ఇస్రో చైర్మన్‌కు సమైక్య సెగ

  భారత అంతరిక్ష పరిశోదన సంస్థ పీఎస్‌ఎల్‌వి సీ 25 ప్రయోగం విజయవంతం అయిందన్న ఆనందంలో ఉండగా సమైక్య వాదులు మరోసారి తమ వాదనను అరుణగ్రహానికి వినిపించేలా నినదించారు. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్‌ విలేఖరులతో మాట్లాడుతున్న సమయంలో అక్కడి వచ్చిన విలేఖరులు సమైక్యాంద్రకు మద్దతుగా నినాదాలు చేశారు.   ఈ పరిణామంలో ఒక్కసారిగా షాక్‌ గురైన రాధాకృష్ణ కాసేపు ఆగి తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్ర మంత్రి వి నారాయణ స్వామికి తెలిపేందుకే సమైక్య నినాదాలు చేసినట్టుగా జర్నలిస్టులు తెలిపారు. నారాయణ స్వామి ప్రస్థుతం రాష్ట్రవిభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులు బృందంలో సభ్యుడిగా ఉన్నారు.  

టిడిపిలో ముదురుతున్న విభేదాలు

      తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. విభజన విషయంలో టీడీపీలోని తెలంగాణ, సీమాంధ్ర నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న వత్తిడి చూస్తుంటే తనకు భయం వేస్తుందని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అనడం విశేషం. జీవోఎంకు నివేదిక ఇవ్వొద్దని చంద్రబాబుపై సీమాంధ్ర నేతలు ఒత్తిడి తెస్తుండగా, సీమాంధ్ర నేతల తీరును తెలంగాణ నేతలు తప్పుపడుతున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని, తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రుల బృందానికి లేఖ ఇవ్వాల్సిందేనని వారు చంద్రబాబుతో తేల్చిచెప్పారు. అసలు కేంద్ర మంత్రుల బృందాన్నే గుర్తించడం లేదంటున్న చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారో వేచిచూడాలి.

పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంత౦

      పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగం కీలకమైన నాలుగు దశలను పూర్తి చేసుకొని విజయవంతమైంది. దీంతో షార్ సెంటర్ మిషన్ కంట్రోల్ మిషన్ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. షార్ శాస్తవేత్తలకు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనది మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. 

ఓదార్పు కాదు.. ఓటు యాత్ర!

      వైసీపీ అధినేత జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సీమాంధ్ర ప్రజల బుగ్గలు నిమరడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే జగన్ మళ్ళీ సీమాంధ్ర ప్రాంతంలో ఓదార్పు యాత్ర చేపట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఈనెల 15వ తేదీ తర్వాత ఓదార్పు యాత్రకి సంబంధించిన షెడ్యూలు ఖరారు చేసే అవకాశం వుంది.   తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాలుగేళ్ళ క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త విని గుండెలు ఆగిపోయి, ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారి కుటుంబాలను ఓదార్చే కార్యక్రమాన్ని జగన్ కొనసాగించబోతున్నాడట. పదహారు నెలల క్రితం అరెస్ట్ అయిన సమయంలో కూడా జగన్ ఓదార్పు యాత్రలోనే వున్నాడు.  ‘ఓదార్పు’ అనే మాటను తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేసుకున్న జగన్ ఈసారి చేపట్టాలని అనుకుంటున్న ఓదార్పు యాత్ర ఆయన వేస్తున్న మరో రాజకీయ ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. జనరల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో జగన్ చేపట్టబోతున్న యాత్ర 'ఓదార్పు యాత్ర' పేరుతో జరిగే 'ఓటు యాత్ర' అని అభివర్ణిస్తున్నారు. మొదట విభజన వాదం, ఆ తర్వాత సమన్యాయ వాదం, ఇప్పుడు సమైక్య వాదాన్ని భుజానికి ఎత్తుకున్న వైసీపీ సీమాంధ్రలో తన పట్టున పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ యాత్రని ప్లాన్ చేస్తోందని అంటున్నారు. అసలే రాష్ట్రం విభజనకు గురవుతోందన్న బాధలో వున్న సీమాంధ్ర ప్రజలను జగన్ ఓదార్పు యాత్ర ఓదార్చే విషయం అటుంచి, మరింత బాధపెట్టే అవకాశం వుందని భావిస్తున్నారు. సీమాంధ్రలో పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్న పరిస్థితుల్లో జగన్ ఓదార్పు యాత్రను చేపట్టడం ఆయనకి ప్రజల్లో మద్దతు పెంచే విషయం అటుంచి,  సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణుల్లో కూడా జగన్ ఇప్పుడు సీమాంధ్రలో పర్యటించి రాజకీయ లబ్ధి పొందదలచుకుంటే సమైక్యం పేరుతోనే యాత్రలు చేస్తే మంచిదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓదార్పు యాత్ర చేపడటం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుందని భయపడుతున్నారు. అయితే మాట తప్పని, మడమ తిప్పని జగన్ మహాశయుడు తన మనసు మార్చకుంటారో, తాను అనుకున్నట్టుగానే ఓదార్పు యాత్ర చేపడతారో చూడాలి.

