సొంత పార్టీకి కిరణ్ ప్రచారం..!

 

 

అందరూ ఊహించినట్టే రచ్చబండను తన ఇమేజ్ పెంచుకోవడానికి సీఎం ఉపయోగించుకోవడం ప్రారంభించేశారు. భవిష్యత్తులో తాను కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత పార్టీ పెడితే సీమాంధ్ర ప్రజలు తనకు పూర్తి మద్దతు ఇచ్చేలా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికుల సమస్యల పరిష్కారం కంటే సమైక్యాంధ్ర నినాదాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు.

 

రాష్ట్రం విడిపోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, చివరి వరకు రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడతానని ప్రసంగించారు. రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలను ఏకరువు పెట్టారు. సీఎం ఇలా మాట్లాడుతూ వుంటే సీమాంధ్రుల మనసులు ఒకసారి కాకపోతే ఒకసారైనా కరగకుండా వుంటాయా అని ఆయన అనుకూల వర్గాలు ఆశాభావంతో వున్నాయి.



రచ్చబండలో సమైక్య నినాదాన్ని చాటడంతోపాటు స్థానికులకు బోలెడన్ని వరాలు కూడా సీఎం ప్రకటించారు. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వాగ్దానాలు చేశారు. ఈసారి రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్ మొత్తం నాలుగు సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఈ నాలుగు జిల్లాలనూ తన ‘గ్రిప్’లోకి తెచ్చుకోవాలని కిరణ్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.