నాగం నోటికి తాళం!

 

బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నోటికి చాలాకాలం తర్వాత తాళం పడింది.  నాగం సారు తెలుగుదేశంలో వున్నా, టీఆర్ఎస్‌తో రాసుకుని పూసుకుని తిరిగినా, సొంత కుంపటి పెట్టుకున్నా.. ఎప్పుడైనా ఆయన నోటికి అడ్డే ఉండేది కాదు. సీమాంధ్రులని తిట్టడంలో నాగం జనార్దన్ రెడ్డిది ప్రత్యేక శైలి. అవమానంతో సీమాంధ్రుల గుండె పగిలిపోయే స్థాయిలో తిట్టడంలో నాగం సిద్ధహస్తుడు. ప్రెస్‌మీట్లల్లో నాగం చూపుడువేలు చూపిస్తూ సీమాంధ్రులని తిడుతూ వుండే విభజనవాదుల మనసులు దూదిపింజల్లా హాయిగా గాలిలో తేలుతూ వుండేవి. అంతటి ఘనాపాటి నాగం ఈమధ్య సీమాంధ్రుల మీద తిట్ల పురాణం విప్పటం లేదు. బీజేపీలో చేరినప్పటి నుంచి నాగం గారి వాయిస్ చాలా సాఫ్ట్ అయిపోయింది. బీజేపీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్స్‌ లో పాల్గొంటున్నప్పటికీ నాగం క్లుప్తంగా, తిట్లూ గట్రా లేకుండా నాలుగు ముక్కలు మాట్లాడేసి బుద్ధిగా కూర్చుంటున్నారు. ఈ ధోరణి సీమాంధ్రులకి మనశ్శాంతిని కలిగిస్తూ వుంటే, విభజనులు మాత్రం ఏవి తండ్రీ నిరుడు కురిసిన తిట్ల పురాణాలు అంటూ విలవిలలాడుతున్నారు. ఆ విలవిల నాగం మనసులో కూడా వుండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు సీమాంధ్రులను గానీ, అటు తాను నిరంతరం తిట్టిపోసే చంద్రబాబుని కానీ తానిప్పుడు తిట్టలేకపోతున్నందుకు నాగం మనోవేదన చెందుతూ ఉండొచ్చని అంటున్నారు. నాగం ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం బీజేపీ నాయకత్వం నాగం నోటికి తాళం వేయడమేనని తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద కామెంట్లు చేసే విషయంలో బీజేపీకి ఒక క్రమశిక్షణ వుండటం, తెలంగాణ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం ధోరణి మారుతూ వుండటం, తెలుగుదేశం పార్టీకి చేరువ అయ్యే ప్రయత్నాలు జరుగుతూ వుండటం వల్ల నాగం నోటికి తాళం పడటానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగం తన ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ పోతే అది బీజేపీని ఇబ్బందికర పరిస్థితుల్లో పడే అవకాశం వుంది. తన నోటికి తాళం వేయడం నాగానికి ఇష్టం లేకపోయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో నాగం సైలెంట్‌గా వుంటున్నారు. తెలంగాణ విషయంలో పట్టు సడలిస్తున్న బీజేపీని వదలాలని మనసులో వున్నా ఆయనకు వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇష్టంలేని కాపురం చేస్తున్నారు.