జగన్ టూర్ పై సొంత పార్టీ నేతలే ఏడ్పా..?
posted on Jun 24, 2016 @ 5:04PM
రాష్ట్రంలో ఒకపక్క ముద్రగడ దీక్ష..మరోపక్క తాత్కాలిక సచివాలయంలో నేల కుంగిపోవడం.. మరి ఇన్ని జరుగుతుంటే.. వీటిని ప్లస్ చేసుకొంటూ.. ఇంకేముంది ఇన్ని జరగడానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఊదరగొట్టే జగన్ ఎక్కడ..? ఏ చిన్న పాయింట్ దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబుని విమర్శిద్దామని చూసే జగన్ ఎక్కడ..? ఇంక ఎక్కడ.. చక్కగా బ్రిటన్ లో విహరిస్తున్నాడు. లేకపోతే ఇంత సైలెంట్ గా ఉంటారా. అయితే ఇప్పుడు ఆయన వెళ్లడం ఏమో కానీ చాలా మంది నేతలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారంట. అది కూడా పార్టీ నేతలే కావడం విశేషం.
ఒకపక్క కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ముద్రగడ చేస్తున్న దీక్షతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడంతో నేతలు చాలా ఫీల్ అవుతున్నారట. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతుంటే.. ఇలాంటి సమయంలో జగన్ విహార యాత్రకు వెళ్లడం బాధకరం అంటూ వాపోతున్నారట. అంతేకాదు జగన్ అక్కడ తీసుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వాటిలో జగన్ మోహన్ గోల్ఫ్ ఆడుతున్నాడు. ఇంకేముంది ఆ ఫొటోలను చూసి ఇంకా ఏడుస్తున్నారంట.
ఇవన్నీ ఒకఎత్తైతే.. దీనిపై టీడీపీ నేతలు కూడా స్పందించడం ఇంకో ఎత్తు. జగన్ చాలా బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని.. వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో ఆరోపిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ విదేశీ పర్యటన మాత్రం చాలామంది నేతలకు కడుపుమంటను పుట్టిస్తుందని అర్ధమవుతోంది. ఆయన మాత్రం ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలా అని చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి.