ధర్మ సందేహాలు ఎన్నో
posted on Nov 15, 2013 @ 1:38PM
జగన్ బాధితులలో ధర్మాన ప్రసాదరావు కూడా ఒకరు. కానీ చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఇంకా జైలు గడప తొక్క కుండా ఎలాగో మేనేజ్ చేసుకొంటూ, ఆ జగన్ బాబుతోనే కలిసి రోజూ కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొంటున్నారు. ఆ క్రమంలో వారిద్దరూ ఒకరికొకరు ఎట్రాక్ట్ అవుతునట్లు సమాచారం. ఇంతవరకు కిరణ్ రెడ్డి ఎప్పటికయినా కొత్త పార్టీ పెట్టకపోతాడా అందులో తను చేరకపోతానా? అని త్రిశంకులో ఊగిసలాడుతున్న ధర్మాన, ఈ ఎట్రాక్షన్లో పడి, తనకీ పరిస్థితి కల్పించిన బాబు ఆ బాబేనన్న సంగతి కూడా మరిచిపోయి, ‘పోనీ వైకాపాకి కమిట్ అయిపోదామా?’ అని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
కానీ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదన్నట్లు, సీబీఐ ఇచ్చిన మెడల్స్ వల్ల తనకి టికెట్ రాని కాంగ్రెస్ నుండి, సీబీఐతో అనుబందం పెనవేసుకొన్న కాంగ్రెస్ లోకి జంప్ చేస్తే, రేపు కేసులు ఓ కొలిక్కి వస్తున్నపుడు మళ్ళీ అదే బాబుకి వ్యతిరేఖంగా మాట్లాడవలసి వస్తే? అనే ధర్మసందేహం కూడా ధర్మయ్యని పట్టి వెనక్కి లాగుతోంది.
అంతే గాక తనకంటే ముందే ఆ పార్టీలో సెటిల్ అయిపోయిన బ్రదర్ కృష్ణ దాసు తనకోసం తలుపులు తీసేందుకు బొత్తిగా ఒప్పుకోవడం లేదట. ఇదివరకు అతనిపై మరో బ్రదర్ రామదాసుని ఎన్నికలలో పోటీకి నిలబెట్టడమే అందుకు కారణమని సమాచారం. అయితే ఏ బ్రదర్ ఒప్పుకోకపోయినా బిగ్ బ్రదర్ ఒప్పుకొంటే అన్ని తలుపులు వాటంతటవే తెరుచుకొంటాయని జగమెరిగిన సత్యం.
అయితే కండువా ఏదయినప్పటికీ ఈసారి నేరుగా లోక్ సభకే వెళ్ళిపోవాలని ధర్మాన డిసైడ్ అయిపోయినట్లు సమాచారం. అలాగయితే, ఆ రేంజిలో జిల్లాలో పోటీపడవలసిన వారు ఇద్దరు ఉన్నారు. తండ్రి మరణంతో అతని స్థానంలోకి వచ్చిన ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. కాంగ్రెస్ డీ.యన్.యే. కలిగి ఉన్నకిల్లి రాణిగారు.
రామ్మోహన్ నాయుడు తన ముందు కాకి పిల్లే అనుకొన్నా, అతనికి సానుభూతి ఓటు, జిల్లాలో అతని తండ్రికి ఉన్నమంచి పేరు ప్లస్ పాయింట్స్. ఇక కిల్లి రాణీ గారి గురించి చెప్పేదేముంది? తన పట్టు చీర కొంగుతో రాష్ట్రాన్ని గట్టిగా ముడేసి కలిపి ఉంచుదామనుకొన్నపటికీ ఆ పాడు బీజేపీ, తెదేపాలు ‘యు టర్నులు’ తీసుకొంటున్నాయని ఆవేదన చెందని రోజు లేదు. ఇక ఎలాగు విడిపోయే రాష్ట్రం కోసం రాకరాక వచ్చిన తన కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఉపయోగమేమిటని నిలదీస్తుంటారు కూడా. కానీ ఈసారి కూడా తనకే ఓటేసి గెలిపించేస్తే డిల్లీలో తనకున్న పలుకుబడినంతా ఉపయోగించేసి శ్రీకాకుళానికి ఒక మంచి ప్యాకేజి తెస్తానని హామీ ఇస్తున్నారు.
కానీ మళ్ళీ అంతలోనే ధర్మనకి మరో ధర్మసందేహం కలిగింది. అదే, ఏ కండువా కప్పుకొన్నపటికీ జనాలు గుర్తు పట్టకుండా ఉంటారా? అని. మరి ఈ పద్దులు, సందేహాలు అన్నీ సరి చూసుకొన్న తరువాతనే ఏ కండువా కప్పుకోవాలో, ఏ సీటులో కూర్చొంటే ఐదేళ్ళు కడుపులో చల్ల కదలకుండా హాయిగా కూర్చోవచ్చో ఫైనల్ చేసుకోవడం ధర్మానకి ధర్మంగా ఉంటుంది.