వేర్పాటు ముసుగులో కబ్జాదారులు ఎవరెవరు?
- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
"ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటలుగా పరిగణింపబడే ముఖ్యకేంద్రాలను మీర్జా ఇస్మాయిల్ (నిజం) రిజర్వు పోలీసులు, సైన్యాలు వారంరోజుల్లో రాత్రికి రాత్రే చుట్టుముట్టి మెరుపు దాడులు చేసి, నిండుప్రాణాలను బలిగొని, వేలకు వేల సంఖ్యలో అరెస్టులు చేసి, హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణా ప్రాంతపు కారాగారాలందు నిర్భంధించి, కనీవినీ ఎరుగని నిర్బంధవిధానాన్ని నైజాం నిరంకుశ ప్రభుత్వం ప్రయోగించింది ... ఆ సమయంలో ఈ ప్రాంతపు ఆంధ్రమహాసభలో మితవాదులైన మందుముల సోదరులు (నర్శింగారావు, రామచంద్రరావు), బూర్గుల రాం కిషన్ రావు, కొండా వెంకటరంగారెడ్డి లాంటివారు నైజాం సైన్యాలు, రిజర్వుపోలీసులు చేస్తున్న అఘాయిత్యాలను ఖండిస్తూ కనీసం ప్రకటనలనైనా చేయడానికి సాహసించలేకపోయారు! పైవారంతా, ఆంధ్రమహాసభలో మాతో సమిష్టిగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణా భూస్వామ్య వ్యతిరేక పోరాటాలపై చన్నీళ్ళు చల్లిన ఘరానా పెద్దమనుషులే! నిజం వ్యతిరేకపోరాటం చాలా ఉన్నతస్థాయిలో వున్నప్పుడు కొండా వెంకటరంగారెడ్డి నాయకత్వాన ఒక బృందం [మితవాద నాయకులు పంపగా] ఒక నివేదికను పత్రికలకు విడుదల చేసింది. గ్రామ సీమలందు కమ్యూనిస్టులు దొరలను, భూస్వాములను పత్తి హింసిస్తున్నారని, వారి వ్యవసాయాల్ని సాగనీయడం లేదని, ఆయా గ్రామాలందు కాంగ్రెస్ లో సభ్యులుగా చేరినవారిని కమ్యూనిస్టులు హింసిస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు.
దొరల దోపిడీ, దౌర్జన్యాకాండలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఆంధ్రమహాసభ కార్యకర్తలను భూస్వాములు పోలీసులతో మిలాఖాతై చిత్రహింసలకు గురిచేస్తున్నప్పుడు నైజాం నవాబుకు తొత్తులుగా వున్నారని గ్రామాలనుండి తరిమివేయడంలో తప్పులేదు. ఆ దొరల తొత్తులయిన గూండాలను కాంగ్రెస్ లో చేర్చుకోగా, కాంగ్రెస్ వారిని కమ్యూనిస్టులే కొట్టారని కొండా వెంకటరెడ్డి నివేదిక చెప్పింది. అసలు ఈ కొండా వెంకటరెడ్డి ఎవరు? .... ఈ రంగారెడ్డికి భువనగిరి తాలూకాలోని శాహ్ రాజ్ పేట గ్రామంలోనే దాదాపు వేయి ఎకరాలభూమి సొంత వ్యవసాయంలో ఉంది. 1946-47, 1947-48 సంవత్సరాల్లో నైజాం నవాబుకు నమ్మినబంటు అని పేరుతెచ్చుకున్నారు. పులితోలు కప్పుకున్నా, నక్కనక్కే, గూండాలు కాంగ్రెస్ లో చేరినా గూండాలే ... అలాంటి కాంగ్రెస్ కు 1952 జనరల్ ఎన్నికల్లో సభ్యులకు అసలు పోలింగ్ ఏజెంట్లే దొరకలేదు. కమ్యూనిస్టు పార్టీ అద్వితీయమైన విజయాలు సాధించింది! [రైతాంగ సాయుధ పోరాట అగ్రనాయకులలో ఒకరైన ఆరుట్ల రామచంద్రారెడ్డి: "తెలంగాణా పోరాట స్మృతులు]
