క్రికెట్ దేవుడికి ఇక శలవు
క్రికెట్ ఆడని భారత్ ను ఊహించుకోవడం ఎంత కష్టమో, సచిన్ లేని క్రికెట్ ను ఊహించుకోవడం కూడా అంతకంటే చాలా కష్టం. క్రికెట్, సచిన్, దేవుడు మూడు కూడా మూడక్షరాల పదాలే కావడం సచిన్ క్రికెట్ దేవుడని చెప్పడానికే పుట్టాయని అనుకోవాలేమో.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వేల పరుగులు, ఇంకా అనేక అద్భుతాలను సృష్టించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నకోట్లాది మంది అభిమానుల నుండి, తనకు ప్రాణంతో సమానమయిన క్రికెట్ నుండి ఇక శలవంటూ ఈ రోజు వీడ్కోలు తీసుకొన్నాడు.
నిన్నముంబై వాంఖేడ్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచులో తన 200వ టెస్ట్ మ్యాచు ఆడి మరో సరి కొత్త రికార్డు నెలకొల్పిన సచిన్, నిన్ననే 76 పరుగులు తీసి అవుటవడంతో సాంకేతికంగా అతని క్రికెట్ ఆట ముగిసినట్లే అయింది. కానీ, అభిమానుల, ఆటగాళ్ళ కోరిక మేరకు ఈ రోజు మ్యాచులో కూడా అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేసాడు. వెస్ట్ ఇండీస్ జట్టుని ఓడించిన భారత్ జట్టు ఆ క్రికెట్ దేవుడికి సవినయంగా దక్షిణ సమర్పించుకొంది.
అనేక ఏళ్ళు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగిలాగే, ఏకంగా 24సం.లు ఏకధాటిగా క్రికెట్ ఆడిన తరువాత రిటర్మెంట్ తీసుకొంటున్నసచిన్ కూడా మళ్ళీ తన జీవితంలో ఇక మైదానంలో అడుగుపెట్టేది లేదని గ్రహించినప్పుడు, చాలా ఉద్విగ్నతకు లోనయ్యి కన్నీళ్ళు పెట్టుకొన్నాడు.
తనకు ఇంత ఉన్నతమయిన జీవితాన్ని, పేరు ప్రతిష్టలని, గౌరవాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ మైదానానికి వంగి నమస్కరించి శలవు తీసుకొన్నాడు. అతనిని ఆటగాళ్ళు తమ భుజాలపై ఎక్కించుకొని మైదానం చుట్టూ తిప్పుతుంటే, అతనికి వీడ్కోలు పలకడానికి వచ్చిన వేలాది ప్రజలు అదోరకమయిన సందిగ్దావస్థలో భారమయిన హృదయాలతో అతనికి వీడ్కోలు పలికారు.
సచిన్ టెండూల్కర్ వారినందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చిన తల్లి తండ్రులే తనని క్రికెట్ వైపు మళ్లించి తనకీ గొప్ప జీవితాన్ని, అరుదయిన గౌరవాన్ని కల్పించారని అందుకు వారికి సదా రుణపడి ఉంటానని అన్నారు. తన ఆటకోసం, ఉన్నతి కోసం, తన వ్యక్తిగత ఆనందాలను, సంతోషాలను పణంగా పెట్టి సహకరించిన అర్ధాంగి అంజలికి అతను ప్రేక్షకుల సమక్షంలో కృతజ్ఞతలు తెల్పుకొన్నాడు. ఈ రెండున్నర దశాబ్దాలలో తనకు సహకరించిన క్రికెట్ ఆటగాళ్ళకు, అభిమానులకు, బోర్డు మెంబర్లకు, మీడియాకి అందరికీ పేరుపేరునా అతను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నపుడు, అతనితో బాటు స్టేడియం లోపల బయట, టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్న లక్షలాది అభిమానులు కూడా తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు.
ఈ రోజుతో క్రికెట్ ప్రపంచంలో ఒక అధ్యాయం ముగిసి, చరిత్రగా మారింది. క్రికెట్ అనే పదానికి మారుపేరుగా మారిన సచిన్ ఇక ఆ క్రికెట్ లో ప్రత్యక్షంగా కనబడకపోవచ్చును. కానీ ఈ ప్రపంచంలో క్రికెట్ ఉన్నంత కాలం అతని పేరు తలచుకోకుండా బహుశః ఏ మ్యాచ్ కూడా పూర్తవదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చును.
తెలుగువన్ తరపున, అభిమానుల తరపున సచిన్ టెండూల్కర్ కి శుభాకాంక్షలు.