ఎందుకు ఓడించారంటూ ఏడుపు మొహం పెట్టిన పొన్నం
posted on May 19, 2014 @ 11:20AM
తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. అయ్యగారు ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు. తాను ఎంపీనన్న విషయాన్నే మరచిపోయి నోటికొచ్చినట్టుగా సీమాంధ్రులను తిట్టేవారు. తెలంగాణలోకి వస్తే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ని పేల్చేస్తానని వార్నింగిచ్చిన ఘనుడాయ. సీమాంధ్రలను అంతగా తిడితే తనకు తెలంగాణలో ఓట్లు బాగా పడతాయని ఆయన మురిసిపోయారు. చివరికేమైంది. పార్లమెంట్ ఎన్నికలలో తుక్కుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏడుపు మొహం పెట్టి మాట్లాడారు. ‘‘ఏం పాపం చేశామని ఎన్నికల్లో మమల్ని ఓడించారు’’ అని పొన్నం ప్రభాకర్ ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణను గట్టిగా వ్యతిరేకించిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేసి, తెలంగాణ కోసం ఢిల్లీలో పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేసిన తమను ఎందుకు ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ తెలంగాణలో అనుకున్నమేరకు సీట్లు సాధించలేకపోయామని ఆయన లబలబలాడారు. రాష్ట్ర విభజనతో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ నష్టపోయామనే విషయం పొన్నంకి అర్థమై జ్ఞానోదయం కలిగిందట.