తెలంగాణాలో ఈ 'దొరల'గత చరిత్రే కాదు, నేటి చరిత్ర కూడా అదే అయినందుననే, హైదరాబాద్ స్టేట్ రద్దయి, దేశంలో తొలి "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్'' [ఫజల్ ఆలీ] స్పష్టమైన సిఫారసులు ఆధారంగా దేశంలోనే తొలి రెండవ పెద్ద రాష్ట్రంగా తెలుగువారందరికీ కలిపి తెలుగుప్రజల చిరకాల వాంఛలకు అనుగుణంగా "ఆంధ్రప్రదేశ్'' (విశాలాంధ్ర) రాష్ట్ర అవతరణ హైదరాబాద్ రాజధానిగా 1956 నవంబర్ 1న సుసాధ్యమయిన తరువాత కూడా నానారకాల 'దొరల' ఇతర భూస్వామ్య, నయాపెట్టుబడిదారుల అలానే ఉన్నాయి! ఈ కొనసాగింపులో భాగమే కోస్తాంధ్రలోని శ్రీకాకుళం (విజయనగరం)నుంచి తెలంగాణాకు వచ్చి, తన రాజకీయ నిరుద్యోగానికి పరిష్కార మార్గంగా మొత్తం తెలుగుజాతి మధ్యనే విషబీజాలు నాటినవాడు "బొబ్బ్లిదొర'', అతని కుటుంబమూ; తెలుగువారి తెలంగాణా ప్రాంతంలో ఇతడు కాలుమోపిన నాటికి ఉన్న ఆస్తిపాస్తులెన్ని? ఆ తరువాత చేసిన దొంగసంపాదనలెన్ని? లెక్కల కోసం సీమాంతరాలు దాటి వెళ్ళనక్కరలేదు!
ఎందుకంటే తెలంగాణాలోని స్థానికులు హైదరాబాద్ లోని మిత్రులూ వెల్లడిస్తున్నా దాన్నిబట్టి - ఒక్క హైదరాబాద్ సమీపంలో 'బొబ్బిలిదొర'కు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో రకరకాల రహస్య కార్యకలాపాల కోసం నిర్మించుకున్న "ఫామ్ హౌస్'' ఉంది! ఇదిగాక, 2010 జనవరి 31న "ఇంటర్నెట్" సాక్షిగా ఒక "బ్లాగ్''లో "బొబ్బిలిదొర'' వారి "డాలర్ సామ్రాజ్యం'' అన్న మకుటం కింద ఇండియా మ్యాప్ లో అతడి బొమ్మ ముద్రించి తాజాగా మావోయిస్టులు ఒక వార్తను ప్రముఖంగా విడుదల చేశారు! ఆ వార్త తాలూకు తాజా సమాచారం ("అప్ డేటెడ్'') పేరిట "ఆంధ్రామానియా'' శీర్షిక కింద బొబ్బిలిదొర పేరుతొ వారి "సీక్రెట్ బిజినెస్: సీపోర్టు షిప్స్ అండ్ రు. 6000 క్రోర్స్'' అన్న ఉపశీర్షిక పెట్టి ఈ క్రింది సమాచారం అందులో పెట్టారు. అందులోని కొన్ని భాగాలు :
తెలంగాణా ప్రజలంటే తనకెంతో ప్రేమ అని నటించే వ్యక్తీ నిజమైన ప్రేమంతా అతని వ్యాపారాల మీదనే ఉంటుంది.
"తన ప్రజలు మోసపోయారని ఎవరు అరుస్తూంటారో అతను ఇతర రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు పెడుతుంటాడు!''
