చంద్రబాబు, కేసీఆర్.. మళ్లీ మొదలైంది..
posted on Jun 25, 2016 @ 10:32AM
అనుకున్నంత పనే జరిగింది. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ గురించి కూడా ఇరు రాష్ట్రాల మధ్య రగడ మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఏపీ భవన్ గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని.. ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తెలంగాణకు బదిలీ చేయాలని.. ఏపీ భవన్ స్థలంలో తెలంగాణ నూతన భవనాన్ని నిర్మించుకుంటామని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు.
ఇప్పుడు దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఒక పక్క కేంద్రం నుండి నిధులు రాక మొత్తుకుంటుంటే.. మనకు సహకరించాల్సింది పోయి.. అన్నింటిలోనూ ఇబ్బంది పెడతారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ మనం ముందుకెళ్లాలి. తెలివే మన ధైర్యం. దృఢ సంకల్పంతో ముందుకెళ్లాల్సి ఉంది. 4 శాతం జనాభా ఉన్న ఏపీ... జేఈఈలో 15 ర్యాంకులు దక్కించుకోవడం మన సత్తాకు నిదర్శనం'' అని అన్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందిస్తారా.. లేదా..? ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.