్పుడు ప్రజలను ఎంత బ్రతిమాలుకొన్నా ప్రయోజనం ఉండదని ఆయన గ్రహిస్తే మంచిది.

మళ్ళీ ఢిల్లీ పీఠ౦ ఎక్కేందుకు ఆమాద్మీ తయార్

  రాజకీయాలలోకి ప్రవేశించిన ఏడాదిలోగానే డిల్లీ గద్దెను అధిష్టించి, యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అంతకంటే పదింతలు వేగంగా తన ప్రాభవం కోల్పోయారు. అత్యంత జనాదరణతో డిల్లీ పీటం అధిష్టించిన ఆయన, జనలోక్ పాల్ బిల్లుకి కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వలేదనే వంక పెట్టుకొని కేవలం 49 రోజులలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని పదవి నుండి దిగిపోయి ప్రజలలో నవ్వులపాలయ్యారు. డిల్లీ వంటి అతిచిన్న రాష్ట్రాన్నే పాలించలేని ఆయన, ఏకంగా దేశాన్నే పాలించేసేందుకు సిద్దమయిపోయి, తన పార్టీని దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దింపి మరోమారు అభాసుపలయ్యారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నంత కాలం కూడా ఆయనకు ప్రజల నుండి అనేక అవమానాలు ఎదురవుతున్నా పరిస్థితిని అర్ధం చేసుకోకుండా, ఏకంగా నరేంద్ర మోడీతోనే వారణాసిలో తలపడి మరోమారు భంగపడ్డారు. వరుసపెట్టి ఇన్నిసార్లు పరాభవం జరిగిన తరువాత కూడా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదని రుజువు చేస్తూ, మళ్ళీ డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను నిన్న డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిసారు. తమ పార్టీకి మరోమారు అవకాశం ఇచ్చినట్లయితే డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని ఆయనను కోరారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన 26 మంది యం.యల్యేలు తన వద్దలేనప్పటికీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన 8మంది యం.యల్యేల మద్దతు ఇస్తుందనే గుడ్డి నమ్మకంతో కేజ్రీవాల్ గవర్నర్ ని కలిసారు. కానీ, ఆమాద్మీ పార్టీకి ఇక మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పడంతో మరోమారు అవమానం ఎదురయింది. అసలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందో లేదో తెలుసుకోకుండానే ఆయన గవర్నర్ వద్దకు వెళ్ళడం ఒక పొరపాటయితే, అది సరిపోదన్నట్లుగా మళ్ళీ ఆయన తనకు బాగా తెలిసిన విద్య- ప్రజాభిప్రాయం కోరుతూ రిఫరెండం నిర్వహించేందుకు సన్నదమవుతున్నారు. ఇప్పటికే మసకబారిన తన ప్రతిష్టని, ఆమాద్మీ పార్టీ ప్రతిష్టని బహుశః మరొకమారు పరీక్షించి చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారనుకోవాలి.

ప్రధానిగా నరేంద్రమోడీ: 26న ప్రమాణ స్వీకారం

  భారత ప్రధానిగా నరేంద్రమోడీ ఈనెల 26వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి పదవీ స్వీకారానికి నరేంద్రమోడీ ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న అంశం మీద నరేంద్రమోడీ కసరత్తు చేస్తున్నారు. కాగా, భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్రమోడీ ఎంపికయ్యారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నరేంద్రమోడీని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ ప్రతిపాదించగా వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి బీజేపీ నాయకులు ఈ ప్రతిపాదనను బలపరిచారు. దీంతో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అధికారికంగా మార్గం సుగమమైంది.

