అమితాబ్ కు మరో తలనొప్పి.. జయా బచ్చన్ ను పార్టీలోకి తీసుకోవద్దన్నారు

  బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు ఈ మధ్య టైం అస్సలు బావున్నట్టు లేదు. ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పనామా పేపర్స్ పుణ్యమా అని నల్లకుబేరుల జాబితాలో తన పేరు కూడా బయటపడింది. దీంతో ఇన్ క్రెడిబుల్ ఇండియా అంబాడిసర్ గా కూడా ఛాన్స్ మిస్సయ్యింది. ఇప్పుడు మరోసారి అమితాబ్ కు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయి. ఈసారి అది అమర్ సింగ్ రూపంలో వచ్చి పడింది. జయా బచ్చన్ ను పార్టీలోకి తీసుకోవద్దంటూ బిగ్ బీ చెప్పారని.. జయాకు స్థిరత్వం తక్కువని అందుకే పార్టీలో చోటివ్వదని అమితాబ్ తనకు చెప్పినట్టు వెల్లడించారు. ఆమె ఎప్పటికప్పుడు అలవాట్లని, అభిరుచులని మార్చుకుంటుందని కూడా చెప్పారని బయటపెట్టారు. దీంతో అమర్ సింగ్ వ్యాఖ్యలతో ఎలాంటి గొడవలు వచ్చి పడతాయో అని అమితాబ్ టెన్షన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అమర్ సింగ్, అమితాబ్ కు ఒకప్పుడు చాలా సన్నిహితమైన వ్యక్తి. అయితే కొన్ని విబేధాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

సంవత్సరాలు,వారాలు తెలియని అన్నవరం ఆలయ అధికారులు...

  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయ అధికారులకు తెలుగు సంవత్సరాలు, వారాలు తెలియవనుకుంట. స్వామి వారి కళ్యాణానికి సంబంధించి తయారు చేసిన ఆహ్వాన పత్రికలో తప్పులు దొర్లాయి. ప్రస్తుతం జరుగుతున్న దుర్ముఖి నామ సంవత్సరానికి బదులుగా జయ నామ సంవత్సరమని..మంగళవారానికి బదులు శనివారమని ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. దీంతో భక్తులు-స్థానికులు కూడా ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఆలయ అధికారుల తీరు వల్ల తరచూ వార్తల్లో కెక్కడం ఆలయ పరువు ప్రతిష్టలు మంటగలసిపోవడం కామన్ అవుతోంది. అప్పట్లో ఒక వివాహ కార్యక్రమం సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు జరగడంతో భక్తుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏకంగా స్వామి వారి కళ్యాణ పత్రికల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారులు అభాసుపాలయ్యారు.  

దారుణం.. ప్రేమకు అంగీకరించలేదని చేతులు నరికి హత్య

  మహిళలపై తరచూ జరుగుతున్న ఆకృత్యాలు చూస్తూనే ఉన్నాం.. అయితే జార్ఖండ్ లో జరిగిన ఘటన చూస్తే మాత్రం భయపడాల్సిందే. కళాశాల ఎదురుగానే ఓ విద్యార్దినిని దారుణంగా హత్య చేశారు. చేతులు నరికేసి దుండగులు, ఆమె తలపై మోది హత్య చేశారు. వివరాల ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ లో సోనాలి మర్మ్ అనే వివాహిత మహిళ బీఈడీ చదువుతోంది. అయితే ఆమె ఎప్పటిలాగే కాలేజ్ కి వెళుతుండగా దుండగులు ఆమ చేతులు నరికి, తలపై మోదీ దారుణంగా హత్య చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసకున్నారు.   అయితే ఆమెను ప్రేమిస్తున్నానంటూ సుకేన్ మండల్ అనే వ్యక్తి తరచూ ఆమె వెంట పడుతుండేవాడు. అయితే ఆమెకు పెళ్లైయిన కారణంగా అతని ప్రేమను నిరాకరించింది. దీంతో అతడు ఎప్పటినుండో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. దీంతో అతనే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

