పాపం కోదండరామ్!
posted on Nov 10, 2013 @ 8:41PM
తెలంగాణ పొలిటికల్ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కి వచ్చిన పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదు. నిన్న మొన్నటి వరకూ హీరోలా వెలిగి ఒక్కసారిగా జీరో అయిపోవడం అనేది ఎవరికైనా బాధ కలిగించే విషయమే. పొలిటికల్ జేఏసీ నాయకుడిగా ఎంపికయిన దగ్గర్నుంచీ కోదండరామ్ తెలంగాణని అగ్నిగుండం చేయడానికి తనవంతు ఆజ్యం పోశారు. తన పిల్లల్ని అమెరికాలో సెటిల్ చేసిన కోదండరామ్, తెలంగాణ యువకులను ఉద్యమోన్ముఖులను చేస్తూ వాళ్ళలోనే తన పిల్లల్ని చూసుకున్నారు. టీఆర్ఎస్‌కి తనవంతు సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో తరించారు. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ ఉద్యమకారులందరూ కోదండరామ్ నోటి వెంట ఏ మాట వస్తే దాన్ని తు.చ. తప్పకుండా పాటించడానికి రెడీగా వుండేవాళ్ళు. టీఆర్ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీల నాయకులు కోదండరామ్ చల్లనిచూపులు తమమీద వుండాలని కోరుకునేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్, పొలిటికల్ జేఏసీల భాగస్వామ్యం లేకుండా తన సొంత వ్యవహారంలా రాష్ట్ర విభజకు పూనుకుంది. అప్పటి నుంచి పొలిటికల్ జేసేసీకి, దాని నాయకుడు కోదండరామ్‌కి చేతిలో పనిలేకుండా పోయింది. విభజన విషయంలో కేంద్రం పొలిటికల్ జేఏసీ అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా గమనించకుండా ముందుకు వెళ్తోంది. గతంలో పొలిటికల్ జేఏసీ పేరు చెబితేనే గడగడా వణికిన తెలంగాణ నాయకులు ఇప్పుడు కోదండరామ్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కోదండరామ్‌కి నీడనిచ్చి, ఆయనలో రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆశల్ని పెంచి పోషించిన టీఆర్ఎస్ కూడా కోదండరామ్‌ని లైట్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏరుదాటక ముందు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా తన పరిస్థితిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును కోదండరామ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నీ కలసి వస్తే టీఆర్ఎస్ ఆశీస్సులతో ఏ రాజ్యసభకో వెళ్దామని కలలు కన్న ఆయన ఇప్పుడు తనను ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో ఆవేదనలో వున్నారు. ఎప్పుడూ తన వెనకాలే తిరిగే ఉద్యోగ సంఘ నాయకులని వెంట పెట్టుకుని చిన్నచిన్న ప్రదర్శనలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఓ పాతిక ముప్పై మంది కార్యకర్తలతో కలసి ఓ బుజ్జి ర్యాలీ చేసుకున్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుండా వుంటే తనకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఎదురు చూస్తున్నారు. పాపం కోదండరామ్!