ఉపముఖ్యమంత్రి కుర్చీలో గంటా కర్చీఫ్

  ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ, అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగినవాడే రాజకీయాలలో రాణించగలడు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆ కోవకు చెందినవాడేనని చెప్పవచ్చును. మొదట తెలుగుదేశం పార్టీలో ఒకవెలుగు వెలిగిన ఆయన, ఆ తరువాత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి దూకేశారు. కానీ ఆయన ఊహించినట్లుగా ప్రజారాజ్యం ఎన్నికలలో గెలవలేకపోయింది. అప్పుడు ఆయన ప్రజారాజ్యం నావని ఒడుపుగా కాంగ్రెస్ తీరానికి చేర్చి, తనతో బాటు చిరంజీవికి కూడా కేంద్ర మంత్రి పదవి దక్కేలా చేయగలిగారు. కానీ రాష్ట్ర విభజన వ్యవహారం మొదలవడంతో అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఆ సమయంలో చిరంజీవి సరయిన నిర్ణయం తీసుకోలేక తడబడుతూ ప్రజలలో అభాసుపాలవుతుంటే, గంటా మాత్రం చాలా ముందు చూపుతో నలుగురితో నారాయణ అన్నట్లు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ కాంగ్రెస్ అధిష్టానంతో పోరాడేసి ప్రజలలో తనకు చెడ్డ పేరు రాకుండా చూసుకొన్నారు. రాష్ట్ర విభజన వ్యవహారం ఒక కొలిక్కివచ్చే సమయం వరకు కాంగ్రెస్ లో మంత్రిగా కొనసాగిన గంటావారు, కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేఖతను గమనించి, తెదేపాలోకి జంప్ చేసేసారు.   అందరికంటే ముందు అవకాశాన్ని పసిగట్టగల నేర్పు గల గంటా తెదేపాకి విజయావకాశాలున్నాయని ఖచ్చితంగా నమ్మినందునే ఆ పార్టీలోకి దూకారని భావించవచ్చును. ఆయన అంచనాలను నిజం చేస్తూ తెదేపా విజయం సాధించింది. తెదేపా అధికారంలోకి వస్తే, బీసీలకు, కాపులకు ఒక్కొక్క ఉపముఖ్యమంత్రి పదవి చొప్పున ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేసారు. కనుక, ఇప్పుడు ఆ ఆవకాశాన్ని కూడా సద్వివినియోగించుకొనేందుకు అందరికంటే ముందుగా కదిలారు గంటావారు.   తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే పుచ్చుకొంటానని లేకుంటే సామాన్య కార్యకర్తగానేపార్టీకి సేవలందిస్తానని ప్రకటించి చంద్రబాబుకు అల్టిమేటం జారీచేసారు. అంటే ఆ పదవి ఈయకపోతే ఆయన వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లే భావించవచ్చును. ఇదే వ్యక్తి కాంగ్రెస్ నుండి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నప్పుడు తనకు పదవీ కాంక్ష లేదని, పార్టీని బలోపేతం చేసేందుకు ఏ బాధ్యత అప్పగిస్తే దానిని వినమ్రంగా స్వీకరిస్తానని సభాముఖంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి ఇస్తే తప్ప కుదరదని చెపుతున్నారు. కానీ, పార్టీలో చాలా మంది సీనియర్లు పార్టీని కష్టకాలంలో అంటిబెట్టుకొని ఉన్నారు. వారందరికీ చంద్రబాబు న్యాయం చేయవలసి ఉంది. వారిని కాదని అధికారం, పదవుల కోసం పార్టీలు మారుతూ తెదేపాలోకి వచ్చి పడిన గంటా శ్రీనివాసరావుకి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే గంటావారు పార్టీలో అసమ్మతి గంట మ్రోగించడం మొదలుపెడతారేమో!

కంటతడి పెట్టిన నరేంద్రమోడీ

  భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోడీ ఆ తర్వాత ఉద్వేగభరితమైన సుదీర్ఘ ప్రసంగం చేశారు. చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన నరేంద్రమోడీ ప్రసంగం సభలో పాల్గొన్నవారందరిలో స్ఫూర్తి నింపేలా మాట్లాడారు. తన ప్రసంగం మధ్యలో నరేంద్రమోడీ హఠాత్తుగా మాట్లాటడం మానేసి మౌనంగా వుండిపోయారు. తల వంచుకుని కొన్ని క్షణాలు అలాగే వుండిపోయారు. సహాయకుడి అందించిన మంచినీటిని తాగిన మోడీ మళ్ళీ మాట్లాడ్డం ప్రారంభించారు. అమ్మ అనే టాపిక్ మాట్లాడుతుండగా మోడీ ఇలా మౌనంగా అయిపోయారు. మంచినీరు తాగిన తర్వాత మాట్లాడ్డం ప్రారంభించిన మోడీ ‘‘నా కన్నతల్లి మాత్రమే కాదు.. భారత మాత కూడా నా తల్లే.. భారతీయ జనతాపార్టీ కూడా నా తల్లే’’ అంటూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. మళ్ళీ కొద్ది సేపటికే మామూలైపోయారు. నరేంద్రమోడీ కన్నీరు పెట్టుకోవడం, భావోద్వేగానికి గురి కావడం చూసి ఈ సమావేశంలో పాల్గొన్న అనేకమంది బీజేపీ ఎంపీలు కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