ఇంటర్నెట్‌లో పోర్న్ తప్పించి ఇంకేమీ చూడను.. రామ్ గోపాల్ వర్మ

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ.. తన నోటికి ఏది వస్తే అది అనేయడం.. ఎలాంటి కామెంట్లైనా ఈజీగా చేసేయడం చేస్తుంటారు. అలాంటి వర్మ ఇప్పుడు తన గురించే కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు. తన గురించి ఎవరు ఏం అడిగినా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెపుతుంటారు. ఇప్పుడు తాజాగా స్కూప్ఊప్.కామ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సంచలనమైన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ... 'తాను ఇంటర్నెట్‌లో పోర్న్ తప్పించి ఇంకేమీ చూడను' అని బదులిచ్చాడు వర్మ. దీంతో వర్మ ఇచ్చిన సమాధానానికి అందరూ షాకయ్యారు.

మద్యం తాగనివ్వలేదని.. భార్యని చంపిన పోలీస్ అధికారి

  మద్యం తాగనివ్వలేదని తన భార్యను చంపి.. తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఓ పోలీసు అధికారి. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో పూల్ సింగ్ యాదవ్, గీతాదేవి భార్య భర్తలు. పూల్ సింగ్ యాదవ్ రాజస్థాన్ సీఎం భద్రతా సిబ్బందిలో ఎఎస్సై స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే తనను మద్యం తాగనివ్వలేదని పూల్ సింగ్ యాదవ్ భార్యతో వివాదానికి దిగాడు.. అనంతరం కోపంతో రివాల్వర్ తో కాల్చి చంపాడు. తరువాత అల్వార్ జిల్లాలోని ఖైర్‌తాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి కొద్ది సేపు స్టేషన్‌లో కూర్చుని ఇవాళ ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫూల్‌చంద్ యాదవ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

మోడీ డిగ్రీ పట్టాను వెబ్‌సైట్‌లో పెట్టండి.. కేజ్రీవాల్

  ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్ కు లేక రాసిన సంగతి తెలసిందే. అయితే దీనిపై కమిషనర్ స్పందించి మోడీ విద్యార్హతల గురించి వివరణ ఇచ్చారు. మోడీ గుజరాత్ యూనివర్శిటీ నుండి  ఎం.ఎ పొలిటికల్ సైన్స్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎం.ఏ. రాజనీతి శాస్త్రంలో 62.3 శాతం మార్కులతో పాస్ అయ్యారని.. ఎం.ఏ. సెకండ్ ఇయర్ లో రాజనీతిశాస్త్రంలో 64 మార్కులు, ఐరోపా-సామాజిక రాజనీతిజ్ఞతలో 62 మార్కులు, ఆధునిక భారతదేశం-రాజకీయ విశ్లేషణలో 69 మార్కులు, రాజనీతి మనోవైజ్ఞానిక శాస్త్రంలో 67 మార్కులు మోదీ సంపాదించారుని తెలిపారు.   అయితే ఇప్పుడు దీనిపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీ వీసీకి కేజ్రీవాల్ మరోసారి లేఖ రాశారు. మోడీ డిగ్రీ పట్టాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.

ఐదు పైసల కోసం... 40 ఏళ్లుగా కండక్టర్ పోరాటం

  ఐదు పైసల కోసం నలభై ఏళ్లుగా ఓ వ్యక్తి పోరాడుతూనే ఉన్నాడు. ఐదు పైసలేంటి.. నలభై ఏళ్లుగా పోరాటం ఏంటని ఆశ్చర్యంగా ఉంది కదా..వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. దీని అసలు కథ ఏంటంటే.. రణవీర్ సింగ్ యాదవ్ అతనికి ఇప్పుడు 73 ఏళ్లు. 1973 లో తాను ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ (డీటీసీ)బస్సులో కండక్టర్ గా పనిచేసేవాడు. అయితే అతను టికెట్ కోసం ఓ మహిళా ప్రయాణికురాలు దగ్గర 10 పైసలు బదులుగా 15 పైసలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో చెకింగ్ స్టాప్ బస్సులోకి ఎక్కి యాదవ్ పై ఇంటర్నల్ విచారణ చేపట్టారు. ఇక అప్పటి నుండి అతను ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే 1990లో కార్మికుల న్యాయస్థానంలో యాదవ్ ఈ కేసు గెలిచినప్పటికీ, మళ్లీ తర్వాత ఏడాదిలో ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అతనిపై కేసును తిరగదోడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.   అయితే దీనిపై విచారించిన కోర్టు.. డీటీసీ వేసిన పిటిషన్ కొట్టేస్తూ అక్షింతలు వేసింది. దాదాపు 40 ఏళ్లుగా అతను పోరాటం చేస్తున్నాడు.. కార్మికుల న్యాయస్థానంలో గెలిచినా ఫలితాన్ని అతనికి దక్కకుండా చేశారు అని కోర్టు మండిపడింది. అంతేకాదు నష్టపరిహారంగా.. యాదవ్ కు రూ.30వేలు నష్టపరిహారంగా రవాణా సంస్థ చెల్లించాలని తీర్పునిచ్చింది. అతని పారితోషికం రూ.1.28 లక్షలు, సీపీఎఫ్ రూ.1.37 లక్షలు వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై తుది విచారణ మాత్రం మే 26న యాదవ్ హాజరు కావాల్సి ఉంది.

