ఢాకా ఉగ్రదాడి: భారత సరిహద్దుల్లో భద్రత పెంపు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ.. అధికారులను ఆదేశించింది. దీంతో పశ్చిమబంగా, అసోం, త్రిపుర, మేఘాలయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో నుంచి భారత్‌లోకి ప్రవేశించి మార్గాల వద్ద సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ సైన్యానికి సూచించింది. అటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బంగ్లాదేశ్‌లోని దౌత్య అధికారులతో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఢాకాలో ఉన్న భారతీయులందరూ క్షేమంగానే ఉన్నారని బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. 

అనంతలో ఐసిస్ కలకలం..?

ఐసిస్.. ఈ పేరు వినగానే ప్రస్తుతం ప్రపంచం గడగడలాడిపోతోంది. వరుస దాడులతో మారణహోమాన్ని సష్టిస్తోంది ఐఎస్. తాజాగా హైదరాబాద్‌‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాది మకాం వేశాడని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎన్ఐఏ అదుపులో ఉన్న మహ్మద్ యజ్దాని అనంతపురం వచ్చినట్లు నిఘా వర్గాలు హెచ్చిరించడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనంత నగరంలోని లాడ్జిలు, అపార్ట్‌మెంట్లలో సోదాలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా లాడ్జిల్లోకి ఎవరెవరు వచ్చారన్న వివరాలను కూడా పరిశీలించారు.  

నాగంను కొట్టబోయిన టీఆర్ఎస్ కార్యకర్తలు..

తెలంగాణ బీజేపీ నేత నాగం జనార్థన్‌రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ దగ్గర నాగం మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నాగంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...ఈ క్రమంలో నాగంపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగి తోపులాట జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన గులాబీ దండు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

వాళ్లు పొగొట్టినా..నేను సంపాదిస్తా-చంద్రబాబు

ఐదు రోజుల చైనా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ మీదుగా విజయవాడ చేరుకున్నారు. బెజవాడ చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం చైనా పర్యటన విశేషాలను సీఎం మీడియాకు వివరించారు.   విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుండేదని కానీ కాంగ్రెస్ పార్టీ ఆ బ్రాండ్‌ను దెబ్బతీసిందన్నారు. ఈ క్రమంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని అన్నారు. రెండోతరం పారిశ్రామిక వేత్తలను తయారు చేసిన ఘనత టీడీపీదేనని ముఖ్యమంత్రి తెలిపారు. మనం బయటికెళ్లి వ్యాపారం చేయడం కాదు..బయటివారు మనదగ్గర వ్యాపారం చేసే రోజులు రావాలని ఆకాంక్షించారు. స్పీడ్, స్కిల్, స్కేల్‌‌కు చైనా మరోపేరుగా ఉందన్నారు. భారత్ కంటే ముందుగా చైనాలో సంస్కరణలు అమలయ్యాయని తెలిపారు. చైనా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా చేస్తానన్నారు.

ఫ్యాంట్ విప్పితే..అసలు నిజం తెలిసింది..

"కూటి కోసం కోటి విద్యలు" అన్నట్లు ఒక వ్యక్తి బిచ్చమెత్తుకుని బతకాలనుకున్నాడు. దీనిలో ఏ తప్పులేదు..మామూలు బిచ్చగాడైతే ఎవరూ బిచ్చం వెయ్యరని అనుకున్నాడేమో చైనాలోని ఒక వ్యక్తి అంగవైకల్యం ఉన్నవాడిలా నటించేందుకు పెద్ద ఫ్యాంటు వేసుకుని కాళ్లు కనిపించకుండా కవర్ చేశాడు. అయ్యో పాపం అని చాలా మంది రోజూ భిక్ష వేసేవారు. అయితే నిజం ఏనాటికైనా బయటపడక తప్పదు కదా..! రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తికి ఇతనిపై అనుమానం కలిగింది. అంతే ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి అతడి ఫ్యాంటు విప్పాడు. లోదుస్తుల్లో రెండు కాళ్లు కట్టేసుకుని..కాళ్లు లేనివాడిగా నటిస్తున్న బిచ్చగాడి భండారం బయటపడింది. విషయం తెలిసిపోవడంతో అతను అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్..