బొత్స ఫోబియా!

      ఇప్పుడు సీమాంధ్రులని కొత్త మనోవ్యాధి పట్టి పీడిస్తోంది. దానిపేరు ‘బొత్స ఫోబియా’. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేరు విన్నా, ఆయన గొంతు విన్నా, ఆయన్ని చూసినా, ఆయన గురించి ఆలోచన వచ్చినా సీమాంధ్రులు వణికిపోతున్నారు. విపక్షంలో ఎదురుగా వున్న శత్రువుని ఎదుర్కోవచ్చు. స్వపక్షంలో వెనుకే వున్న శత్రువుని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే, కరడుగట్టిన విభజనవాది కేసీఆర్‌ని చూసినా కలగని భయం సమైక్యవాది ముసుగులో వున్న సీమాంధ్రుడు బొత్సని చూస్తే సీమాంధ్రులకి కలుగుతోంది.   తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో సీమాంధ్రలో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ హైకమాండ్‌కి నివేదికలు ఇచ్చి, పరిస్థితిని ఇంతవరకు తెచ్చిన బొత్స గారంటే సీమాంధ్రులకు ఆమాత్రం భయం వుండటం న్యాయమే. చేసిందంతా చేసి నేను సమైక్యవాదినని బొత్స ఎలుగెత్తి చాటినా జనం నమ్మలేదు.  భవిష్యత్తులో బొత్స ఎన్ని మెత్తటి కబుర్లు చెప్పినా నమ్మకూడదన్న నిర్ణయానికి సీమాంధ్రులు వచ్చేశారు. అయితే సీమాంధ్ర ప్రజలు మరోసారి బొత్సబారిన పడే సందర్భం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున నివేదిక ఇచ్చే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స మీదే వుంది. సదరు నివేదిక సమర్పించడానికి బొత్స సార్ సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కి చాలా గొప్ప నివేదిక ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన పరిస్థితులు తెచ్చిన బొత్స ఈసారి మంత్రుల బృందానికి ఎంత అందమైన నివేదిక ఇస్తారో, పరిస్థితిని ఇంకా ఎంత దిగజారుస్తారో అని సీమాంధ్ర ప్రజానీకం భయపడిపోతున్నారు.  పైకి ఎంత అందంగా సమైక్య వాదాన్ని వినిపించినా, సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన బొత్స రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండే విధంగానే మంత్రుల బృందానికి నివేదిక ఇస్తారన్న అనుమానాలు సీమాంధ్రులను పట్టి పీడిస్తున్నాయి. తెలుగు ప్రజలని బొత్స బారి నుంచి ఆ భగవంతుడే కాపాడాలి!

కెసిఆర్ ప్రకటనకు అర్థం వుందా?