రోడ్డుపై నీళ్లు పోస్తే ఇక జైలుకే..

  అసలే ఇప్పుడు పలు రాష్ట్రాలు నీటి సమస్యతో అల్లల్లాడుతున్నాయి. మహారాష్ట్రలోని లాతూర్ కి అయితే రైళ్లతోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై నీటిని వృథాగా పాడు చేసే వారికి జైలు శిక్ష విధించడానికి సిద్దమైంది. అసలు సంగతేంటంటే.. హర్యాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే దీనికి జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని వాడుతున్నారంట. దీంతో ఈనిర్మాణాలకి దాదాపు 5 కిలోమీటర్లు దూరానికి రూ. 3 కోట్ల రూపాయలు ఖర్చువతోందట. అయితే హర్యానాలో పలు గ్రామాల్లో.. గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయట. దీంతో అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా రూ.10,000 జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది.

మూడు రోజుల పాటు వాట్సాప్ నిషేదం..

  స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లందరకీ వాట్సాప్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో ఇవి కూడా ఒక భాగమైపోయాయి. అలాంటి వాట్సాప్ ను నిషేదిస్తే. హమ్మో అనుకుంటున్నారా.. అయితే అది ఇక్కడ కాదులేండి.. అది కూడా శాశ్వతంగా కాదు.. ఓ మూడు రోజులపాటు. ఇంతకీ నిషేదించింది ఎక్కడ అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. బ్రిజిల్ లో వాట్సాప్ ను మూడురోజుల పాటు నిషేదిస్తూ అక్కడి కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి అసలైన కారణం ఏంటనేది క్లియర్ చెప్పకపోయినా.. బ్రెజిల్ లో పలు నేరాలు చేసే దొంగలు, క్రిమినల్స్ అంతా ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో వారి నేరాలను విచారించే పోలీసులకు సమాచారం అవసరం ఉన్నందున చాలాసార్లు ఆ కంపెనీలను కోరిన సహకరించలేదని తెలుస్తోంది. అందుకే బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దాదాపు 100 మిలియన్లమంది వాట్సాప్ యూజర్లపై ఈ ప్రభావం పడింది.

నీటి రైలును అడ్డుకున్న యూపీ ప్రభుత్వం.. మాకు అవసరం లేదు..

  ప్రస్తుతం మహారాష్టలోని లాతూర్ నీటి ఎద్దడితో అలమటిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రత్యేక నీటి రైళ్ల ద్వారా నీటిని తెప్పించి మరీ ప్రభుత్వం వారి కష్టాలను తీర్చుతోంది. లాతూర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కూడా నీటి సమస్యతో అల్లాడుతోంది. లాతూర్ లాగే వీరికి కూడా కేంద్రం నీటి రైలు పంపింది. కానీ ఆరాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకు నీటి రైలు వద్దని చెప్పి దానిని అడ్డుకుంది. ఎల్లుండి ఆ రాష్ట్ర సీఎం ప్రధాని మోదీతో నీటి ఎద్ద‌డి స‌మ‌స్య‌పై భేటీ కానున్నారు. బుందేల్‌ఖండ్‌కు అఖిలేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.

