ఇంతకీ జగన్ డిల్లీ వెళ్లి ఏమి సాధించినట్లో

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంత దూరమయినా వెళ్లేందుకు సిద్దమంటున్నజగన్ బాబు ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసేందుకు డిల్లీకి వెళ్ళారు. అయితే ఆయన కలుస్తున్న పార్టీల్లో దాదాపు అన్నీ కూడా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నవేనని తెలిసి ఉన్నప్పటికీ, వాటిని కలిసి మద్దతు కూడగట్టుకోవాలను కోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుని సమర్దిస్తున్నసీపీఐ పార్టీ నేతలనే జగన్ మొట్ట మొదట కలవడం కాకతాళీయమే కావచ్చు. గానీ, ఊహించినట్లే వారు తెలంగాణాపై తమ వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని మొహం మీదనే చెప్పేశారు. అయితే సీమాంధ్రకు అన్యాయం జరుగకుండా తమ పార్టీ శ్రద్ద వహిస్తుందని అభయం ఇచ్చిసాగనంపారు.

 

ఇక తరువాత ఆయన కలువబోయే సీపీయం, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపటికీ ఇటీవల జరిగిన అఖిల పక్షసమావేశంలో విభజన అనివార్యమయితే ఏమి చేయాలో చెప్పడంతో ఆ పార్టీ కూడా విభజనకు అంగీకరించినట్లే అయింది. కానీ మున్ముందు జగన్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్న ఆ పార్టీ బహుశః అతనికి సానుకూలంగానే స్పందించవచ్చును. ఆ పార్టీ కూడా సీమాంద్రకు అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చి సాగానంపవచ్చును.

 

ఇక రేపు జగన్ కలువబోయే బీజేపీ మొదటి నుండి తెలంగాణాకు మద్దతు పలుకుతోంది. అయితే సీమాంధ్ర, తెలంగాణాలలో తన పార్టీ ప్రయోజనాలను, భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల తన వైఖరి మార్చుకొంటున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలని కోరుకొంటోంది గనుక మున్ముందు జగన్ మద్దతు అవసరం ఉంటుంది గనుక, అతను తన మద్దతు గురించి కన్ఫర్మ్ చేస్తేనే సానుకూలంగా స్పందించవచ్చును.

 

ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీ తన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్నేనాలుగు ముక్కలు చేయాలని డిమాండ్ చేస్తోంది. గనుక జగన్ కోరికను మన్నించడం కష్టం. కానీ, ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాది పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్న కారణంగా జగన్ కి మద్దతు పలుకవచ్చును. కానీ కాంగ్రెస్ అధిష్టానం ములాయం కుటుంబ సభ్యులందరిపై తన సీబీఐ చిలుకలను ప్రయోగించి, వారినందరినీ తన అదుపులో ఉంచుకొంది. ఈ విషయాన్ని గతంలో స్వయంగా ములాయం సింగే చెప్పారు కూడా. అందువల్ల ములాయంకి మద్దతు ఈయలని ఉన్నపటికీ అతనికీ జగన్మోహన్ రెడ్డికీ మధ్య సీబీఐ అడ్డుగోడ ఉంది. గనుక దానిని దాటే సాహసం చేయకపోవచ్చును.

 

అంటే జగన్ కలిసిన పార్టీలలో ఏ ఒక్కటీ కూడా అతనికి బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని అర్ధం అవుతోంది.