ఇది కాంగ్రెస్ మార్క్ రాష్ట్ర విభజన
రాష్ట్ర విభజనపై అసలు కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో ఉందా? లేక ఆవిధంగా ప్రవర్తిస్తూ ప్రజలనే అయోమయంలో ఉంచుతూ తన పని కానిచ్చేయాలని ప్రయత్నిస్తోందా? అనే అనుమానం ప్రజలలో నెలకొంది.
ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ లో మొదట తెలంగాణా, సమైక్యాంద్ర వాదులే ఉండేవారు. ఆ తరువాత సమైక్యవాదులలో అధిష్టానానికి అనుకూల వర్గం, వ్యతిరేఖ వర్గాలు పుట్టుకొచ్చాయి. మళ్ళీ ఈ అనుకూల వర్గంలో ఉత్తుత్తి రాజీనామాలు చేసిన వారు, అసలు చేయని వారు ఉన్నారు. విభజనను వ్యతిరిఖించే వర్గంలో మళ్ళీ ముఖ్యమంత్రి వర్గం, అతనిని వ్యతిరేఖించే వర్గం ఏర్పడ్డాయి. ఇక వీటికి అదనంగా కాంగ్రెస్ పార్టీలో చాలా ముటాలు, గ్రూపులు ఉండనే ఉన్నాయి.
ఈ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమలో తాము కొట్లాడుకొంటూనే మరో వైపు టీ-కాంగ్రెస్ నేతలతో కూడా కత్తులు దూస్తూ ఈ వ్యవహారంలో వీలయినంత గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకే కాంగ్రెస్ పార్టీ ఇన్నివిధాలుగా విడిపోయి తలొక వాదన చేస్తుంటే, సహజంగానే ప్రజలలో కొంత గందరగోళం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ గ్రూపుల వాద ప్రతివాదనలే నేడు రాజకీయాలుగా చలామణి అవుతుండటం దురదృష్టకరం.
రాష్ట్ర కాంగ్రెస్ నేతల శైలికి ఏ మాత్రం తీసిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారంపై రోజుకొక మాట మాట్లాడుతూ, మీడియాకి లీకులు ఇస్తూ కధ నడిపిస్తోంది. ఒక రోజు హైదరబాద్ పై ఫలాన ఆప్షన్స్ పరిశీలిస్తున్నామని చెపితే, మరోసారి భద్రాచలం గురించి, ఇంకోసారి ఆర్టికల్ 371 ఉంచాలా, సవరించాలా లేక తొలగించాలా?అని ఇంకోసారి రాష్ట్ర శాసనసభకి పంపవలసింది బిల్లా లేక డ్రాఫ్టా? అయితే ఎప్పుడు పంపాలి? ముఖ్యమంత్రి అడ్డుకొంటే ఏమి చేయాలి? ఇలా ఒకటేమిటి ప్రతీ అంశంపైనా లీకులు, అనుమానాలు, చర్చలు, సమావేశాలే. అయినా దానికి అంతు తెలియదు.
శాసనసభ ప్రోరోగ్ అంశం ఇంకా సర్దుమణుగక ముందే ఇప్పుడు మరో పాత అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. త్వరలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతున్నఈ తరుణంలో హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేయమని కొందరు సీమాంధ్ర కేంద్రమంత్రులు పట్టుబడుతుంటే, వీలేదని టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంత కాలం రాష్ట్ర విభజనపై అధిష్టాన నిర్ణయమే తమకు శిరోధార్యమని చెపుతూ వచ్చిన కావూరి, జేడీ శీలం వంటి వారు ఈ డిమాండ్స్ చేస్తున్నట్లు మీడియాకి లీకులు ఈయడం వెనుక అర్ధం, ఉద్దేశ్యం ఏమిటి? వారు సీమాంధ్ర ప్రజల కోసం కడదాకా పోరాడుతున్నామని బిల్డప్ ఇచ్చేందుకే ఈవిధంగా చేస్తున్నారా? లేక ఈ వంకతో కాంగ్రెస్ లో కలిసేందుకు నిరాకరిస్తున్న తెరాసను లొంగదీయడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ కుటిలయత్నాలు చేస్తోందా? అసలు రాష్ట్ర విభజన ఏవిధంగా చేయాలో తెలియకనే తికమకపడుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
దేశంలో అన్ని వ్యవస్థలను తన చెప్పుచేతల్లో ఉంచుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయంలో ఇంత అయోమయంలో ఉందంటే నమ్మశక్యం కాదు. తనకి కావలసిన ఏ అంశంపైనైనా తగిన సలహాలు ఇచ్చే మేధావులు, నిపుణులు దాని చేతిలో ఉన్నారు. అందువలన కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అయోమయం కేవలం అతితెలివి ప్రదర్శించడమే. తద్వారా ప్రజలను, తన ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను అయోమయంలో ఉంచే ప్రయత్నం చేస్తోంది. లేకుంటే కావూరి, జేడీ శీలం, పురందేశ్వరి వంటి వీర విధేయులు తనని బెదిరిస్తున్నారని నమ్మశక్యం కాని మీడియా లీకులు ఇచ్చేదే కాదు.