విభజనకు జగన్ ఓకే!
posted on Nov 9, 2013 @ 2:57PM
ఢిల్లీ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు.. ఇలా ఇండియాలోని చాలా రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు తెలుగువాళ్ళ చెవుల్లో పూలు పెడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వేరే రాష్ట్రాల వాళ్ళు చాలరన్నట్టు తెలుగోడే తెలుగోడి చెవిలో పూలు పెడుతున్నాడు. ఆ తెలుగోడు ఎవరో కాదు... వైసీపీ నాయకుడు జగన్!
అయ్యగారు తనను తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ వుంటారు. మరోవైపు విభజనకు తనవంతు సహకారం తాను అందిస్తూ వుంటారు. జగన్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధమైంది. అంత దారుణానికి సహకరించి కూడా తాను తాను సమైక్యవాదినని చెప్పుకుంటున్న జగన్ తెలుగు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడుతున్నాడు. రాష్ట్ర విభజన విషయంలో జగన్ కర్ణపుష్పన్యాయం మరోసారి బయటపడింది.
రాష్ట్ర విభజన గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, తమ పార్టీ నుంచి ఆ మీటింగ్‌కి ఎవరూ వెళ్ళరని జగన్ చెప్పాడు. ఆ మీటింగ్‌కి వెళ్తే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టే అవుతుందని, తాను కనీవినీ ఎరుగనంత సమైక్యవాదిని కాబట్టి తమ పార్టీ మీటింగ్‌తో పాల్గొనదని జగన్ తియ్యగా చెప్పాడు. కొంతమంది అమాయకులు చెప్పిన మాటలు నమ్మేశారు. అయితే తాజాగా జగన్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.
జీవోఎం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. ఆ సమావేశానికి వైసీపీ తరఫున మైసూరారెడ్డి పాల్గొంటారట. ఆయన ఆ మీటింగ్‌లో సమైక్య గళాన్ని మంత్రుల బృందంలో వున్నవాళ్ళ కర్ణభేరి పగిలిపోయేంత గట్టిగా వినిపిస్తారట. మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్తే విభజనకు ఓకే అన్నట్టే అని వక్కాణించిన జగన్ ఇప్పుడు ఆ మీటింగ్‌కి తన పార్టీ నుంచి ప్రతినిధిని పంపిస్తున్నాడంటే రాష్ట్ర విభజనకు జగన్ అధికారికంగా ఓకే చెప్పినట్టే భావించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.