పార్లమెంట్ మెట్లకు నమస్కరించిన నరేంద్రమోడీ

  భారత ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకూ ఓటరు దేవుడితో, పార్లమెంట్ దేవాలయంతో సమానం. ఈ విషయాన్ని గ్రహించినవాళ్లే నిజమైన నాయకులు అవుతారు. మరి మనం ఎన్నుకుంటున్న నాయకులలో అలాంటి వాళ్ళు ఎంతమంది వున్నారో మనం ఊహించలేం. అయితే అలాంటి నాయకుడు ఒకడు వున్నారని మంగళవారం నిరూపణ అయింది. దేశమంతా ముక్తకంఠంతో దేశానికి నాయకుడిగా నిలబెట్టిన నరేంద్రమోడీ ఆ నాయకుడు. ఎందుకంటే ఆయన పార్లమెంట్‌ని ఒక రాతి కట్టడంలా కాకుండా దేవాలయంలా భావిస్తున్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరేంద్రమోడీని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నరేంద్రమోడీ పార్లమెంట్‌కి వచ్చినప్పుడు భారతీయ జనతాపార్టీ నాయకులు ఆయనకు భారీ సంఖ్యలో గుమిగూడి స్వాగతం పలికారు. నరేంద్రమోడీ పార్లమెంట్ మెట్ల దగ్గరకు రాగానే ఎవరూ ఊహించని విధంగా ఆయన మోకాళ్ళ మీద వంగి, నేలమీదకి పూర్తిగా ఒరిగిపోయి పార్లమెంట్ మెట్లకు నమస్కరించారు. ఈ చర్య పార్లమెంట్ మీద నరేంద్రమోడీకి వున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచింది.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ

  భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్రమోడీ ఎంపికయ్యారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నరేంద్రమోడీని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ ప్రతిపాదించగా వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి బీజేపీ నాయకులు ఈ ప్రతిపాదనను బలపరిచారు. దీంతో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అధికారికంగా మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మోడీకి అభినందనలు తెలిపారు. మోడీ నమస్కారంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్.కె.అద్వాని, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తదితరులు మాట్లాడారు.

జమ్ము కాశ్మీర్ రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి

  జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించారు. బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించినవారందరూ యువకులే. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. జమ్మూకు 170 కిలోమీటర్ల దూరంలో గల రాంబన్ జిల్లాలోని డిగ్దోల్ వద్ద జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. తీవ్రంగా గాయపడినవారిని హెలికాప్టర్ ద్వారా జమ్మూ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన మిలటరీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు రాజౌరి జిల్లాలోని పూంఛ్ నుంచి కాశ్మీర్ లోయకు వెళ్తున్నారు. మరణించిన, గాయపడిన వారిలో గుజరాత్‌కు చెందినవారు కూడా కొంత మంది ఉన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ అధికారులకు సైనికాధికారులు సహకరిస్తున్నారు.

కష్టపడితే చంద్రబాబులా కష్టపడాలి: నరసింహన్ ఉపదేశం

  తింటే గారెలే తినాలి.. వింటే భారతమే వినాలి.. మరి కష్టపడితే.. చంద్రబాబులా కష్టపడాలి. మొదటి రెండు పాయింట్లు పాతవే. మూడో కొత్త పాయింట్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జాయింట్ గవర్నర్ నరసింహన్ చెప్పారు. గవర్నర్‌ని కలవటానికి చంద్రబాబు వెళ్ళినప్పుడు, ఆయనతో కలసి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలకి గవర్నర్ నరసింహన్ ఈ ఉపదేశం చేశారు. ‘‘మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా కష్టపడి పని చేస్తారు, ఆయనలాగా మీరు కూడా కష్టపడాలి’’ అని టిడిపి ఎమ్మెల్యే, ఎంపీలకు గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. మీరు చేతులు కలపాలని, జట్టుగా ఆయనకు సహకరించాలని సూచించారు. . తాను కేంద్ర హోంశాఖలో ఉన్నప్పుడు విఐపిల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించానని, ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తమ నేత బాబుకు భద్రతను తగ్గించారని ఎర్రనాయుడు తమ దృష్టికి తీసుకురాగా భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకున్నానని గుర్తు చేశారు. ఈ సమయంలో నరసింహన్ టిడిపి అధినేతకు మిఠాయి తినిపించారు. పట్టుబట్టి మరీ గవర్నర్ స్వీటు తినిపించారు.

పవన్ కళ్యాణ్ కి ఎన్డీయే ప్రత్యేక ఆహ్వానం

  తెదేపా-బీజేపీలకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసి, ఎన్డీయే కూటమి విజయానికి కృషిచేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని నరేంద్ర మోడీ మరిచిపోకుండా గుర్తుంచుకొని, ఈరోజు డిల్లీలో జరుగబోయే ఎన్డీయే కీలక సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి ఈరోజు డిల్లీ వెళ్ళారు. ఈరోజు జరుగబోయే సమావేశంలో బీజేపీ మరియు ఎన్డీయే భాగస్వామ పార్టీలలో ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఈయలనే విషయం చర్చ జరుగుతుంది. అటువంటి అతి ముఖ్యమంయిన సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయనకు కూడా ఏదయినా కేంద్రమంత్రి పదవి ఇవ్వవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తనకు పదవులపై ఎటువంటి ఆశలేదని, కేవలం స్నేహ ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి ఆ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఏమయినప్పటికీ, ఈ ఆహ్వానంతో మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ కి ఎంత విలువ, గౌరవం ఉన్నాయో స్పష్టమయింది. మరే నేతకి దక్కని అరుదయిన గౌరవం పవన్ కళ్యాణ్ దక్కడం ఆయన అభిమానులకు కూడా చాలా ఆనందం కలిగిస్తోంది. నరేంద్ర మోడీ మార్గదర్శకంలో పవన్ కళ్యాణ్ మున్ముందు రాష్ట్ర రాజకీయాలలో మరింత చురుకయిన పాత్ర పోషిస్తారేమో!

