హరీశ్, రేవంత్ రెడ్డి.. ఎవరి పంతం నెగ్గుతుందో..?
posted on Jun 24, 2016 @ 5:35PM
మల్లన్న సాగర్ పై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు మధ్య రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు, రేవంత్ రెడ్డిలు పోటా పోటీగా సవాళ్లు చేస్తున్నారు. ఒకపక్క ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టి తీరుతామని హరీశ్ రావు అంటుంటే.. మరోపక్క రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అంటూ దీక్ష చేస్తానని పూనుకున్నారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతోన్న పథకాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తెలంగాణ ఏర్పాటుకు సహకరించని నాయకులు ఇప్పుడు అభివృద్ధికి కూడా సహకరించడం లేదని అంటున్నారని.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కట్టి తీరతామని అంటున్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో సర్వం కోల్పోతున్న ముంపు గ్రామాల ప్రజల కోసం ఏటిగడ్డ కిష్టాపురంలో 48గంటల దీక్ష చేపడుతానని.. . ముంపు గ్రామాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం పోలీసు బలగాలతో అడ్డుకున్నా దీక్ష చేసి తీరుతానన్నారు. ముంపు గ్రామాలకు కేసీఆర్, హరీశ్‌రావు వెళ్తే, ప్రజలు బట్టలిప్పదీసి కొడతారన్నారు. దమ్ముంటే ముంపు గ్రామాలకు రావాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. తాను కూడా వస్తానని, ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి, ఏం కావాలో అడిగి, ఒప్పిద్దామన్నారు. మరి ఇద్దరు నేతలూ మంచి పట్టున్న నేతలే.. ఈనేపథ్యంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.