"ఇతరులమీద రాజకీయంగా ఎక్కువ పలుకుబడి పొందడం కోసం దోమల బెడదను కూడా లెక్క చేయకుండా తండాల మధ్య తలదాచుకోజూచే వ్యక్తీ రెండు ఓడలకు (కాండ్లారేవులో) అధిపతి కాగలగడమేకాదు, ఇప్పుడా వ్యక్తీ ఒక ప్రయివేట్ హార్బరునే నిర్మిస్తున్నాడు'' అని ఆ బ్లాగ్ లో బ్లాగర్ వివరించాడు.
అంతేగాదు, ఆ వ్యక్తీ తాలూకు "ఈ చీకటి కోణాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి ... ఈ వివరాలు చదివితే అతడు ప్రారంభించిన స్థానిక ఉద్యమం గురించీ, తెలంగాణా ఆత్మగౌరవం గురించీ అతను చేస్తే ప్రకటనలలోని డొల్లతనం బోధపడుతుంది ... 2001 సంవత్సరంలో ఇతడు స్థానిక పార్టీని స్థాపించిన తరువాత అపారమైన సంపదను కూడబెట్టుకున్నాడు. దానికి తగిన సాక్ష్యాధారాలను విశ్వసనీయవర్గాల నుంచే రాబట్టుకోవటం జరిగింది. రాజకీయంగా పొందిన ఈ సంపదతోనే ఆయన కాండ్లా (గుజరాత్) సముద్ర రేవుపైన గట్టిపట్టు సాధించాడు. రెండు భారీ నౌకలు కొన్నాడు. ఇప్పుడా నౌకలు ప్రపంచాన్ని చుట్టివస్తున్నాయి. అతడు ఒక ప్రయివేట్ సీపోర్టును కూడా నిర్మించే యత్నంలో ఎద్దడిగా ఉన్నాడు. ఈ సీపోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.500 కోట్లు అని అంచనా. ఈ నిర్మాణాన్ని ఆయన సన్నిహిత బృందంతో ("క్లోజ్ సిండికేట్'') కలిసి చేస్తున్నాడు! ఈ రాజకీయవేత్త విలువ నేడు రూ.6,000 కొట్లనీ, ఇది పైకి కన్పించే సొమ్ము మాత్రమేననీ అతడి ఆర్ధిక లావాదేవీలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తీ వెల్లడించాడు. ఈ మొత్తం కేవలం పైకి తెలియవచ్చిన సంపదకాగా, అజ్ఞాతంగా ఉన్న సంపద వాస్తవ విలువ ఎంత ఉండాలో ఎవరికీ వారే ఊహించుకోవచ్చు. అంతేగాదు, మహారాష్ట్ర, గుజరాత్ ల మధ్యదారిలో అతడికి అనేక ఆస్తులూ, ఎస్టేట్లూ, ఆర్ధిక లావాదేవీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలేగాని, తెలంగాణాలో మాత్రం కావు. ముంబైకి, గుజరాత్ కు మధ్య ఈయన పొందిన భూముల విలువ కోటానుకోట్ల రూపాయల్లోనే ఉంటుంది''!
ఇవీ - ఇంటర్నెట్ కథనం (బ్లాగ్) వివరాలు! ఇంతకూ ఇక్కడ గమనించవలసిన విషయం - 1956కు ముందూ తెలుగుజాతి ఏర్పరచుకున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దరిమిలా ఇరుప్రాంతాలకు చెందినా (సీమాంధ్ర, తెలంగాణా) భూస్వామ్య, ధనికవర్గాలు పెట్టె పెట్టుబడులకు మాత్రం ప్రాంతీయ భేదాలుండవుగాక ఉండవు, అని! ప్రాంతాలలోని సామాన్య ప్రజాబాహుళ్యాన్ని వివిధ రూపాలలో దోచుకోవటంలో ఇరుప్రాంతాలలోని భూస్వామ్య, పెట్టుబడివర్గాలకు పద్ధతులలోనేగాని, దోపిడీ స్వభావంలో మాత్రం తేడాలుండవు గాక ఉండవు! లేవు కాబట్టే, తెలంగాణా సాయుధ పోరాట విజయాల ప్రభావంలో నాటి తెలంగాణా పేదరైతు, వ్యవసాయ కార్మికవర్గం, వెట్టిచాకిరీని, "నీబాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న బానిస సంకెళ్ళను కాస్తా విదిలించుకుని బయటపడవలసి వచ్చింది. అదీ అసలైన ఆత్మగౌరవ ప్రతిష్ఠాపాన!
