ఫుల్‌స్టాప్ పెట్టిన బాబు!
posted on Nov 16, 2013 @ 4:37PM
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రజల నుంచి ప్రశంసలు అందుకునే తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చేదోడు వాదోడుగా వుండే ఎర్రబెల్లి దయాకరరావు ఈమధ్యకాలంలో పార్టీ క్రమశిక్షణ గీతను దాటడం ఎవరూ ఊహించని పరిణామంగా అందరూ భావించారు.
తన సహచరులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు మీద ఎర్రబెల్లి ఘాటైన పదజాలంతో విరుచుకుపడటం పార్టీలో ఆందోళనకు కారణమైంది. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునే తెలుగుదేశం పార్టీలో మీడియాకెక్కి విమర్శించుకునే కాంగ్రెస్ పార్టీ తరహా సంస్కృతి బయల్దేరడాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. పార్టీకి విధేయుడిగా వుండే ఎర్రబెల్లి తన పొరపాటును దిద్దుకుంటారని అందరూ భావించారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోయినా పరిస్థితి సర్దుకున్న వాతావరణం ఏర్పడింది.
అయితే తాజాగా ఎర్రబెల్లి మరోసారి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడటం, ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీయడం, ఇద్దరూ వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్ళడంతో ఈ అంశంలో చంద్రబాబు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని పార్టీలో చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా మీడియాకెక్కి తిట్టుకోవడం భావ్యం కాదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతున్న సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగడం మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పార్టీలో సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాల విషయంలో చంద్రబాబు ఇంతవరకూ జోక్యం చేసుకోకపోవడం వల్లే నాయకులు కట్టు తప్పుతున్నారని, ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగడం వల్ల ఇలాంటి వివాదాలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇకముందు ఎర్రబెల్లి మీడియాకెక్కి విమర్శలు చేసే అవకాశం వుండదని తెలుగుదేశం పార్టీలో భావిస్తున్నారు.