రచ్చబండ మీద నిలబడి అరిస్తే విభజన ఆగుతుందా
posted on Nov 16, 2013 @ 2:59PM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని మా ముందు ఎంత గొంతు చించుకొని అరిస్తే మాత్రం ఏమి లాభం? అదేదో మీ అధిష్టానం ముందు అరిస్తే బాగుంటుంది కదా! అని ప్రజలు భావిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చ బండ మీద నిలబడి మన సమైక్యనినాదాలు ఢిల్లీకి విన్పించేలా గొంతెత్తి నినదించమని వారినే అడగడం విశేషం. తమ పార్టీ తీసుకొన్న నిర్ణయానికి తాను చింతిస్తున్నానని, అయితే ఈ నెల 18న జరుగనున్న కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో పాల్గొని సమైక్యరాగం మరింత గట్టిగా ఆలపిస్తానని ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు.
నిజానికి సమైక్య ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఉంటే, ముందుగా ఆయన రాజీనామా కోసం వారు పట్టుబట్టేవారేమో! ఒకవైపు డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, మరో పక్క కేంద్రమంత్రుల బృందానికి అవసరమయిన నివేదికలు కూడా పంపుతూనే,మళ్ళీ ఇక్కడ రచ్చబండ మీద నిలబడి గొంతు చించుకోవడం దేనికి ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే! తనను నిలదీయవలసిన ప్రజల చేతనే కిరణ్ కుమార్ రెడ్డి తనకు జై కొట్టించుకోవడం నిజంగా గొప్ప విషయమే.