సెక్కరం తిప్పుతా సూడు!
posted on Nov 8, 2013 @ 9:27PM
నాయుడు: ఒరే సత్తిగా! ఈ సంగతి ఇన్నావా?మనోడు మళ్ళీ మనల్ని ఓదార్సేందుకు ఇమానం ఎక్కి మనూరు వస్తున్నాడుట! ఇంత కాలం మనోడ్నిఆ కాంగిరేసోల్లు జైల్లో ఎట్టేయబట్టి గానీ, నేకుంటే ఎప్పుడో ఓదార్సేవాడట!
సత్తి: అవున్రా! కానీ మనోడు జైల్లో ఉన్నప్పుడు మనం ఒక్కపాలి కూడా ఎల్లి ఓదార్సనేకపోనాము. నీ కెట్టుందో గానీ నాకు మాత్రం మా సెడ్డ సిగ్గుగా ఉందిరా నాయుడూ. అయినా మనోడు మాత్రం జైలు నుండి ఇడిసిపెట్టగానే పెళ్ళాం బిడ్డలను కూడా ఓదార్సకుండా ఫస్టు మనకాడికే లగ్గెతుకొస్తున్నాడు సూడు...అందుకే నాను మనోడ్ని బాగా లైక్ సేత్తుంటా!
నాయుడు: అవున్రా సత్తిగా నాకో డవుటు..ఎవులయినా ఇన్నేళ్ళయినాక తీరిగ్గా సచ్చినోల్లని గురుతుసేసి మరీ ఓదార్సడమేటిరా ఇడ్డూరం గాకపోతే...
సత్తి: స్సీస్సీ.. ఎదవనాయాల! శుభమా అని అన్నఓదార్సేందుకు వత్తుంటే నీ ఎడుపేటిరా ఎదవన్నర ఎదవా? రిచ్చాబేరానేకపోతే బీడీ ముక్కలో, సుట్ట ముక్కలో కాల్సుకొంటూ కూకోక ఈ పిచ్చిపెశ్నలేటి?
నాయుడు: గానొరే సత్తిగా..నాకో డవుటు. అక్కడ డిల్లీలో హిందీవోల్లు అందరూ కూకోని మన రాట్రాన్ని ఇడగొట్టేస్తుంటే ‘సమేకం.. సమేకం..’ అని ఓ తెగ కలవరించే మనోడు ముందాపని సూడకుండా ఇప్పుడీ ఓదార్పులెందుకురా...పైగా ఎనకమాలే ఆ ఫోటోవోళ్ళని ఎంటేసుకొచ్చి.. ఏదో రోజూ మన్నాగే ఉల్లిగడ్డ, పచ్చిమిరిసి కొరికి గంజి తాగుతూ బతుకుతున్నోడిలా ఆ ఫోటోలకి పోజులేటి? ఇప్పుడేటయినా ఎలచన్లున్నాయా ఏటి నువ్వే సెప్పు?
సత్తి: ఒరే! నాయుడిగా అన్న దేవుడు రా...అన్న గురించి అట్టాగ మాటాడితే కళ్ళు పేలిపోతాయిరా.. ఎదవ నాయాల... ఆయనింట్లో గంజినేకనే నీ ఇంట్లో, నా ఇంట్లో గంజి తాగేందుకు వస్తున్నాడా ఏటి?ఎర్రి నాయాల?
నాయుడు: ఎహే! మనోడి బుర్ర నిండా కంతిరీ బుద్ధులే...ఉంటే, నీ బుర్రలో మాత్రం ఒట్టి మట్టి..కాదు.. కాదు బూడిదే ఉంది. నా ఏడుపేటంటే మనోడి సేతిలో కార్లు, బళ్ళేటి... రైళ్ళు, ఇమానాలున్నాయి కూడా ఉన్నాయి కదా..మరి మనోడు అవెక్కి డిల్లీ ఎల్లి ఆ హిందీ ఓల్ల కాలరట్టుకొని ‘ఎందుకురా మా రాట్రం ఇడదీత్తున్నారు ఎదవ సచ్చినోల్లారా?” అని ఆళ్ళని నాలుగు పీకి సమేకం పట్టుకురావచ్చుగదా...అని నా డవుటు..
సత్తి: ఓసోస్! ఇంతోటి తెలివి మహా నీకే ఉంది మరి. మనోడు దేశమంతా తిరిగి జనాలని పోగేసి మనకి డిల్లీ ఓళ్ళు సేత్తున్న అన్నేయం గురించి ఇడమరిసి సెప్పి వత్తాడుట! ఎప్పుడయినా పేపరు సూసిన ముఖమేనా మనది అంట?
నాయుడు: ఒరే! సత్తిగా.. మనోడికి బుర్రలో మరేటుందో నాకయితే ఎరుకనేదు గానీ... ఓటి సెప్పు. డిల్లీవోల్లు మన రాట్రం ఇడదీసేతుంటే మనోడు నేరుగా డిల్లీ ఎల్లి ఆల్లకి వార్నింగ్ ఇచ్చి రాకుండా వేరే ఎక్కడెక్కడికో ఎల్లి జనాలను పోగేసి మీటింగులేటిరా బుద్ది నేకపోతేను? ఇంతకీ మనోడు ముక్కెమంతిరవుదామనే కదా ఈ సమేకభాగోతమంతా...గానీ రేతిరికి రేతిరి మళ్ళీ మనోడి ప్లాను గానీ మారిపోనాదా ఏటి? ఇప్పుడు ఏకంగా పెదానిమంతిరి అయిపోదారనా దేశం పట్టుకొని తిరిగేందుకు సిద్దమవుతున్నాడు?
సత్తి: స్సీస్సీ..అపశకున పక్షి మనోడు ఓదార్సుతాడంటే ఏడుత్తావు. పోనీ సమేకం అంటే నిజమేనా... నమ్మ మంటవా? అని సచ్చుపెశ్నలు. ..అనుమానాలు. పోనీ నాలుగూళ్ళు తిరిగి జనాలని పోగేసి డిల్లీలో సెక్కరం తిప్పుదారని ఎల్తుంటే ఎదవ అనుమానాలు... ఎదవ ఏడుపులు స్సీస్సీ! నువ్వు సస్తే మీ ఓల్లని ఓదార్సేందుకు కూడా రావొద్దని మనోడికి నానే గట్టిగా సేపుతాలే!
నాయుడు: ఓరోరి సత్తిగా.. నాకు సానా ఇంసల్టు సేసేసినావురా! రేపు నువ్వు సచ్చినా మనోడిని నీ గుడిసెకి రానిత్తే ఒట్టు!