వసపిట్ట కేటీఆర్!

 

కేసీఆర్ తనయుడు కేటీఆర్‌కి చిన్నప్పుడు వస ఎక్కువగాపోసినట్టున్నారు. అందుకే అయినదానికీ, కానిదానికీ సీమాంధ్రుల మీద నోరేసుకుని పడిపోతూ వుంటాడు. తాను సృష్టించే అబద్ధాలను తెలంగాణ ప్రజల చేత నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ విషయంలో కేటీఆర్‌ది తండ్రిపోలికే! ఇప్పుడు తాజాగా కేటీఆర్‌ తన క్రియేటివిటీని రాష్ట్ర విభజన అనంతరం శాంతిభద్రతల పరిస్థితి మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ మీద చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే శాంతి భద్రతల పరిస్థితి మీద సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సీనియర్ అధికారులు సభ్యులుగా వున్న ఈ టాస్క్ ఫోర్స్ అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో విభజనవాదులకు పళ్ళకింద రాళ్ళలాగా వుండే, విభజన అనంతరం వాళ్ళ హింసాత్మక ధోరణికి అడ్డు తగిలే అనేక అంశాలు వున్నాయి. దాంతో విమర్శల చిట్టా పట్టుకుని కేటీఆర్ రంగంలోకి దిగిపోయాడు. తమకు అనుకూలంగా వుంటే రైట్ లేకపోతే రాంగ్ అనే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే విభజనవాదుల ప్రతినిధి అయిన కేటీఆర్ టాస్క్ ఫోర్స్ నివేదిక మీద విమర్శల వర్షం కురిపించాడు. టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకట. చీఫ్ విజయ్ కుమార్ సీమాంధ్ర నాయకులతో రహస్య సమావేశం జరిపి సీమాంధ్రులకు అనుకూలంగా ఉండే నివేదికను రూపొందించారట. టాస్క్ ఫోర్స్ లో వున్న సీమాంధ్ర అధికారులు నివేదికను ప్రభావితం చేశారట. తెలంగాణకు వ్యతిరేకంగా వున్న  ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ బిల్లు రూపొందిస్తే ఒప్పుకోరట... ఇదీ కేటీఆర్ వరస! అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ప్రవేశపెడితే మొట్టమొదటి అవార్డు కేసీఆర్‌కి, రెండో అవార్డు కేటీఆర్‌కి ఇవ్వాలి. గతంలో శ్రీకృష్ణ కమిటీ మీద కూడా సీమాంధ్రులు ప్రభావం చూపించారని నోరు పారేసుకున్న కేటీఆర్ లాంటి విభజనవాదులు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ విషయంలో కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నారు. తనకే అన్నీ తెలిసినట్టు ఆరిందాలా వసపిట్టలా మాట్లాడే కేటీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. కేటీఆర్ లాంటి నాయకులు ప్రతి విషయం మీదా నిరాధార ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజల పరువు తీయకుండా వుండాలని కోరుకుంటున్నారు.