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెం పునుకుడు చెలక గ్రామం వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే రక్షణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి మేరకు ప్రతిపాదిత ప్రాంతాన్ని రక్షణ శాఖ అధికారులు పరిశీలించారు. వీరి నివేదికను పరిశీలించిన రక్షణ మంత్రిత్వ శాఖ విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం చీఫ్ జస్టిస్‌ని కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల విభజనపై తెలంగాణ న్యాయాధికారులు చేస్తున్న ఆందోళన రోజు రోజుకి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలిప్ భోస్లే ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్.ఠాకూర్‌తో ఆయన భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్ తదితర అంశాలపై భోస్లే చీఫ్ జస్టిస్‌కు వివరిస్తున్నారు. హైకోర్టు త్వరగా విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదులు ఢిల్లీలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

పోలీసులను చూసి గొంతు కొసుకున్న స్వాతి హంతకుడు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతిని హత్య చేసిన నిందుతుడిని రామ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు తమిళనాడులోని తిరునల్వేలీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి అతన్ని అరెస్ట్‌ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులను చూడగానే రామ్‌కుమార్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది.   ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్‌కుమార్ తిరునల్వేలీలోని సెంగట్టాయ్‌ ప్రాంతానికి చెందినవాడు.  అతను ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని, స్వాతి ఉంటున్న హాస్టల్ ప్రాంతంలోనే ఉన్నాడని చెబుతున్నారు. తనను ప్రేమించాలని కొద్ది నెలలుగా స్వాతి వెంటపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అతన్ని నిరాకరించడంతో పగపెంచుకున్నాడు. ఈ నెల 24న చెన్నై నుంగంబాక్యం రైల్వేస్టేషన్‌లో ఆఫీసుకు వెళ్లేందుకు ట్రైన్ కోసం నిరీక్షిస్తుండగా స్వాతితో గొడవపడ్డాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపినట్లు తెలుస్తోంది. రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలలో రికార్డైన ఫుటేజీ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడి జాడను కనుగొన్నారు.

ఆగని ఉగ్రదాడులు: మొన్న టర్కీ..నిన్న కాబూల్..నేడు ఢాకా

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల మారణకాండ ఆగడం లేదు. మొన్న టర్కీలోని అటాటర్క్ విమానాశ్రయంపై దాడి చేసి 41 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ తెల్లవారుజామునే ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పోలీస్ వాహనశ్రేణి లక్ష్యంగా ఆత్మహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది పోలీసులు అమరులయ్యారు. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ముష్కరులు టెర్రర్ సృష్టించారు.  నగరంలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్‌లోకి ఉగ్రవాదులు చోరబడి అక్కడున్న వారిని బంధించారు.   సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి బందీలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. బందీల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.  ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటి వరకు 12 మంది బందీలను విడిపించినట్టు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్టారెంట్ ప్రాంతానికి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఢాకా ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అక్కడ భారతీయులంతా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలు వేరు వేరుగా ప్రకటించాయి.

హేట్సాఫ్ టూ ఎన్ఐఏ..పేలుళ్ళ కుట్ర ఎలా తెలిసింది..?

