తెలంగాణ వద్దట!

 

 

 

ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనని పట్టుపట్టిన విభజన వాదుల నోటి వెంట తెలంగాణ వద్దనే మాటలు కూడా వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో పార్టీలతో నిమిత్తం లేకుండా తెలంగాణ వాదులంతా ‘మాకు తెలంగాణ వద్దు బాబోయ్.. సమైక్యంగానే ఉంటాము దేవుడోయ్’ అని మొత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి శుభారంభంగా ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నోటి వెంట ‘ఇలాగైతే తెలంగాణ వద్దు’ అనే మాటలు వచ్చాయి.

 

ఆ ఇద్దరు నాయకులు ఎవరో కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ! కేంద్ర రాజకీయాలు మొన్నటి వరకు విభజనవాదులకు అనుకూలంగా సాగాయి. రెండు రోజుల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. జరుగుతున్న ఒక్కో పరిణామం  విభజనవాదుల గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారవుతోంది. రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు ఎలా వుండాలో నిర్ణయించే టాస్క్ ఫోర్స్ నివేదిక బయటకి వచ్చింది. అలాగే ఆంటోనీ కమిటీ తన నివేదిక రెడీ చేసింది. నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి.




టాస్క్ ఫోర్స్ నుంచి, ఆంటోనీ నుంచి వచ్చిన నివేదికలలో ప్రస్తావించిన ప్రతిపాదనలు విభజనవాదుల గొంతెమ్మ కోర్కెలకు వ్యతిరేకంగా వున్నాయి.  సీమాంధ్రుల ఆవేదనను అర్థం చేసుకున్నట్టు, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా వున్నాయి.  ఇప్పటి వరకు సీమాంధ్రుల నెత్తిన తెల్లగుడ్డ వేసి  హైదరాబాద్‌లో నుంచి పంపేసే ఆలోచనలో వున్న విభజన వాదులకు ఇవి షాకిచ్చాయి. వాళ్ళ విభజనోత్సాహం మీద నీళ్ళు పోశాయి. దాంతో వెంటనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆమోస్ మీడియా ముందుకు వచ్చేశాడు.



ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రతిపాదనలతో తెలంగాణ బిల్లు రూపొందిస్తే తెలంగాణ ఇచ్చీ వేస్టన్నాడు. ఈ పద్ధతిలో అయితే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదన్న మాట ఆయన నోట్లోంచి బయటపడింది. అదేవిధంగా, కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం రాజనర్సింహ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించేట్టయితే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదని ఆవేశంగా అన్నట్టు సమాచారం. ఈమాత్రం దానికే తెలంగాణ వద్దన్న మాటలు వస్తున్నాయి. రేపు హైదరాబాద్ గురించి ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయో, అప్పుడు విభజనవాదులు ఎలా స్పందిస్తారో!