జగన్ పునరాలోచన!
posted on Nov 10, 2013 @ 9:31AM
విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే వైసీపీ అధినేత జగన్ విధానంలా కనిపిస్తోంది. విభజన వాదం నుంచి సమన్యాయ వాదానికి మళ్ళీ అక్కడి నుంచి సమైక్య వాదానికి షిష్టయిన జగన్‌లో ఇప్పటికీ క్లారిటీ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమంటే విభజనకు అంగీకరించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. తమ పార్టీకి రాష్ట్ర విభజన ఇష్టం లేదు కాబట్టి ఆ సమావేశానికి తమ పార్టీ వెళ్ళబోదని జగన్ మొదట్లో ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం ఐడియా వచ్చిందోగానీ, తాజాగా జీఓఎం సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డి వెళ్తారని ప్రకటించి రాష్ట్ర విభజన మీద తనకున్న మక్కువను బహిర్గతం చేశారు. ఆ సమావేశానికి మీ పార్టీ నుంచి సభ్యుడిని పంపితే విభజనకు ఒప్పుకున్నట్టే కదా అని ప్రశ్నిస్తే, అబ్బే మైసూరారెడ్డి మీటింగ్‌కి వెళ్ళి విభజనకు ఒప్పుకోరు.. కేంద్ర మంత్రుల బృందాన్ని బాగా తిట్టి, వాళ్ళకి సమైక్య పాఠాలు బోధించి వస్తారని జగన్ వివరణ ఇచ్చాడు. అసలు ఆ మీటింగ్‌కి వెళ్ళకపోతేనే రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు లెక్క! అలాంటప్పుడు ప్రత్యేకంగా మీటింగ్‌కి వెళ్ళి విభజనని వ్యతిరేకిస్తున్నామని చెప్పడమెందుకో కిందున్న జగన్మోహనరెడ్డికి, పైనున్న ఆ రాజశేఖరరెడ్డికే తెలియాలి. మైసూరాని మీటింగ్‌కి పంపాలని తాను తీసుకున్న నిర్ణయానికి సమైక్యవాదుల నుంచి, వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ వుండటంతో జగన్ మరోసారి తన విధానాన్ని మార్చుకునే ఉద్దేశంలో వున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్నటి వరకూ వీర తెలంగాణవాదిగా ముద్ర పడిన బీజేపీ కూడా మంత్రుల బృందం మీటింగ్‌కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. అలాంటప్పుడు సమైక్యవాద పార్టీగా క్లెయిమ్ చేసుకుంటున్న తమ పార్టీ ఆ మీటింగ్‌కి వెళ్తే సీమాంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచన వైసీపీ పార్టీ వర్గాల్లో నలుగుతోంది. దాంతో మంత్రుల బృందం మీటింగ్‌కి తమ పార్టీ నుంచి మైసూరాని పంపకుండా వుంటే ఎలా వుంటుందన్న దానిమీద పార్టీలో తీవ్ర స్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నట్టు సమాచారం.