  హైదరాబాద్‌లో వీకెండ్‌కు భారీ విధ్వంసానికి స్కెచ్ గీసిన ఇస్లామిక్ ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. దేశాన్ని పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కించిన ఎన్‌ఐఏపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు హైదరాబాద్ లో పేలుళ్లకు ఉగ్రవాద సానుభూతిపరులు కుట్ర పన్నారని ఢిల్లీ లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎలా పసి గట్టింది..? భాగ్యనగరంలోని చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మీ ఆలయంతో సహా వివిధ దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ను పేల్చి వేయాలని వారు పథకం వేసినట్టు ఎలా తెలుసుకుంది. దీని వెనుక ఎన్ఐఏ రెండేళ్ల కష్టం ఉంది.   ఐసిస్ గ్రూప్ మీద, దేశంలో ఉగ్రవాద సానుభూతిపరుల మీద నిఘా పెట్టింది. స్లీపర్‌సెల్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు..ఏం చేస్తున్నారు..ఎవరెవరిని కలుస్తున్నారు వంటి వాటిపై ఆరా తీస్తూ వచ్చింది ఎన్ఐఏ. వీరికి సిరియాలోని ఐసిస్‌తో లింకులున్నట్లు 2014లోనే ట్రేస్ చేశారు. ఉగ్రవాద సానుభూతిపరులపై గత నెల 22నే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.  ఒకేసారి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించేందుకు కోర్టు నుంచి అనుమతి పొందింది.. ఓల్డ్‌సిటిలో సోదాలు జరిపి 11 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐదుగురిని తప్ప మిగిలిన వారిని విడుదల చేసింది. అలా ఉగ్రవాదుల ఎత్తులను చిత్తు చేసింది.

ఫ్రీజ్‌లో ఏం పెట్టోద్దు..పెట్టినా తినోద్దు

  మార్కెట్ నుంచి ఫ్రెష్‌గా తీసుకువచ్చే కూరగాయలు, పండ్లు లాంటి వాటిని పాడైపోతాయని ఫ్రీజ్‌లో పెట్టడం డైలీ అందరూ చేసే పనే. అలా పెట్టిన వాటిని మనకి అవసరమైనప్పుడు వాడుకుంటాం. అలాంటి వారందరికి షాకిచ్చారు నిపుణులు. రోజుల తరబడి ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచే ఆహార పదార్థాలతో శీతల ఉష్ణోగ్రత రసాయనిక చర్య జరుపుతుందని... ఈ పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని ఫుడ్ స్టాండర్స్ ఏజెన్సీ చెబుతోంది. ముఖ్యంగా మిల్క్ ప్యాకెట్స్ ను ఫ్రిజ్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంటోంది. సో..బీ కేర్ ఫుల్.

మందెక్కువైంది.. బట్టలు విప్పేశారు

  తాగినోడు లోకాన్ని మరిచిపోతాడని అందరూ అంటుంటే ఎంటో అనుకున్నాం. నిన్న రాత్రి మన హైదరాబాద్‌లో జరిగిన ఘటనను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఇద్దరు ఆకతాయిలు పీకల దాకా తాగారు. తాగితే జనానికి వచ్చిన నష్టమేమి లేదు..కాని తాగిన మత్తులో మనోళ్లు మనుషులమని..జనం మధ్య బతుకుతున్నామని మరచిపోయారు. అంతే ఒంటిపై బట్టలులేకుండా అర్ధరాత్రి రోడ్డుపై చిందులేశారు. ఇది చూసినోళ్లంతా ఇదేంటని ప్రశ్నించారు..మత్తులో ఉన్నోళ్లకి ఆ మాటలేం వినిపిస్తాయి. ఎంత చెప్పినా వినకపోయేసరికి పోలీసులకు ఫోన్ చేశారు. వారొచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

15 ఏళ్ల బాలికపై అత్యాచారం..వీడియో వాట్సాప్‌లో

దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో ఆడవారిపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఆగ్రాలో మరో దారుణం జరిగింది. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన స్కూల్ డైరెక్టరే కామాంధుడిగా మారాడు. జితేందర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఓ 15 ఏళ్ల బాలికను తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. ఆమె బతిమాలినా వినకుండా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ కామాంధుడికి తృప్తి కలగలేదు..ఆమెతో గడిపిన వీడియోను వాట్సాప్‌‌లో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు. దాదాపు సంవత్సరం నుంచి తనను బలవంతంగా అనుభవిస్తున్నాడని..తాను చెప్పినట్లు రాకపోతే వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించేవాడని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కామాంధుడి వలలో 20 మందికి పైగా అమ్మాయిలు చిక్కుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఆ దుర్మార్గుడు పరారీలో ఉన్నాడు.