అయితే నాటి ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం సుసాధ్యం చేసిన ఈ పరిణామక్రమాన్ని నేడు తిప్పికొట్టడం కోసమే మరొకసారి ప్రాతపు దోరాలూ, భూస్వాములూ సమాయత్తం కావడానికి ఒక ఉద్యమం అవసరమైంది. అందుకనే ప్రజల మౌలిక సమస్యలయిన భూసమస్య, కనీసవేతనాలు, గనుల పేరిట, పరిశ్రమల విస్తరణపేరిట విచ్చలవిడిగా పెట్టుబడివర్గాలు సాగిస్తున్న భూసేకరణలు, భూముల స్వాదీనాలు, విద్యార్థి, యువజనుల నిరుద్యోగం వగైరా సమస్యలు ప్రస్తావనకు రాకుండా, ఆ సమస్యలపైన వాస్తవికమైన ఆందోళనలు, ఉద్యమాలూ రాకుండా పక్కదారులు పట్టించేందుకే, పదవీ స్వార్థంలో భాగంగా పాలకపక్షంలోని 'నిరుద్యోగ'వర్గమూ, "పక్కింటావిడ భర్త దొరికితే, నా భర్తా దొరుకుతాడ''న్న సామెతలాగా కొన్ని ప్రతిపక్షాలలోని స్వార్థపరులూ ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండా ద్వారా తెలుగుజాతిని చీల్చాలని కృత్రిమంగా ఉద్యమించారనడంలో సందేహం లేదు! ఈ రాజకీయ నిరుద్యోగుల అండలేకపోతే కాంగ్రెస్ అధిష్ఠానం కొమ్ములు కూడా విరిగిపోవటం ఖాయం.
అలాగే, 1956కు ముందు పరిస్థితిలో పోల్చుకుంటే ఆ తరువాత కడచిన 56 సంవత్సరాలలోనూ ఉభయప్రాంతాలలో రిజిస్టరయిన భూస్వామ్య-పెట్టుబడిదారీ వర్గాల పెట్టుబడులూ, పరిశ్రమల నిర్మాణం కూడా ఉన్న పరిధులలో గణనీయంగానే పెరిగాయని గణాంకాలన్నీ తెల్పుతున్నాయి. అందువల్ల హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడుల కేంద్రీకరణలో గానీ, విస్తరణలోగానీ ఉభయప్రాంతాల మోతుబరులూ ఉన్నారు. అందుకు ఏ ఒక్కరినో టార్గెట్ చేసీ లాభంలేదు! విచిత్రమేమంటే, ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయమే చూడండి - "న్యూ''కంపెనీలో భాగస్వాములుగా ఉన్నవారు ఉభయప్రాంతాల పెట్టుబడిదారులే. పైగా ఆ కంపెనీ కోసం స్థానిక మోతుబరూ, స్థానిక దినపత్రిక యజమానికి [ఇప్పటిదాకా ఆ పత్రిక నిర్వాహకుడు తెలంగాణాలో పాగా వేసిన 'బొబ్బిలిదొర'వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా] కాంట్రాక్టు ఇప్పించడంలో ప్రముఖపాత్ర వహించడాన్ని పత్రికలు బయటపెట్టాయి!
