సోనియమ్మ వరమిచ్చినా ...సీబీఐ అడ్డుపడినట్లు
posted on Nov 15, 2013 @ 12:24PM
ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్లుగా, చంచల్ గూడా జైలులో జగన్ తో ఏకంగా పదహారు నెలలు సహవాసం చేయడంతో మోపిదేవి అ జగన్ పంచనే జేరుతున్నారు. ఇక జగన్ పుణ్యమా అని సీబీఐ చార్జ్ షీట్లో పేర్లు నమోదు చేయించుకొన్నపాపానికి పాపం! సబిత, ధర్మాన అన్యాయంగా తమ పదవులు ఊడగొట్టుకొని తమ పరిస్థితేమిటో తమకే తెలియక తలలు పట్టుకొని కూర్చొన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ నేతలకి కొంత ‘హ్యాండ్ సప్పోర్ట్’ బాగానే ఉన్నపటికీ, సీమాంధ్రలో అది బొత్తిగా కరువవడంతో పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు వెర్రి నాగాన్నలు.
అయితే ఈ సీబీఐ చార్జ్ షీట్లో ఎక్కిన పేర్లు సబితమ్మకి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న గీతమ్మకి, ధర్మయ్యకి భుజకీర్తులు (మెడల్స్)లా తయారవడంతో ఇప్పుడు తమకి టికెట్స్ వస్తాయో రావో అని వారందరూ ఒకటే టెన్షన్ లో ఉన్నారు పాపం! మోపిదేవి దైర్యంగా వైకాపాలోకి దూకేసినా ఈ ముగ్గురి పరిస్థితి మాత్రం చాలా అయోమయంగా ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ నుండి వైకాపాలోకి దూకడమంటే గోతి లోంచి నూతిలోకి దూకినట్లే గనుక పాపం ఆ అమ్మలిద్దరూ వేరే ఆప్షన్స్ లేక కాంగ్రెస్ నే కరిచిపెట్టుకొని ఉన్నారు ఇంకా.
సోనియమ్మ వారికి టికెట్ ఇవ్వలనుకొన్నా సీబీఐ వారికి అడ్డుపడటం నిజంగా ఎంత దురదృష్టం?