      మెట్రో రైలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, అది రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుగా మారిందని, తెలంగాణ వచ్చాక అవసరమైతే దాన్ని కూల గొడతామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్  ప్రకటించేసారు.  అసలు ఈ ప్రకటనకు అర్థం పర్థం ఏమన్నా వుందా? అవకతవకలు జరిగి వుండొచ్చు. వాటిని వెలికి తీయాలి, సరిచేయాలి కానీ, కూలగొడతాం అనడం ఎంత వరకు సబబు? అసలు అది సాధ్యమా? ఒప్పందాలు, సంతకాలు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ పకడ్బందీగా వుంటాయి కదా? కెసిఆర్‌ ప్రకటన కేవలం రెండు విధాల మాత్రమే పనిచేస్తుంది. ఒకటి ప్రజలను రెచ్చగొట్టి తనతో ఇంకా మరి కొంత దూరం తీసుకెళ్లేందుకు.!. రెండవది ఎల్‌ అండ్‌ టి లాంటి సంస్థను బ్లాక్‌ మెయిల్‌ చేసి, ఎన్నికల నిధులు సంపాదించుకునేందుకు..!

అంగారక యాత్రకు సర్వం సిద్దం

      భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మక అంగారక యాత్రకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 2:38గంటలకు పీఎస్ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. 320 టన్నుల బరువు ఉపగ్రహంతో కలిపి, 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్.. దేశీయంగా రూపొందించిన 1,337 కిలోల మార్స్ ఆర్బిటర్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ప్రయోగానంతరం 44:28 నిమిషాల్లో భూ ఉపరితలానికి 383.38 కిలోమీటర్ల ఎత్తుకు చేరనుంది. పసిఫిక్ సముద్ర ఉపరితలంపై భూమధ్యరేఖకు 19.2 డిగ్రీల వాలులో ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలో మార్స్ ఉపగ్రహాన్ని విడిచిపెడుతుంది. ఈ ప్రయోగానికి ఆదివారం నుంచి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది.

ఆర్టీసి బాదుడు

      ఆర్టీసి ఛార్జీలు పెంచేశారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. పెంచిన ఛార్జీలు మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. స్లీపర్‌ కోచ్‌లైన వెన్నెల సర్వీసులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై సగటున 10 శాతం మేరకు పెంపుదల జరిగింది. ఆర్డినరీ, పల్లెవెలుగు సర్వీసులకు 8 శాతం చొప్పున, లగ్జరీ సర్వీసులకు 10 శాతం చొప్పున, ఎసీ బస్‌ సర్వీ సులకు 12 శాతం చొప్పున ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 4 పైసల చొప్పు న, ఎక్స్‌ప్రెస్‌ బస్‌ సర్వీసులకు 7 పైసల చొప్పున, డీలక్స్‌ బస్సులకు 9 పైసలు, సూపర్‌ లగ్జరీ బస్సులకు 11 పైసలు, ఇంద్ర బస్సులకు 12 పైసలు, గరుడ, గరుడ+ సర్వీసులకు కిలోమీటరుకు 15 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. వెన్నెల ఎసి స్లీపర్‌ కోచ్‌ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే సాధారణ బస్‌ పాసుల ధర కూడా పెరిగింది. సాధారణ బస్‌ పాస్‌ ధర నెలకు రూ.650 నుండి 700లకు పెరుగ గా, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రూ.750 నుండి 800లకు, మెట్రోడీలక్స్‌ రూ.800 నుండి రూ.900లకు పెరిగింది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రోడీలక్స్‌ బస్సులకు ప్రస్తుతం ఉన్న దానికన్నా కనీస టికెట్‌ ధర మరో రూపాయి పెరిగింది. ఛార్జీల పెంపుదలతో హైదరాబాద్‌ నుండి విజయవాడకు సాధారణ బస్సుల్లో ఛార్జీ రూ.211కు, డీలక్స్‌ రూ.240, సూపర్‌ లగ్జరీ రూ.283కు పెరిగింది. 2009 నుండి ప్రతి ఏటా ఆర్టీసి ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ చివరిసారిగా 2012 సెప్టెంబర్ 24న చార్జీలు పెంచింది. ఏడాది దాటగానే మళ్లీ ప్రయాణికులపై భారం మోపింది.

జబ్బార్ బస్సు ప్రమాదం: కెమికల్స్ రవాణా..!

      దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ బస్సు ఫైర్ ఆక్సిడెంట్ ఘటనకు సంబంధించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి సంబందించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రమాదకర రసాయనాలు తరలిస్తున్న విషయం బయటపడింది.   బస్సు దగ్ధం దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం సోమవారం బెంగళూరుకు వచ్చింది. ఉదయం 11 గంటలకు కలాసిపాళ్యలోని జబ్బార్ టావెల్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 2 గంటలవరకు విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  ప్రమాదం జరిగిన రోజు బస్సులో 12 మూటల వెంట్రుకలు (ఫ్యాషన్ విగ్గులు), ఆరు క్యాన్ల కెమికల్స్ ఉన్నాయని అంగీకరించినట్లుసమాచారం. అయితే బస్సులో బాణసంచా మాత్రం లేదని సిబ్బంది స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి కొద్దిపాటి గాయాలతో తప్పించుకున్న హఫీజ్ వాంగ్మూలాన్ని కూడా ఈ బృందం నమోదు చేసుకుంది.

ఆర్ధిక నేరస్తుడికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ సబబేనా?

              ఈరోజు న్యాయ ప్రాధికార సంస్థ చాలా ప్రాముఖ్యత గల తీర్పు వెలువరించింది. ఈ ఏడాది మే31న ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చెందిన రూ. 35 కోట్లు స్వాదీనం చేసుకోవడం న్యాయబద్దమయినదేనని ప్రకటించింది. ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్, టీఆర్ కన్నన్‌లను జగన్మోహన్ రెడ్డి చేత తన సంస్థలలో బలవంతంగా పెట్టుబడులు పెట్టించినందున, ఈడీ ఆవిధంగా వచ్చిన సొమ్మును స్వాదీనం చేసుకోవడం న్యాయబద్దమేనని తీర్పు వెలువరించింది.   ఈవిధంగా ఎవరో వ్యక్తులో, జగన్ రాజకీయ ప్రత్యర్దులో లేక వ్యాపారంలో పోటీదారులో చెప్పి ఉంటే వాటిని పట్టించుకొనవసరం లేదు. కానీ భారత ప్రభుత్వంలో కీలకమయిన ఒక సంస్థ అయిన న్యాయ ప్రాధికార సంస్థ దీనిని నిర్దారిస్తూ తీర్పు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్ధిక నేరస్తుడని స్పష్టమయింది. మరి అటువంటి ఆర్ధిక నేరస్తుడికి రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం?   జగన్ ఒక పార్టీ అధ్యక్షుడయి ఉండవచ్చును. లేదా యంపీ అయి ఉండవచ్చును. కానీ అంత మాత్రాన్న ఆయన నేరచరిత్రను విస్మరించలేము. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు భారతదేశానికి సర్వోనతమయిన పదవిని అలంకరించిన రాష్ట్రపతినే కలిసేందుకు అవకాశం ఇవ్వడం సమంజసమా? అని ఆలోచించాలి.   వైకాపా అభ్యర్ధన మన్నించడం తప్పనిసరయితే జగన్మోహన్ రెడ్డికి బదులు ఆయన పార్టీలో ఈ నేరాలతో ఎటువంటి సంబంధమూ లేని వేరెవరయినా వ్యక్తులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే భావ్యంగా ఉండేది.

బొత్స వర్గం ముఖ్యమంత్రికి పొగబెడుతోందా

  కొద్ది రోజుల క్రితం దివాకర్ రెడ్డి తమ పార్టీతో జగన్ కి సంబంధాలున్నాయని ప్రకటించినప్పుడు బొత్స సత్తిబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘క్రమశిక్షణ పాటించలేకపోతే పార్టీలో నుండి బయటకు వెళ్ళిపొమ్మని’ హెచ్చరించారు. దానిపై లగడపాటి స్పందిస్తూ, “అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అదేమాట చెప్పే దైర్యం ఉందా?” అని ప్రశ్నించారు. దీనికి బొత్స వద్ద సమాధానం లేదు. కానీ, ముఖ్యమంత్రి వ్యతిరేఖ వర్గంలో ఆయనతో బాటు ఉన్న మరికొంత మంది మంత్రులలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఒకరు.   అప్పుడపుడు ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా గళం సవరించుకొనే ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చేంత రాజకీయ శూన్యతేమి లేదు. వచ్చినా అవి నిలద్రోక్కుకోలేవు కూడా,” అని కిరణ్ కుమార్ రెడ్డికి పరోక్షంగా చురకలు వేసారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వాపును చూసి బలుపనుకొంటున్నారని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. అంతే గాక “పార్టీ నుండి బయటకు వెళ్లిపోదలచిన వారిని ఎవరూ ఆపబోరని, నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని,” ఆయన అనడం బహుశః ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దివాకర్ రెడ్డి, లగడపాటి వంటి వారిని ఉద్దేశ్యించి అన్నవేనని అర్ధం అవుతోంది.   అయితే బొత్స పలుకవలసిన పలుకులు ఆయన నోట పలుకుతున్నారంటే అందుకు బొత్స ప్రోత్సాహం ఉందని భావించాలేమో. తెలంగాణా కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోమని అడుగుతుంటే, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆయనను పార్టీ నుండి బయటకి పోతే బాగుటుందని ఎందుకు కోరుకొంటున్నారో?   అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ప్రజలలో సమైక్యవాదిగా ముద్ర వేసుకొన్నకిరణ్ కుమార్ రెడ్డి, పార్టీలో ఉండగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తమకి ముఖ్యమంత్రి పదవి దక్కదనే సత్యం గ్రహించినందునే బొత్స తదితరులు ఆయనకి పొగపెడుతున్నారేమో!

