టీడీపీ నాయకులకు గాలం!

 

 

 

రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఘనకార్యాన్ని విజయవంతంగా పూర్తిచేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని తెలుగుదేశం పార్టీ మీద కేంద్రీకరించాయి. రాష్ట్ర విభజన విషయంలో అడ్డగోలు వాదనలకు పోకుండా ఒక స్పష్టమైన విధానంలో వున్న తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నాలను మూడు పార్టీలూ ముమ్మరంగా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల పార్టీ కాదంటూ గోబెల్స్ ప్రచారం చేసే పని ఎప్పటినుంచో అమలులో వుంది.

 

 

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని తెలంగాణ నాయకులను తమ వైపు లాక్కునే ప్రాజెక్టును మూడు పార్టీలూ చేపట్టాయి. నోటి బలమే తప్ప ఓటుబలం లేని కడియం శ్రీహరి లాంటి నాయకులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బలంగా వున్న తెలంగాణ ప్రాంత నాయకుల మీద మూడు పార్టీల దృష్టి పడింది. టీడీపీలో ఈమధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న ఎర్రబెల్లి దయాకరరావును లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానే తప్ప తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టేది లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లి కోసం గాలం వేసే వుంచింది.


ఇప్పుడు మూడు పార్టీలూ రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సీనియర్ తెలంగాణ నాయకులను తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోంచి మా పార్టీలోకి వస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు వుంటుందంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినా వాళ్ళ పప్పులు ఉడకటం లేదు. హడావిడి చేసే కార్యకర్తలే తప్ప ఓట్లు పడే నాయకులు లేని టీఆర్ఎస్ పార్టీ.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఏ సీటు కావాలన్నా ఇస్తాం. ఏం కోరినా తీరుస్తాం అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఇక తెలంగాణలో పూర్తిగా గల్లంతైపోయిన వైఎస్సార్సీపీ తన దింపుడుకళ్ళం ఆశలతో వుంది. తెలుగుదేశం పార్టీ నాయకులను తనవైపు లాక్కుని అయినా తెలంగాణలో ఉనికిని నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మూడు పార్టీల ఆశలు ఆవిరవడం తప్ప ప్రయోజనం వుండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.