సీనియర్స్ ని కాదని శ్రీధర్ బాబుకి పట్టం కడితే
posted on Nov 9, 2013 @ 8:45PM
రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే తెలంగాణాకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి పదవుల కోసం టీ-కాంగ్రెస్ నేతలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడితే గానీ, ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ ఖరారు చేయడం సాధ్యం కాదు గనుక, పార్టీ పరంగా తెలంగాణాకు పీసీసీని ఏర్పాటు చేసి, అధ్యక్షపదవికి పేరు ప్రకటించినట్లయితే, శాసనసభలో తెలంగాణా బిల్లుపై ఏవిధంగా వ్యవహరించాలో నిర్ణయించుకోగాలమని, అంతే గాక ఎన్నికలకు సన్నాహాలు చేసుకోగలుగుతామని టీ-కాంగ్రెస్ నేతల గట్టిగా పట్టుబడుతుండటంతో టీ-పీసీసీ ఏర్పాటుకి కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.
అయితే వారి విజ్ఞప్తిని మన్నించినా, మాజీ పీసీసీ అధ్యక్షులు డీ. శ్రీనివాస్, షబ్బీర్ ఆలీ వంటి అనేక మంది సీనియర్లను, అనుభవజ్ఞులను పక్కనబెట్టి రాష్ట్రపౌర సరఫరా శాఖా మంత్రి శ్రీధర్ బాబుని డిల్లీకి పిలవడంతో వాళ్ళు కంగు తిన్నారు. యువతకు పెద్ద పీట వేస్తానని చెపుతున్న రాహుల్ గాంధీ అభీష్టం మేరకే శ్రీధర్ బాబుని డిల్లీ పిలిచినట్లు సమాచారం. అదే నిజమయితే, రానున్న ఎన్నికలలో ఇప్పుడున్న సీనియర్లలో ఎంత మందికి మళ్ళీ టికెట్స్ దొరుకుతాయో తెలియదు. ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ముఖ్యమంత్రి కలలను సాకారం చేసుకోవాలని వారు భావిస్తుంటే ఇప్పుడు ఈ ‘యువ కారణం’ వలన అన్యాయం అయిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే ఎన్నికల సమయంలో ఈ సీనియర్స్ పార్టీని తమ జూనియర్స్ ని ముప్పతిప్పలు పెట్టడం ఖాయం.