చంద్రబాబుకు గట్టి షాక్.. టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ
posted on May 11, 2016 @ 12:04PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ టీడీపీ నుండి పెద్ద షాక్ తగలనుండా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీఆర్ఎస్ లోకి చేరిపోగా..రెండు రోజుల క్రితమే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనే ఎల్ రమణ, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులతో మంతనాలు జరిపినట్టు సమాచారం.
గత కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ గురించి పట్టించుకోవడం లేదని.. ఇంకా వలస వెళ్లి పోతున్న ఎమ్మెల్యేలను నిలువరించే ప్రయత్నాలు కూడా చేయడంలేదని రమణ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. దీంతో ఇక పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండేదేమోనని భావించి పార్టీ మారాలని నిర్ణయించుకున్న్టట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.