వెల్‌కమ్ టు క్రిమినల్స్
posted on Nov 16, 2013 @ 1:46PM
తలుపులు బార్లా తెరిచివున్న ఇంట్లోకి ఎవరు వెళ్ళారు? కుక్కలు, పిల్లలు, దొంగలు దూరేస్తారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. వచ్చే ఎన్నికలలో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో భారీ సంఖ్యలో సీట్లు సంపాదించేయాలని జగన్ భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా డబ్బు భారీగా పెట్టగల వారికి ఎవరికైనా తన పార్టీలో స్థానం వుంటుందని సూచనలు ఇస్తున్నాడు. అలాంటి వారికి తన పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ పార్టీ తలుపులు బార్లా తెరిచిపెట్టాడు. దాంతో పార్టీలోకి నేరచరితులు భారీగా వచ్చి చేరుతున్నారు.
ఏ దిక్కూ లేకుంటే అక్కమొగుడే దిక్కన్నట్టు ఏ పార్టీలోనూ స్థానం దొరకని నేరచరితులు ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు ఆశగా చూస్తున్నారు. మొన్నటి వరకూ జైల్లో ఆతిథ్యం తీసుకున్న మోపిదేవి వెంకటరమణ వైసీపీలో మహా దర్జాగా చేరిపోయారు. ఈమధ్యకాలంలో ఈ పార్టీలో చేరిన వాళ్ళలో నేరచరితులే ఎక్కువగా వున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఒకటో అరో కేసులు వున్నవాళ్ళతోపాటు భారీ క్రిమినల్ రికార్డులు వున్నవారు కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
జైలు శిక్షలు పడ్డవాళ్ళు కూడా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా ఈ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే పదహారు నెలలు జైలులో వుండొచ్చాడు కాబట్టి పార్టీలో చేరడానికి తమకు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరని సదరు జైలుపక్షులు భావిస్తున్నట్టున్నారు. అయితే ఈ ధోరణి వైసీపీలో వున్న ఒకటీ అరా ఉత్తములకు నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే పార్టీలోకి నేరచరితుల ప్రవాహాన్ని ఆపే శక్తి తమకు లేకపోవడం వల్ల ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ధోరణి మంచిది కాదని జగన్‌కి చెప్పాలని ఒకరిద్దరు తాపత్రయ పడినా, మంచి సలహాలిచ్చేవారినే బయటకి నెట్టేసే జగన్ తత్వం తెలిసినవారు కావడంతో వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.