విజయవాడలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం
posted on May 19, 2014 6:56AM
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవాడ స్వరాజ్ మైదానంలో జూన్ రెండు లేదా మూడు తేదీలలో ప్రమాణస్వీకారోత్సవం చేయనున్నట్లు తాజా సమాచారం. మొదట ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, విజయవాడకే ఆయన మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయంలో తన తాత్కాలిక క్యాంపు ఏర్పాటు చేసుకొబోతున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ అంటే డీజీపీ కార్యాలయం వగైరాలు ఏర్పాటుచేయబోతున్నట్లు తాజా సమాచారం. గుంటూరు, విజయవాడ, తెనాలి మూడు ప్రాంతాలను కలుపుతూ మెట్రో నగరాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కనుక కొత్త రాజధాని కూడా ఈ ప్రాంతాల మధ్యనే ఉంటుందని చెప్పవచ్చును. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కొత్త రాజధాని నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గుంటూరులో తన క్యాంపు కార్యాలయం నుండే చంద్రబాబు ప్రభుత్వ నిర్వహణ చేయవచ్చును. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, సెక్రటరియేట్ ఉద్యోగులు హైదరాబాదులోనే ఉన్నందున అవసరాన్ని బట్టి కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు గుంటూరు నుండి పరిపాలన సాగించ వచ్చును.