రాజీనామాకి సిద్ధపడిన సోనియా, రాహుల్

  ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని విధంగా ఘోర పరాజయం పాలు కావడానికి కారణాలను అన్వేషించడానికి సోమవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు పలువురు సీడబ్ల్యూసీ మెంబర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. వాడిగా వేడిగా జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధపడగా, సీడబ్ల్యూసీ మెంబర్లు అడ్డుపడిపోయి వారించడంతో వారు శాంతించారని, ఆ తర్వాత సిడబ్ల్యుసీ ఈ రాజీనామా ప్రతిపాదనను తిరస్కరించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద ఏఐసీసీని పునర్వ్యవస్థీకరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైనా బాగుపడే అవకాశాలున్నట్టు భావించిన సమావేశం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

బీహార్ కొత్త ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజి?

  ఎన్నికలలో ఘోర పరాజయం కారణంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నితీష్ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని అనుకున్నప్పటికీ పార్టీలో తనకు వ్యతిరేకత పెరగడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి శాశ్వతంగా తప్పుకోక తప్పలేదు. పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతని కూడా నితీష్ పైనే వుంచింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి చెందిన దళిత నేత జితన్ రామ్ మంజిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. బీహార్‌లోని ప్రముఖ దళిత నేతగా జితన్ రామ్ మంజికి పేరుంది. నితీష్ కుమార్ ప్రతిపాదనను జేడీయూ పార్టీ పెద్దలు అంగీకరిస్తే బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా జితన్ కుమార్ మంజి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ముఖ్యమంత్రి కుర్చీలో పవన్!

  ముఖ్యమంత్రి కుర్చీమీద కూర్చోబోయేది మన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాదు.. అయిదు దఫాలుగా  ముఖ్యమంత్రి పవర్‌ని చేతిలో పెట్టుకున్న సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ మరోసారి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోనున్నారు. 1994 నుంచి చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికలలో చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మరోసారి గెలిచింది. దాంతో చామ్లింగ్ ఐదోసారి ముఖ్యమంత్రి పదవిని కొనసాగించబోతున్నారు. అంటే, అన్నీ బాగుంటే చామ్లింగ్ ముఖ్యమంత్రిగా పాతికేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేయడం ఖాయమన్నమాట. ఇప్పటి వరకు 23 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరు మీద వుంది. ఇప్పుడు చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించే అవకాశం వుంది. బుధవారం నాడు చామ్లింగ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

తల్లి మృతి: తరుణ్ తేజ్‌పాల్‌కి బెయిల్

  అత్యాచార ఆరోపణలతో జైలుపాలైన తెహల్కా పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కేన్సర్తో బాధపడుతున్న ఆయన తల్లి శకుంతల తేజ్ పాల్(87) సోమవారం కన్నుమూశారు. తల్లి అంత్యక్రియలు, కార్మకాండలు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. గతంలో కూడా కొన్నిసార్లు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూడటానికి తేజ్‌పాల్‌కి కోర్టు బెయిల్ ఇచ్చింది. గత సంవత్సరం నవంబర్ నెలలో గోవాలోని ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పణజీలోని గ్రాండ్ హయత్ ఫైవ్‌స్టార్ హోటల్ లిఫ్టులో తన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం, తదితర నేరాలకు పాల్పడ్డారని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పలు సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించిన తేజ్‌పాల్ ఈ అభియోగాల కింద దోషిగా తేలితే ఏడేళ్లకుపైగా జైలు శిక్ష పడుతుంది.

కాంగ్రెస్ ఓటమికి పవన్ కారణం కాదంటున్న చిరంజీవి

  చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి గొప్పతనాన్ని ఆపాదించడానికి ఒప్పుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ మటాషైపోయింది కదా అంటే, ఆయన షాకైపోయి కాదుకాదంటున్నారు. టీడీపీ - బీజేపీ కూటమికి తన సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్ల తాము ఓడిపోలేదని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంపై ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పవన్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించిందని, అందుకే ఇక్కడ కూడా తాము ఓడిపోయినట్టు చెప్పారు.