జగన్ కు షాక్

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై ఈడీ న్యాయప్రాధికారిక సంస్థ సోమవారం మరో తీర్పు వెలువరించింది. రూ. 35 కోట్ల పెట్టుబడులు ఈడీ అటాచ్ చేయడం సరైనదేనని న్యాయప్రాధికార సంస్థ అభిప్రాయపడింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై ఈడి తీర్పు జగన్‌కు షాక్ వంటిదని చెప్పవచ్చు. ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్, టీఆర్ కన్నన్‌లు పెట్టిన పెట్టుబడులు నేరపూరితమైనవేనని, జగన్ వ్యాపారం న్యాయబద్ధమైనది కాదని, నేరపూరితం, అవినీతి, అధికార దుర్వినియోగంతో జగన్ వ్యాపార సంస్థలు నెలకొల్పారని ఈడీ న్యాయప్రాధికారిక సంస్థ తెలిపింది. డెలాయిట్ సంస్థ నివేదిక తప్పుల తడక అని ఈడీ పేర్కొంది.

యువతిపై జవాన్ల అత్యాచారయత్నం

      ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అత్చాచారాలు ఆగడంలేదు. తాజాగా హైదరాబాద్‌లో గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. రక్షించాల్సిన సైనికులే కాటు వేయడానికి యత్నించారు. సికింద్రాబాద్‌లోని మహింద్రా హిల్స్ సమీపంలో టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతి, ఆమె స్నేహితుడు ఆదివారం రాత్రి గుడికి వెళ్ళారు. అనంతరం అక్కడ దగ్గరలో ఉన్న తోటలో ఇరువురు కూర్చుని మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన ముగ్గురు సైనికులు యువతి స్నేహితుడుపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం యువతిపై అత్యాచార యత్నం చేయబోయారు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది.గాయపడిన ఆమె స్నేహితుడు కాలనీకి వెళ్ళి స్థానికులు సహాయంతో తుకారం గేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. దీంతో రక్షక్ పోలీసులు హుటాహిటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని ముగ్గురు సైనికులను స్పాట్‌లో పట్టుకుని, వారిపై కేసు నమోదు చేశారు.

జీవోఎంకి టిడిపి దూరం

      రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందానికి(జీవోఎం) ఎలాంటి లేఖ ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. విభజన విషయంలో కేంద్ర హోంశాఖ సరిగ్గా వ్యవహరించడం లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడం ద్వారా మాత్రమే ఈ అంశాన్ని వదిలేయాలని భావిస్తున్నారు. తాము జీవోఎంను అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదని తన లేఖలో చంద్రబాబు పేర్కొంటారని తెలుస్తోంది. ప్రధానికి లేఖ విషయమై చంద్రబాబు సీమాంధ్ర, తెలంగాణ నేతలతో తన నివాసంలో భేటీ కానున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అంటున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్రకు అనుకూలం అని కేంద్రానికి లేఖ రాయాలని, విభజన విషయంలో పార్టీ స్టాండ్ మార్చుకోవాలని సీమాంధ్ర టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. పార్టీ ఎందుకు స్టాండ్ మార్చింది అన్నది తాము ప్రజలకు వివరిస్తామని వారు కోరగా ఆయన మౌనంగా ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన పాటలు

