రాహుల్ గాంధీ గురించి చెప్పండి.. లక్ష రూపాయలు తీసుకోండి..
posted on Jun 24, 2016 @ 6:04PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అప్పుడప్పుడు కనిపించకుండా పర్యటనలకు వెళుతుంటారు అది కామన్. గతంలో కూడా ఇలాంటివి చాలానే చూశాం. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఆ తరువాత ఆయన కనిపించకుండా వెళ్లిపోయాడు అనుకోవడం ఇంకా కామన్. ఇప్పుడు మళ్లీ ఆయన విదేశీ పర్యటనపై ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇటీవలే తన 46 వ పుట్టిన రోజు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కొద్ది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. దీంతో రాహుల్ గాంధీ పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్ సిసోడియా మాత్రం ఏకంగా రివార్డునే ప్రకటించేశారు. 'రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి. నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను' అని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేత రవి సక్సేనా వెంటనే ఈ బిజెపి నేత రివార్డుకు కౌంటర్ ఇచ్చారు. బిజెపికి రాహుల్ ఫోబియా పట్టుకుందని అన్నారు. హోంమంత్రిత్వ శాఖను అడిగితే రాహుల్ ఆచూకీ తెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని కారణంగానే సిసోడియా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.