అంతవరకూ ఇదే స్థానిక పత్రిక అధినేతగా ఉంటూ వచ్చిన 'బొబ్బిలిదొర' ఆ పత్రికను ఆ స్థానిక యజమానికి కుదువబెట్టిన సంగతీ బహిరంగ రహస్యమే! ఇక "బొబ్బిలిదొర'' కుమారరత్నం ఒక ఎన్.ఆర్.ఐ. "సీమాంద్ర పెట్టుబడిదారులు'' అంటే ఎక్కడ అదే సీమాంధ్రకు చెందినా తమకూ వర్తించుతుందేమొననిసిగ్గుపడిన ఈ తండ్రీకోడుకులూ మధ్యలో ఆ మాటను మానేసి మొత్తం "దోపిడీ'' పదాన్ని "సీమాంధ్రప్రజల''కే అంటగట్టేస్తూ వచ్చారు. అంతేగాదు, 'బొబ్బిలిదొర' కుమారరత్నానికి వ్యాపారాలకోసం సీమాంధ్ర కావాలట, అధికారానికి తెలంగాణా కావాలట! ఈ సత్యం - శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి గ్రామంలో ఎగుమతులకు గిరాకీ ఉన్న "శ్రీకాకుళం బ్లూస్'' అనే విలువైన రంగురాళ్ళ క్వారీని ఈ కుమారరత్నం 2005 సంవత్సరం దాకా కొల్లగొడుతూనే వచ్చాడని మరవరాదు!
ఈ భాగోతం ఇలా ఉండగానే, 1956కు ముందు మన తెలంగాణాలోగాని [రెండు ప్రాంతాలూ 1953 దాకా ఒకటి, 1956 దాకా మరొకటీ పరాయి పాలనల్లోనే ఉంటూ వచ్చినందున] ఉభయత్రా విదేశాలకు ఉద్యోగరీత్యాగానీ, వ్యాపారాల కోసంగానీ వెళ్ళిన ఎన్.ఆర్.ఐ.ల సంఖ వేళ్ళమీద లెక్కించదగిన దానికన్నా మించిలేదు. కాని 1956 తరువాతనే ఉభయప్రాంతాలలోనూ గత 57 సంవత్సరాలలోనూ ఇటు తెలంగాణానుంచీ, అటు సీమాంధ్రనుంచీ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఎన్.ఆర్.ఐ.ల రాకపోకలూ, విదేశాల్లో నివాసాలూ, స్థిరనివాసాలూ పెరిగాయని మరచిపోరాదు. అమెరికా, బ్రిటన్, జర్మనీలలోనేగాక, దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, మలేసియా, సింగపూర్ లలో స్థిరపడి ఆయా చోట్ల పలు తెలుగు సాంస్కృతిక సంస్థలనూ ఏర్పరచుకున్నారు. ఈ విషయంలో ఇరుప్రాంతాల వారూ విద్యా విషయకంగానూ, సాంస్కృతికంగానూ కూడా ఎంతో అభివృద్ధి దిశగా పురోగామిస్తున్నారు. తెలుగునాట వివిధప్రాంతాల అభివృద్ధి కోసం తమకు వీలైన పద్ధతుల్లో పాటుపడుతూనూ ఉన్నారు. ఈ పరిణామం ప్రధానంగా 1956 తరువాతనే, తెలుగుజాతి ఏకైకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత మాత్రమే సాధ్యమైందని గుర్తించాలి. ఇక హైదరాబాద్ లో ఉభయప్రాంతాల వారి పెట్టుబడులకు సంబంధించి కూడా 1956 తర్వాతనే ఇరుపక్షాల క్రమానుగతమైన అభివృద్ధి కనిపిస్తోంది.