    సోనియా గాంధీ : '' తలచినదే జరిగినదా...దైవం ఎందులకూ....'' దిగ్విజయ్ సింగ్:  '' ఆగదు ఏ నిమిషం నీ కోసమూ...ఆగితే సాగదు ఈ లోకమూ...''      కిరణ్ కుమార్ రెడ్డి: '' జయమ్ము నిశ్చయమ్మురా...భయమ్ము లేదురా...." కేసీఆర్ : '' దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది'' జగన్:  '' నడిపించు నా నావా...నడి సంద్రమున దేవా...." చంద్రబాబు : " బోల్తా పడ్డావూ బుజ్జినయానా ..చెమ్కీ తిన్నావూ చిన్ని నాయనా..." చిరంజీవి : " జన్నమెత్తితిరా...అనుభవించితిరా" పురందేశ్వరి:  '' చిన్ని చిన్ని ఆశ!..చిన్నదాని ఆశ " ప్రణబ్ ముఖర్జీ : '' జీవము నీవే కదా..బ్రోచే భారము నీదే కదా..." సీమాంధ్ర నాయకులు : '' అమ్మా అని అరచినా ఆలకింప వేమమ్మా ...ఆవేదనా తీరు రోజు ఈ జన్మకు లేదా? ''                       ప్రజలు :  " ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?..."    ...........mallik

కార్తీక మాసంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ

      రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు జామునుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడికి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలిరోజే సోమవారం కావడంతో శివాలయలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా మహాశివుని దర్శనానికి క్యూకట్టారు. సోమవారమంటే మహాదేవునికి మహా ప్రియం అందులోనూ ఈసారి విశేషించి సోమవారంనాడే ఈ మాసం ప్రారంభమైంది. ఈ మాసమంతా శివారాధనా, ఉపవాసం చెయ్యలేనివారు కేవలం ఈ ఒక్క సోమవారంనాడైనా నిండుమనస్సుతో చెయ్యగలిగితే వారు తప్పక కైవల్యాన్ని పొందుతారు. ఈ మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా శివదేవునికి అభిషేకం, అర్చనలు చేసినవారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు.

సర్వేలను చూసి ఉలికిపడుతున్న కాంగ్రెస్

  బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాన అభ్యర్ధిగా ప్రకటించిక మునుపు, సరయిన నాయకత్వం లేక చాల బలహీనంగా ఉన్నఆ పార్టీని రానున్నఎన్నికలలో తాము అవలీలగా ఓడించవచ్చని కాంగ్రెస్ నేతలందరూ భావించారు. కానీ మోడీ రాకతో వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. అయితే తొలుత అద్వానీ వంటివారు ఆయనను తీవ్రంగా వ్యతిరేఖించడంతో కాంగ్రెస్ మళ్ళీ కుదుటపడింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అద్వానీతో సహా ఇప్పుడు బీజేపీలో అందరిలో కూడా మోడీ సారద్యంలో వచ్చేఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడం తధ్యమనే దృడ నమ్మకం ఏర్పడింది.   మోడీ దేశమంతతా పర్యటిస్తూ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మోడీ ప్రభావం కేవలం గుజరాత్ మరియు ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలకే మొదట పరిమితమయినప్పటికీ, ఆయన రాన్రాను తన పరిధిని విస్తరించుకొంటూ సాగిపోతుండటంతో, అది మీడియాను కూడా బాగా ఆకర్షించింది. ఇంకా సాధారణ ఎన్నికలకి ఆరు నెలల సమయం ఉన్నపటికీ ప్రతీ నెలా ఏదో ఒక మీడియా సంస్థ సర్వే చెప్పటడం, మోడీకి అనుకూలత పెరుగుతోందని ప్రకటిస్తోంది.   ఈ సారి ఎన్నికలలో ఎలాగయినా గెలిచి రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా పట్టాభిషేకం చేసి తను రాజకీయాల నుండి తప్పుకొందామని భావిస్తున్న సోనియాగాంధీకి, రానున్న ఎన్నికలలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. అయితే సర్వే రిపోర్టులన్నీ మోడీ భజన చేస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో, కేంద్ర ఎన్నికల కమీషన్ “ఈ సర్వేలను నిషేదిస్తే ఎలా ఉంటుందని?” అడుగుతూ అన్ని పార్టీలకు లేఖలు వ్రాసింది. ఊహించినట్లుగానే ఒక్క కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేఖించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ సర్వేలను నిషేదించడం మేలనే అభిప్రాయం వ్యక్తం చేసింది.   “ఎటువంటి శాస్త్రీయత లేని ఇటువంటి సర్వేలు నివేదికలు ప్రజలను తప్పు ద్రోవ పట్టించేందుకే తప్ప ఇంక దేనికి ఉపయోగపడవని” కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు.   అందుకు బీజేపీ కూడా ఊహించిన విధంగానే స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిది ముక్తార్ అబ్బాస్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని ముందే అంగీకరించినట్లు కనబడుతోంది. ఒకప్పుడు ఇవే సర్వే నివేదికలు తనకు అనుకూలంగా ఉన్నపుడు కాంగ్రెస్ వాటిలో తప్పు కనబడలేదు. కానీ ఇప్పుడు వ్యతిరేఖంగా వస్తుండటంతో అది అశాస్త్రీయంగా కనబడటం విశేషం. మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ కు భయం పట్టుకొంది. అందుకే సర్వేలు కూడా చూసేందుకు జంకుతోంది,” అని అన్నారు.

అఖిలపక్షం ఐడియా బెడిసికొట్టిందా

  రాష్ట్ర విభజనపై చర్చించడానికి కేంద్రం ఈ నెల 12,13 తేదీలను ముహూర్తంగా నిశ్చయించింది. మొదటి రోజు నాలుగు పార్టీలతో రెండో రోజు మిగిలిన నాలుగు పార్టీలతో సమావేశమవ్వాలని నిశ్చయించుకొంది. అయితే రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ దశలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుని తీవ్రంగా విమర్శిస్తుండటంతో, ఈ ఐడియాతో ప్రతిపక్షాలను ఇరికించాలని చూసిన కాంగ్రెస్ స్వయంగా ఇరుక్కొంది. వైకాపా, సీపీఎం, తెరాస, తెదేపాలే కాదు చివరికి మజ్లిస్ పార్టీ సైతం అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడానికి నిరాసక్తత చూపడం గమనార్హం. ఒక తెదేపా,వైకాపాలు తప్ప అందరు ఎగురుకొంటూ వచ్చేస్తారని భావించిన కాంగ్రెస్ పార్టీకి తెరాస సైతం తీవ్ర విమర్శలు చేయడంతో వాటికి జవాబు చెప్పకతప్పని పరిస్థితి ఏర్పడింది.   అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ “కేసీఆర్ కేంద్ర మంత్రుల బృందానికి తమ పార్టీ తరపున సలహాలు ఈయవచ్చును. కానీ అనవసరమయిన వ్యాఖ్యలు మానుకొంటే మంచిది,” అని ఘాటుగా జవాబిచ్చారు. అదేవిధంగా ఆయన తెదేపాను విమర్శిస్తూ “ఒక్కపుదు అఖిలపక్షం సమావేశం పెట్టమని గట్టిగా డిమాండ్ చేసిన ఆ పార్టీ ఈవిషయంలో కూడా ‘యూ టర్న్’ తీసుకోవడం విచారకరం,” అని అన్నారు.   రాష్ట్రంలో పార్టీలు ఏవిధంగా వ్యవహరించినప్పటికీ, రెండు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు, దూరం తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పడం విశేషం. రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టిందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నఆరోపణల కారణంగానే బహుశః ఆయన ఈవిధంగా స్పందించి ఉండవచ్చును.   ఏమయినప్పటికీ, రాష్ట్ర విభజ చేయాలని నిర్ణయం తీసుకొన్న తరువాత, ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే కాదు, తన తప్పుల తడకల విభజన ప్రక్రియను విమర్శిస్తున్న వారిని కూడా ఇందులో ఇరికించాలనే దురాలోచన కూడా చాలా ఉంది.