పదేళ్ల బుడతడికి ఫేస్ బుక్ రూ.6.6 లక్షలు బహుమతి

పదేళ్ల బుడతడు ఏకంగా ఫేస్ బుక్ నుండి రూ.6.6 లక్షలు బహుమతి అందుకున్నాడు. ఫేస్‌బుక్ సంస్థ బగ్‌ బౌంటీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఫేస్ బుక్ లో లోపాలను గుర్తించిన వారికి తగిన బహుమతి అందజేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఫిన్ లాండ్ కు చెందిన జానీ అనే పదేళ్ల బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్యూరిటీ లోపాన్ని క‌నుగొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను, కామెంట్ల‌ను డిలేట్ చేయ‌డానికి అనువుగా ఉన్న లోపంతో ఉందని.. దానికి పరిష్కారం కూడా కనుగొని ఫేస్ బుక్ కి మెయిల్ చూశాడు. దీంతో ఫేస్ బుక్ జానీకి 10 వేల డాలర్లు అంటే రూ.6.6 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించింది.

ప్రత్యేక హోదాపై ఏపీలో మొదలైన నిరసనల సెగ.. పవన్ కళ్యాణ్ మాట్లాడాలి..

  ప్రత్యేక హోదాపై నిన్న పార్లమెంట్లో కేంద్రమంత్రి జయంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలకు గాను ఏపీలో నిరసనల సెగలు మొదలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని.. విభజన చట్టంలో ఇది లేదని సిన్హా చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఆదోళనలు చేపడుతున్నారు.   విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వార్యంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిందంటూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్, న‌రేంద్ర మోదీ, వెంక‌య్య‌నాయుడు రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమంపై ఎన్నో మాట‌లు చెప్పారని ఇప్పుడు హోదా లేదంటూ ప్రకటించారు.. ఇప్పుడు దీనిపై వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా  మోడీ ఇచ్చారు.. ఇప్పుడు బీజేపీ ప్రకటన సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ విషయం పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.   మరోవైపు విశాఖలో కూడా ప్రత్యేక హోదాపై నిరసనలు మొదలయ్యాయి. విశాఖ‌ప‌ట్నంలో అంబేద్కర్‌ జంక్షన్‌లో విద్యార్థి జేఏసీ ఆందోళ‌న చేస్తోంది. కేంద్రం ప్రకటనను వెనక్కి తీసుకోవాల‌ని, లేదంటే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రిస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

కోల్‌కతా.. చివర విడత పోలింగ్.. 69 ఏళ్ల తరువాత ఓటు

  పశ్చిమ బెంగాల్ తుది విడత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పోలింగ్ జరగనుంది. కాగా ఐదో దశ ఎన్నికల పోలింగ్ సమయంలో టీఎంసీ కార్యకర్తలకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగి హింసాత్మక ఘటనలు నెలకొన్న నేపథ్యంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి సుమారు 50 వేలమంది భద్రతాదళాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌, ఈస్ట్‌మిడ్నపూర్‌ జిల్లాల్లోని 25 నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లోని కూచ్ బీహార్ జిల్లాలో 15 సమూహాలకు 9 వేల మంది ఓటర్లు 69 ఏళ్ల తరువాత మొదటిసారి తమ ఓటును వినియోగించుకోనున్నారు.

రోగి పడకపై కాలు పెట్టి.. ఐఏఎస్ అధికారి అహంకారం

  చదవు సంస్కారం నేర్పుతుంది అంటారు. కానీ ఉన్నత చదువులు చదువుకొని.. ఒక అత్యున్నత పదవిలో ఉన్న కొందరు మాత్రం అలాంటి సంస్కారం మరచిపోయి. అధికారంలో ఉన్నాం కదా తామేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని ప్రవర్తిస్తుంటారు. ఒక్కొక్కరూ, ఒక్కో రకంగా తమ అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ యువ ఐఎఎస్ అధికారి కూడా అలాగే ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. చత్తీస్ గఢ్ కు చెందిన జగదీశ్ శంకర్ అనే ఐఏఎస్ అధికారి ఒక ఆస్సత్రిని సందర్శించారు. అయితే అక్కడ ఒక మహిళతో మాట్లాడుతూ.. రోగుల పడకకు ఉండే స్టీల్ రెయిలింగ్ పై దర్జాగా కాలు పెట్టి మాట్లాడారు. అంతే ఇంతలో ఆ ఫొటో తీసి సోషల్ మీడియా పెట్టేసరికి  ఐఎఎస్‌ అధికారి నిర్వాకం బయటపడింది. దీంతో ఆయనపై నెటిజన్లు మండిపడుతూ.. ఆయనపై విమర్శల బాణాలు సంధించారు. రోగులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోమని, ఈ సంఘటనను పునరావృతం కానివ్వదని, ప్రజలకు మర్యాదనివ్వని నీకు మర్యాద ఎవరిస్తారని, ఎలాంటి సంస్కారం నేర్చుకున్నావు, నీలాంటి కొడుకును కన్న తల్లిదండ్రులు ధన్యమయ్యారని పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.