ఉదాహరణకు 1956 తరువాతనే మన తెలంగాణా సోదరుల పరిశ్రమలు, సంస్థలలో ఉన్న పెట్టుబడులు రూ.350 కోట్ల నుంచి సుమారు రూ.4,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈ ఇరుప్రాంతాలకు చెందిన మోతుబరులు ఆక్రమించిన లేదా కొనుగోలు చేశామని చెబుతున్న భూముల వైశాల్యం వివరాలను రాష్ట్రప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన 'శాంతి'చర్చల సందర్భంగా మావోయిస్టులు పేర్లతో సహా పేర్కొన్న వివిధ ప్రాంతాలవారీ భూముల, పెట్టుబడి ఆస్తుల, కంపెనీల వివరాలతో ఒక పత్రాన్ని కూడా విడుదల చేశారు. కాగా, ఇటీవల తెలియవచ్చిన కొన్ని వివరాల ప్రకేరం గత పాతికేళ్ళలో స్థానిక సోదరులు సంపన్నులుగా ఎదిగి ఏ ఏ పరిశ్రమలు పెట్టి బలమైన పరిశ్రమాధిపతులుగా ఎదుగుతూ వచ్చారో తెలిసింది. పెట్టుబడిదారీ-భూస్వామ్య మౌలిక చట్రం అనుమతించినందువల్లనే అటువారుగాని, ఇటువారుగానీ వీలైనంత మేర సంపన్నులుగా తమ వృద్ధి నమోదు చేసుకున్నారు! ఆ వ్యవస్థ మౌలింగానే మారిపోనంత కాలం ప్రాంతాలతో నిమిత్తం లేకుండానే కొత్త 'టాటా'లు, కొత్త 'బిర్లా'లూ, ఇంకొత్త అంబానీలూ పుట్టుకొస్తూనే ఉంటారని మరవరాదు! అలాగే మన తెలంగాణాలో కూడా హైదరాబాద్ కేంద్రంగానూ, జిల్లాస్థాయిలోనూ కోట్లకు పడగలెత్తిన కేవల స్థానిక కంపెనీలున్నాయి. వాటిలో కొన్ని " ఆంశ్రీ కన్ స్ట్రక్షన్స్, శాలివాహనా బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్, మధుకాన్, మైహోమ్ కన్ స్ట్రక్షన్స్, నాగంవారి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కున్ డాయి, గుజరాత్ షిప్పింగ్ సర్వీసు, 'న్యూ' కంపెనీ, శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్, శ్రీకిరణ్ కన్ స్ట్రక్షన్స్ వగైరాలు!
అన్నట్టు - వెంకటస్వామి, వివేక్, మధుయాష్కీ, డి.ఎస్., ఎర్రబెల్లి, నాగం, ఈటెల వారి ఆస్తులు పుట్టుకతోనే వచ్చినవా, 1956 తర్వాత 'ఎదిగినవా' చంద్రబాబులాగా?! ఇంత అభివృద్ధిలోనూ ఒక చెరపరాని పెద్ద హంసపాదు - "బొబ్బిలిదొర'', అతడి కుటుంబమూ, దౌర్జన్య భాషతో, బూతులతో 'దీపి'స్తున్న అతడి అనుచరవర్గమూ, వెరసి వీళ్ళు కేవలం స్వార్థప్రయోజనాల కోసం ప్రోత్సహించిన తెలంగాణాబిడ్డల ఆత్మహత్యలూనూ! అందుకే ఈ పరిణామాన్ని మనం 'దొర'ల స్వామ్యానికీ, ఇతర భూస్వాముల వర్గ స్వామ్యానికీ మధ్య సాగుతున్న కుల, వర్గ ఆధిపత్యపోరని నిర్థారణ చేస్తుకోవచ్చు! ఇందులో రెక్కాడితే గాని డొక్కాడని "పూటబత్తెమే పుల్లవెలుగు''గా ఉన్న ప్రజాబాహుళ్యానికి ఎలాంటి పాత్రాలేదు, లేదు, లేదు! ఆరుట్లవారి అంచనా ఆ రోజుకీ ఈ రోజుకీ అక్షరసత్యమే!