రాజీబాటలో ‘హర్రీ’కృష్ణ!
posted on Nov 10, 2013 9:26AM
తన పుత్రరత్నం జూనియర్ ఎన్టీఆర్‌కి తెలుగుదేశం పార్టీలో సువర్ణ రత్నఖచిత సింహాసనం వేయట్లేదని నందమూరి హరికృష్ణ ఫీలవుతూ వుంటారు. ఆ అసంతృప్తిని అప్పుడప్పుడు వెళ్ళగక్కుతూ వుంటారు. ఆ అసంతృప్తిని మరింత బలంగా వ్యక్తం చేయడానికి సందర్భం కోసం ఎదురు చూసిన ఆయనకి సమైక్యాంధ్ర ఉద్యమం ఒక మంచి అవకాశంలా దొరికింది. దాంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగాచూపించి తన రాజ్యసభ సభ్యత్వానికి హర్రీగా రాజీనామా చేశారు. అదేం ఖర్మోగానీ, ఆయన రాజీనామాని లటుక్కున ఆమోదించేశారు. ఊహించని పరిణామానికి హరికృష్ణ కంగుతిన్నారు. పదవి పోతేపోయింది.. సమైక్యాంధ్ర హీరోగా అయినా మిగులుతానులే అనుకుని సరిపెట్టుకున్నారు. ‘హర్రీ’కృష్ణ బ్యాడ్ లక్ ఏంటోగానీ, ఆయన చేసిన ‘త్యాగాన్ని’ ఎవరూ పట్టించుకోలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన పేరుని తలుచుకున్నవాళ్ళే లేరు. హరికృష్ణ సమైక్యాంధ్ర ఉద్యమంలో దూకితే అద్భుతాలు జరుగుతాయని దురాశపడిన అమాయకులు కూడా ఎవరూ లేరు! అటు రాజ్యసభ సభ్యత్వం పాయె.. ఇటు రాజీనామా క్రెడిట్టూ దక్కకపాయె! మరోవైపు తాను రాజీనామా చేసినా చంద్రబాబు బావ ఎంతమాత్రం చలించక పాయె! దాంతో హరికృష్ణలో ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైనట్టు తెలుస్తోంది. తండ్రి ఎన్టీఆర్ నుంచి ఆవేశాన్ని మాత్రమే వారసత్వంగా పొందిన హరికృష్ణలో ఇప్పుడు అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. అపర చాణక్యుడైన చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి తాను చెడిపోయి, తన పుత్రరత్నం జూనియర్ ఎన్టీఆర్‌ని చెడగొట్టడం కంటే రాజీబాటలో నడిచి పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో హరికృష్ణ వున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన హితబోధ కారణంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా మసలుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ని మళ్ళీ తెలుగుదేశానికి చేరువ చేయడానికి హరికృష్ణ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్‌తో ఎన్టీఆర్‌కి సఖ్యతని కుదర్చడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దాలని హరికృష్ణ భావిస్తున్నట్టు సమాచారం.