అగస్టా స్కాంలో ట్విస్ట్... అప్రూవర్‌గా మారడానికి సిద్ధమైన మధ్యవర్తి

  అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం నేపథ్యంలో రాజ్యసభ అధికార, ప్రతిపక్ష నేతల ఆందోళనతో అట్టుడుకుతోంది. మరోవైపు ఈ కేసులో ఎస్పీ త్యాగిని కూడా ఈడీ మూడు రోజుల నుండి విచారిస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్కాంలో మరో ట్విస్ట్ భయటపడింది. ఈ కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మైఖేల్ అప్రూవర్ గా మారడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని క్రిస్టియన్ తరపు లాయర్ రోస్ మేరీనే స్వయంగా వెల్లిడించినట్టు సమాచారం. క్రిస్టియన్ త్వరలో ఇండియాకు వెళ్లాలని భావిస్తున్నారని.. ఆయన అప్రూవర్ గా మారడానికి సిద్దంగా ఉన్నారని.. అయితే వాస్తవాలు వెల్లడించడానికే తప్ప అరెస్ట్ వారెంట్ పై కాదని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఇండియన్‌ ఎంబసీకి అందచేస్తారని చెప్పారు. దీని ప్రకారం క్రిస్టియన్‌కు తెలిసిన సమాచారం అంతా భారత దర్యాప్తు సంస్థలతో పంచుకుంటారని చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు ఎదురవుతాయో చూడాలి.

ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..పడిపోయిన టీం ఇండియా ర్యాంక్..!

  ఈరోజు ఐసీసీ టి20, వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది. ప్రతీ ఏడాదీ ఐసీసీ రిలీజ్ చేసే ఈ లిస్ట్ లో, ఈ ఏడాది భారత్ కు టి20లో సెకండ్ ప్లేస్, వన్డేల్లో నాలుగో ప్లేస్ దక్కింది. ఇప్పటికే ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో ప్లేస్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి.     టి 20: 132 పాయింట్లతో న్యూజీలాండ్ తొలి స్థానంలో ఉంది. వెస్టిండీస్(3), దక్షిణాఫ్రికా(4), ఇంగ్లండ్ (5), ఆస్ట్రేలియా(6) ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. ఆప్ఘానిస్థాన్ బంగ్లాదేశ్ ను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానం దక్కించుకోవడం విశేషం.   వన్డే ర్యాంకింగ్స్: ఎప్పటిలాగే వన్డేల్లో తొలిస్థానం ప్రపంచకప్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియానే వరించింది. 124 పాయింట్లతో ఆస్ట్రేలియా తొలి స్థానాన్ని దక్కించుకుంది. న్యూజీలాండ్(2), దక్షిణాఫ్రికా(3), భారత్(4), శ్రీలంక(5) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. న్యూజీలాండ్ 113 పాయింట్లు, దక్షిణాఫ్రికా 112 పాయింట్లు, భారత్ 109 పాయింట్లతో ఆయా స్థానాల్లో నిలిచాయి.   టెస్ట్ ర్యాంకింగ్స్: టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని దక్కించుకోగా భారత్ రెండో ప్లేస్ లో నిలిచింది. పాకిస్తాన్(3), ఇంగ్లండ్(4), న్యూజీలాండ్(5) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరో స్థానానికి పడిపోవడం విచిత్రం. 2014-15 మధ్యలో సౌతాఫ్రికాకు పరాజయాలు ఎక్కువశాతం ఉండటమే ఇందుక్కారణం.