మహిళ ప్రాణం తీసిన సిద్దూ కాన్వాయ్

  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక సన్మాన సభలో మహిళ పబ్లిక్‌గా సిద్దూకి కిస్ ఇచ్చిన ఘటనను మరవకముందే మరో వివాదం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంది. జూన్‌ 25న హోస్కొటే సమీపంలో సిఎం కాన్వాయ్ కు లైన్ క్లియర్ చేసేందుకు చిక్కబల్లాపూర్‌-చింతామణి హైవేపై ట్రాఫిక్‌ను దాదాపు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ కూడా ఉంది. ట్రాఫిక్ ఎంతకు క్లియర్ కాకపోవడంతో తన తల్లి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని.. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని ఓ వ్యక్తితో పాటు, మిగతా వాహనదారులు కోరినా పోలీసులు కనికరించలేదు. సీఎం కాన్వాయ్‌ వెళ్లిన తర్వాతే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకునేసరికి ఆలస్యమైపోయింది..మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు.

సమస్యల సుడిగుండంలో జగన్‌కు కొత్త టెన్షన్

  ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తల్లడిల్లిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒకదశలో రాజ్యసభ సీటు వస్తుందో రాదోనన్న బెంగ పట్టుకుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజ్యసభ సీటు దక్కించుకుని ఊపిరిపీల్చుకుంది వైసీపీ. జంపింగ్‌లు ఆగిపోయాయి అనుకుంటూ ఉపశమనం పొందుతోన్న ఈ తరుణంలో జగన్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు అధికార టిడిపిలోకి వెళ్లిపోగా, మళ్లీ ఫిరాయింపులు షురూ కానున్నాయంటూ వైసీపీ నిఘావర్గాలు అధినేతకు సమాచారం అందించాయి. ఇప్పటికే ఈడీ అటాచ్‌మెంట్‌తో ఏం చేయాలో తోచక కిందా మీదా పడుతున్న జగన్‌కు ఈ వార్త కొత్త టెన్షన్‌ను తీసుకొచ్చింది.

జనగామలో ప్రత్యేక జిల్లా ఉద్యమం హింసాత్మకం

వరంగల్ జిల్లా జనగామ కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఇవాళ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులు హైదరాబాద్-వరంగల్ రహదారిపై భైఠాయించి నినాదాలు చేశారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లురువ్వారు. ఈ ఘటనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. రహదారిపై ఆగివున్న జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.  

మోడీ బేటీ బచావో అంటూంటే..బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో

ఓ వైపు మోడీ బేటీ బ‌చావో..బేటీ ప‌డావో మంత్రాన్ని జ‌పిస్తుండ‌గా బీజేపీ నేత‌లు మైన‌ర్ బాలిక‌ల‌ జీవితాలతో ఆడుకుంటున్నారు. జార్ఖండ్ బిజెపి అధ్యక్షుడు టలా మరాండీ కుమారుడు 11 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకోవడం అక్కడ సంచలనం కలిగించింది. 18 ఏళ్ళ వయస్సువాడైన మున్నా మరాండీ గొడ్డా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను జూన్ 27న బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. ఈ వివాహం జరగడానికి ముందు..పెండ్లి చేసుకుంటానని చెప్పి మరో మైనర్‌పై రెండేళ్లుగా లైంగికదాడికి దిగారని ఆరోపణలు వచ్చిన మూడు రోజులకే మున్నా మరో మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడం జార్ఖండ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం నాడు జరిగిన రిసెప్షెన్‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ హాజరుకావలసి ఉంది. చట్టవ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తాను వెళితే అమ్మో..! ఇంకేమైనా ఉందా అనుకున్న సీఎం చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.